తాగి తందనాలు ఆడొద్దు.. డబ్బు ఆదా చేయండి.. ఐటీ ఉద్యోగులకు హెచ్చరిక!
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ, తయారీ (మాన్యుఫ్యాక్చరింగ్), రిటైల్ వంటి అనేక రంగాల్లో ఉద్యోగాల కోతలు భారీగా కొనసాగుతుండటం ఐటీ (IT) ఉద్యోగులతో పాటు ఇతర కార్మికుల్లోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.;
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ, తయారీ (మాన్యుఫ్యాక్చరింగ్), రిటైల్ వంటి అనేక రంగాల్లో ఉద్యోగాల కోతలు భారీగా కొనసాగుతుండటం ఐటీ (IT) ఉద్యోగులతో పాటు ఇతర కార్మికుల్లోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ఆర్థిక మాంద్యం భయాలు, మరోవైపు కృత్రిమ మేధస్సు (AI) ఆప్టిమైజేషన్ కారణంగా ఈ అనిశ్చితి మరింత పెరిగింది. నిపుణులు దీనిని కేవలం తాత్కాలిక క్షీణతగా కాకుండా ప్రపంచ ఉద్యోగ వ్యవస్థలో కొత్త దశగా పరిగణించాలని హెచ్చరిస్తున్నారు.
* ఉద్యోగ కోతల తీవ్రత
ఇటీవల 'The Kobeissi Letter' అనే ఆర్థిక విశ్లేషణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలలో ఉద్యోగుల కోతలు కొనసాగుతున్నాయి.
యూపీఎస్ (UPS): 48,000 వరకు ఉద్యోగాలు కోత
అమెజాన్ (Amazon): 30,000 వరకు ఉద్యోగాలు కోత
ఇంటెల్ (Intel): 24,000 వరకు ఉద్యోగాలు కోత
నెస్లే (Nestle): 16,000 వరకు ఉద్యోగాలు కోత
యాక్సెంచర్ (Accenture): 11,000 వరకు ఉద్యోగాలు కోత
మైక్రోసాఫ్ట్ (Microsoft): 7,000 వరకు ఉద్యోగాలు కోత
ఈ ప్రముఖ కంపెనీలు కలిసి దాదాపు లక్షకు పైగా ఉద్యోగులను తొలగించాయి. ఈ కోతలు ఇంకా కొనసాగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుణ భారాలు, కుటుంబ బాధ్యతలు ఉన్న సీనియర్ ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.
* ఉద్యోగుల ఆందోళన – నెటిజన్ల సూచనలు
ఈ కోతలపై ఉద్యోగులు సోషల్ మీడియాలో తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. కొందరు తమ తోటి ఉద్యోగులను ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఒక నెటిజన్ సెర్జియో సూచిస్తూ.. "ఇది సరదా సమయం కాదు. బార్లలో డబ్బులు ఖర్చు పెట్టడం, బయట తినడం మానేయండి. ఆదాయం పెంచే మార్గాలు వెతకండి, ఎంత వీలైతే అంత డబ్బు సేవ్ చేయండి." అని పేర్కొన్నాడు.
మరొక యూజర్ నీయాన్ వైట్ క్యాట్ xAI వంటి కంపెనీలు చివరి నిమిషంలో ఆఫర్‌లను రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఉద్యోగ మార్కెట్ అనిశ్చితిని తెలియజేశారు. అంతేకాక, ఈ తొలగింపులకు AI ఆప్టిమైజేషన్ ఒక ప్రధాన కారణమని, కంపెనీలు క్రమంగా AI ఆధారిత వ్యవస్థలకు మారుతున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. "ఇది తాత్కాలిక మాంద్యం కాదు, AI యుగం తెచ్చిన మార్పు" అని వారు పేర్కొంటున్నారు.
* ఫైనాన్స్ నిపుణుల సలహాలు: భవిష్యత్తుకు సన్నద్ధం
ఈ అస్థిరమైన పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగులు.. ఇతర రంగాల కార్మికులు తప్పనిసరిగా కొన్ని ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి. ఫైనాన్స్ నిపుణులు కింద సూచించిన చర్యలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
అనవసరమైన విలాసాలు, బయట భోజనాలు, ఖరీదైన వినోద కార్యక్రమాలపై చేసే ఖర్చులను తక్షణమే తగ్గించుకోవాలి. ప్రతి పైసాను లెక్కించి ఖర్చు పెట్టడం అలవాటు చేసుకోవాలి.
పొదుపు పెంచాలి. రాబడిలో కనీసం 30% నుండి 40% వరకు పొదుపు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. వీలైతే, ఉద్యోగం కోల్పోయినా కనీసం 6 నెలల నుండి 12 నెలల వరకు సరిపోయే మొత్తాన్ని అత్యవసర నిధిగా వేరుగా ఉంచాలి.
అదనపు ఆదాయ మార్గాలు చూసుకోవాలి. సైడ్ హస్టిల్స్, ఫ్రీలాన్సింగ్ లేదా చిన్న వ్యాపారాల ద్వారా అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించాలి. ఒకే ఆదాయ వనరుపై ఆధారపడటం ప్రమాదకరం.
నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. AI యుగానికి తగ్గట్టుగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. AI, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి భవిష్యత్తు అవసరాలకు సరిపోయే కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం తప్పనిసరి.
ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని, ఐటీ ఉద్యోగులు వివేకవంతమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం అత్యంత అవసరం. కేవలం ఆదాయంపై కాకుండా, ఖర్చుల నియంత్రణ.. పటిష్టమైన ఆర్థిక ప్రణాళికపై దృష్టి సారించి భవిష్యత్తుకు ఆర్థికంగా సిద్ధం కావాలి.