మేమిద్దరం.. మాకైదుగురు.. బీజేపీ ఎంపీ ‘ఫ్యామిలీ ఎక్స్‌పాన్షన్ ప్లాన్’పై సోషల్ మీడియా సెటైర్లు
దశాబ్దాలుగా మన దేశంలో ఒకే పాట వినిపిస్తోంది.. "చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం".. "మేమిద్దరం.. మాకిద్దరు".
దశాబ్దాలుగా మన దేశంలో ఒకే పాట వినిపిస్తోంది.. "చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం".. "మేమిద్దరం.. మాకిద్దరు". పాఠ్యపుస్తకాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల గోడల వరకు ఇదే ప్రచారం. కానీ మారిన ట్రెండ్‌కు అనుగుణంగా ఇప్పుడు ఈ నినాదాలను తుడిచేసి కొత్త పోస్టర్లు రెడీ చేసుకోవాల్సిన సమయం వచ్చిందేమో.. మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ గజేంద్ర సింగ్ పటేల్ ఇచ్చిన తాజా పిలుపు చూస్తుంటే నెటిజన్లకు నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కావడం లేదు. "హిందూ యువత త్వరగా పెళ్లిళ్లు చేసుకుని.. ఐదుగురు పిల్లలను కనాలి" అంటూ ఆయన ఇచ్చిన రివర్స్ క్లాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురిపిస్తోంది.
ఒకప్పుడు 20 ఏళ్లకే పెళ్లిళ్లు అయి.. వేళ్ల మీద లెక్కపెట్టలేనంత మంది పిల్లలు ఉండేవారని ఎంపీ గారు గతాన్ని గుర్తుచేసుకున్నారు. కానీ ఇప్పుడు యువత 30, 35 ఏళ్లు వచ్చినా పెళ్లిళ్లు చేసుకోకుండా ఆలస్యం చేస్తున్నారని.. ఫలితంగా హిందువుల బర్త్ రేట్ 1.9కి పడిపోయిందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ గారి లెక్కల ప్రకారం చూస్తే.. ఇకపై యువత కేవలం కెరీర్ ప్లానింగ్ మాత్రమే కాకుండా దేశ జనాభా నిష్పత్తులను సమతుల్యం చేయడానికి రోజుకు 18 గంటలు పనిచేసి ఐదుగురు పిల్లలను పెంచే "కంట్రీ సర్వీస్ టార్గెట్" పెట్టుకోవాలన్నమాట..
ఇక్కడే నెటిజన్లు అసలైన ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఇల్లు గడవడమే గగనమై ఉద్యోగాలు దొరకక ఐటీ రిటర్న్లు, ఈఎమ్‌ఐలు కట్టలేక సగటు మధ్యతరగతి యువకుడు సతమతమవుతుంటే.. "ఐదుగురు పిల్లలు" అనే మాట వినడానికి ఎంత బాగుందో.. ఆచరించడానికి అంత భయంకరంగా ఉందంటున్నారు. ప్రైవేట్ స్కూల్ ఫీజులు, పాల డబ్బాల ధరలు, హాస్పిటల్ బిల్లులు చూస్తే ఒక్క బిడ్డను పెంచడానికే తలప్రాణం తోకలోకి వస్తుంటే.. ఐదుగురు పిల్లలను కంటే ప్లానింగ్ కమిషన్ కూడా బడ్జెట్ కేటాయించలేదేమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రభుత్వం ఏమో 'కుటుంబ నియంత్రణ' పాటించమని అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటే.. నాయకులు మాత్రం 'ఫ్యామిలీ ఎక్స్‌పాన్షన్ ప్లాన్' ప్రారంభించమని పిలుపునివ్వడం నిజంగా పెద్ద వింతే. పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? ఎంతమంది పిల్లలను కనాలి అనేది పూర్తి వ్యక్తిగత నిర్ణయం. విద్య, ఉద్యోగం, ఆర్థిక భద్రతను బట్టి నేటి యువత అడుగులు వేస్తోంది. రాజకీయ ప్రయోజనాలు, జనాభా లెక్కలు, మతాల నిష్పత్తుల ఆధారంగా పిల్లలను కనడం అనేది ప్రాక్టికల్ కాదని సగటు పౌరుడు స్పష్టం చేస్తున్నాడు.
ఏది ఏమైనా.. "మేమిద్దరం.. మాకిద్దరు" పోయి "మేమిద్దరం.. మాకైదుగురు" అనే కొత్త నినాదం తెచ్చిన ఎంపీ గారి మార్గదర్శకత్వం చూస్తుంటే మున్ముందు పెళ్లిళ్లకు వెళ్లేటప్పుడు ఆశీర్వాదాలతో పాటు "ఐదుగురు పిల్లల బడ్జెట్ ప్లానర్" కానుకగా ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.