వరదలకు క్రేన్ సాయం కోరిన కారు... కమిషనర్ కు లీగల్ నోటీసులు!

ప్రకృతి సిద్ధంగా ప్రజలకు సమస్యలు తలెత్తినప్పుడు.. వాటిని యాక్ట్ ఆఫ్ గాడ్ గా పరిగణించి ఇన్సూరెన్స్ కంపెనీలు లాజిక్కులు మాట్లాడుతుంటాయంటూ "గోపాల గోపాల" సినిమాలో చూపించిన సంగతి తెలిసిందే;

Update: 2025-07-30 07:30 GMT

ప్రకృతి సిద్ధంగా ప్రజలకు సమస్యలు తలెత్తినప్పుడు.. వాటిని యాక్ట్ ఆఫ్ గాడ్ గా పరిగణించి ఇన్సూరెన్స్ కంపెనీలు లాజిక్కులు మాట్లాడుతుంటాయంటూ "గోపాల గోపాల" సినిమాలో చూపించిన సంగతి తెలిసిందే. అయితే... ప్రతీ సమస్యకూ ప్రభుత్వం, అధికారులు బాధ్యత తీసుకోవాలని అంటారు! ఈ క్రమంలో తాజాగా వరదల కారణంగా దెబ్బ తిన్న కారు విషయంలో మున్సిపల్ కమిషనర్ కు లీగల్ నోటీసులు పంపించారో వ్యక్తి.

అవును... శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని కొంతమంది నమ్మినట్లుగా... ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం లేకుండా ప్రజలకు ఎలాంటి నష్టాలు జరగవని చాలా మంది భావిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల వల్ల తన కారు దెబ్బతిందని, అందుకు నష్టపరిహారం చెల్లించాలన్ని కోరుతూ ఓ వ్యక్తి మున్సిపల్ కమిషనర్ కు లీగల్ నోటీసులు పంపించిన విషయం వైరల్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... అమిత్ కిషోర్ అనే వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త ఉత్తరప్రదేశ్‌ లోని ఘజియాబాద్‌ మున్సిపల్ కమిషనర్‌ కు లీగల్ నోటీసు పంపించారు. ఇందులో భాగంగా.. భారీ వర్షం కారణంగా తన ఖరీదైన మెర్సిడెస్ కారు నీటిలో మునిగిపోయి దెబ్బతిందని.. దాని మరమ్మత్తులకు రూ.5,00,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జూలై 23న తన కారులో లజ్‌ పత్ నగర్ సాహిబాబాద్ నుండి వసుంధరకు వెళుతుండగా ఈ సంఘటన జరిగిందని తెలిపారు.

ఆ సమయంలో రోడ్లు తీవ్రంగా జలమయం అయ్యాయని నివేదికలు ఉన్నాయని తెలిపారు! దీంతో.. అతని ఎరుపు రంగు మెర్సిడేజ్ కారు నీటిలో చిక్కుకుని తీవ్రంగా దెబ్బతింది. అనంతరం.. ఆ కారును క్రేన్ ఉపయోగించి నోయిడాలోని ఒక సర్వీస్ సెంటర్‌ కు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో... అక్కడ మరమ్మతులు చేయగా, అందుకు ఖర్చు రూ.5 లక్షలు ఉంటుందని అంచనా!

ఈ నేపథ్యంలోనే అమిత్ కిషోర్ తన న్యాయవాది ద్వారా ఘజియాబాద్ మున్సిపల్ కమిషనర్‌ కు లీగల్ నోటీసు పంపించారు. ఇందులో... మురుగు కాలువలను శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం కారణంగా తన కారు దెబ్బతిన్నదని.. మురుగు కాలువల నిర్వహణలో అవినీతి జరిగిందని, పౌరుల ఫిర్యాదులపై చర్య తీసుకోవడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. నీరు నిలిచిపోవడానికి అక్రమ నిర్మాణాలకు అనుమతించడం కూడా ఒక కారణమని అన్నారు.

ఈ సందర్భంగా... 15 రోజుల్లోపు కార్పొరేషన్ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే.. అమిత్ కిషోర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేస్తారని.. అవినీతి దర్యాప్తు కోసం లోకాయుక్తను ఆశ్రయిస్తారని.. నష్టపరిహారం కోసం సివిల్ క్లెయిమ్ కూడా దాఖలు చేస్తారని నోటీసులో పేర్కొంది. దీంతో... ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది!

Tags:    

Similar News