సంక్షేమం కోసం నిపుణుల కమిటీనా ?
రాబోయే ఎన్నికల్లో గెలుపు టార్గెట్ గా సంక్షేమ పథకాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా సంక్షేమ పథకాలను పక్కాగా అమలుచేసేందుకు నిపుణుల కమిటీని నియమించబోతున్నారు.;
రాబోయే ఎన్నికల్లో గెలుపు టార్గెట్ గా సంక్షేమ పథకాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా సంక్షేమ పథకాలను పక్కాగా అమలుచేసేందుకు నిపుణుల కమిటీని నియమించబోతున్నారు. ఈ కమిటీ బాధ్యత ఏమిటంటే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలను, వాటి విధివిధానాలను అధ్యయనం చేయటమే. పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న పేదలు ఎంతమంది ? అందుకు వివిధ ప్రభుత్వాలు అనుసరిస్తున్న నియమ, నిబంధనలు ఏమిటి ? అవుతున్న ఖర్చు తదితరాలపై అధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వాల్సిన బాధ్యత నిపుణుల కమిటీపైన ఉంటుంది.
నిజానికి ఈ నిపుణుల కమిటీ ఏర్పాటే అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఇఫ్పటికే సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలవుతున్నాయి. పథకాల అమలులో కూడా ప్రభుత్వం కచ్చితమైన నిబంధనలను అమలుచేస్తున్నది. అందుకనే వీలైనంతమంది అర్హులను పథకాల లబ్దిదారుల జాబితాలోకి తీసుకొస్తోంది. ఇలాంటి నేపధ్యంలో మరిన్ని సంక్షేమపథకాలంటే రాష్ఠ్రంపై మోయలేని ఆర్ధికభారమైపోవటం ఖాయం. సంక్షేమ పథకాలు కూడా ఒక విధంగా అభివృద్ధే అన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఇది కొంతవరకు నిజమే కానీ అంతిమంగా మోయలేని భారమైపోతుందని గ్రహించాలి.
రాబోయే ఎన్నికల్లో విజయం కోసం మ్యానిఫెస్టోను రూపొందించాలంటే అందుకు మార్గాలు చాలా ఉన్నాయి. ఇపుడు అమలవుతున్న నవరత్నాలనే మరింత పటిష్టంగా అమలు చేస్తే సరిపోతుంది. అంతేకానీ ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలను అధ్యయనం చేయటం, ఆ పథకాలను ఇక్కడ అమలుచేయాలనే ఆలోచన కూడా అవసరంలేదు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోకుండా సంక్షేమ పథకాలను పెంచుకుంటు పోతామని ప్రభుత్వం చెప్పటమంటే ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోవటం ఖాయం.
జగన్ పద్దతి అప్పుచేసి పప్పు కూడా అన్నట్లుగా ఉంది. ఇది దీర్ఘకాలంలో ఎంతమాత్రం ఆచరణీయం కాదు. అందుకనే అమలవుతున్న సంక్షేమ పథకాలకు కొత్తవి జోడించకుండా ఉన్నవాటిని పక్కాగా అమలు చేస్తే అదేచాలు. ఇదే సమయంలో ఆర్థిక పరిస్ధితిని మెరుగుపరుచుకునేందుకు చర్యలు తీసుకోవాలి. పెట్టుబడులను తీసుకురావటం, పరిశ్రమలను ఏర్పాటు చేయడం లాంటివి చేస్తే ఆదాయం పెరుగుతుంది. అప్పుడు ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తే రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళుతుంది. అంతేకానీ ఎన్నికల్లో గెలుపుకోసమే మరిన్ని సంక్షేమ పథకాలంటే రాష్ట్రం మునిగిపోవడం ఖాయం.