ఎంపీగా గెలిచి.... జెడ్పీటీసీగా ఓడి....ఎందుకలా ?
| 2019లో అరకు ఎంపీగా రెండున్నర లక్షలకు పైగా మెజారిటీతో గెలిచిన గొడ్డేటి మాధవికి తాజా పరిషత్ ఎన్నికల్లో షాక్ తగిలింది. మాజీ ఎంపీగా కొయ్యూరు జడ్పీటీసీగా పోటీ చేసిన ఆమె భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. అల్లూరి జిల్లాలో వైసీపీకి బలమైన పట్టు ఉన్నప్పటికీ మాధవి ఓటమి చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జిల్లాలో ఐదు జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉండగా, జడ్పీ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది.
సముద్రాలు ఈదిన వారు చిన్న చెరువులో పడి కొట్టుకుని పోయారు అన్న సామెత చందంగా అరకు ఎంపీ సీటుకు 2019 ఎన్నికల్లో కేవలం పాతికేళ్ళ వయసులో రెండున్నర లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలిచిన గొడ్డేటి మాధవి ఇపుడు కొయ్యూరు జెడ్పీటీసీగా పోటీ చేసి భారీ తేడాతో ఓటమి పాలు అయి ఇబ్బందుల పాలు అయ్యారు అన్న చర్చ వస్తోంది. ఆమె ఎందుకు జెడ్పీటీసీగా పోటీ చేయాల్సి వచ్చిందో తెలియదు కానీ మాజీ ఎంపీగా ఉంటూ ఒక చిన్న మండలంలో తన సత్తా చాటలేకపోయారు అన్నది ఇపుడు చర్చగా సాగుతోంది. ఆమె ఓటమితో వైసీపీ కూడా షాక్ తినాల్సి వచ్చింది అని అంటున్నారు. ఎందుకంటే అల్లూరి జిల్లా అంతా వైసీపీకి వెన్ను దన్నుగా ఉంటూ వస్తోంది. 2014 నుంచి 2024 వరకూ వరసగా మూడు సార్వత్రిక ఎన్నికలు, ఒక స్థానిక సంస్థల ఎన్నిక తీసుకుంటే వైసీపీని ఫ్యాని ని విడవకుండా చేయూత ఇచ్చిన జిల్లా ఇది. అలాంటి చోట తొలిసారిగా మాజీ ఎంపీకి ఓటమి రూపంలో భారీ ఓటమి దక్కింది అని అంటున్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ గా :
అల్లూరి జిల్లా మీద అంత నమ్మకం ఉండబట్టే వైసీపీ పెద్దలు ఎంపీగా చేసిన మాధవిని పిలిచి మరీ జెడ్పీటీసీగా పోటీ చేయించారు. ఆమె కూడా అంతే ధీమాతో బరిలోకి దిగారు. ఇక్కడ పదకొండు మండలాలు ఉన్నాయి. అంటే పదకొండు జెడ్పీటీసీలు అన్న మాట. ఇవన్నీ వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది అని భావించారు. అలా కాకపోయినా మెజారిటీ దక్కుతుందని లెక్క వేశారు. పైగా అరకు ఎంపీగా ప్రస్తుతం తనూజా రాణి ఉన్నారు. అలాగే అరకు పాడేరు ఎమ్మెల్యేలు ఇద్దరూ వైసీపీకి చెందిన వారే. ఆ విధంగా చూసుకున్నా అల్లూరి జిల్లా జెడ్పీ పీఠం వైసీపీ పరం కావాల్సి ఉంది అని అంటున్నారు. కానీ ఇపుడు అల్లూరి జిల్లాలో మాజీ ఎంపీ ఓటమి వైసీపీకి జీర్ణించుకోలేనిది అని అంటున్నారు.
పీఠం దక్కుతుందా :
అయితే ప్రస్తుతానికి చూస్తే అల్లూరి జిల్లాలో అయిదు జెడ్పీటీసీలలో వైసీపీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. అలాగే కూటమి మూడు చోట్ల ఉంది. ఒకటి ఇతరులు ఉన్నారు. దాంతో ఇక్కడ జెడ్పీ పీఠం వైసీపీకి దక్కుతుందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఏది ఏమైనా ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన అరకు ఎంపీ మాధవి ఓటమి మాత్రం పార్టీకి షాక్ ని ఇచ్చింది అని అంటున్నారు. కొయ్యూరు మండలం అయితే వామపక్షాలకు పెట్టని కోటగా ఒకప్పుడు ఉండేది. ఆ తరువాత వైసీపీకి టర్న్ అయింది. మరి అలాంటి చోట పోటీ చేసిన మాజీ ఎంపీ ఓటమి పాలు అయ్యారు అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నరు. దీని మీద వైసీపీ పోస్ట్ మార్టం చేసుకుంటుందా అన్నదే చూడాలి మరి.