హనీ ట్రాప్ లో పడి దేశ రహస్యాలు అమ్మేసిన ఇంజనీర్.. పాక్ గూఢచర్యం కేసులో అరెస్టు!
భారతదేశ రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తున్న ఒక ఇంజనీర్‌ను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు;
భారతదేశ రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తున్న ఒక ఇంజనీర్‌ను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. థానే జిల్లాకు చెందిన ఈ యువ ఇంజనీర్ పాకిస్తాన్ ఏజెంట్ల 'హనీ ట్రాప్'లో పడి దేశ రహస్యాలను అమ్మేసినట్లు దర్యాప్తులో తేలింది. మన యుద్ధనౌకలు, సబ్‌మెరైన్‌ల వివరాలతో పాటు కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఫేస్‌బుక్ ద్వారా వల పన్నిన పాక్ ఏజెంట్లు
పోలీసుల వివరాల ప్రకారం.. థానేలోని కల్వాన్‌కు చెందిన రవీంద్ర వర్మ (27) అనే మెకానికల్ ఇంజనీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 2024లో రవీంద్ర వర్మ ఫేస్‌బుక్‌లో పాయల్ శర్మ, ఇస్ ప్రీత్ అనే పేర్లతో ఉన్న పాకిస్తాన్ ఏజెంట్లతో పరిచయం చేసుకున్నాడు. ఆ ఏజెంట్లు తమను భారతీయులుగా పరిచయం చేసుకుని, ఒక ప్రాజెక్ట్‌కు సంబంధించి యుద్ధనౌకల గురించి సమాచారం కావాలని వర్మను కోరారు.
ఈ విధంగా వారి మధ్య కొన్ని రోజులు సంభాషణలు సాగాయి. ఈ పరిచయం బలపడిన తర్వాత, రవీంద్ర వర్మ భారతీయ యుద్ధనౌకలు, సబ్‌మెరైన్‌లకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని వారికి అందించడం ప్రారంభించాడు. పాకిస్తాన్ ఏజెంట్లకు ఉద్దేశపూర్వకంగానే ఈ సమాచారాన్ని షేర్ చేసినందుకు బదులుగా, అతని బ్యాంక్ ఖాతాలో భారీ మొత్తంలో డబ్బు జమ అయినట్లు పోలీసులు గుర్తించారు.
రహస్య సమాచారం లీక్
రవీంద్ర వర్మ ఒక డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీలో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఉద్యోగం కారణంగా అతనికి దక్షిణ ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్ (Naval Dockyard)లోకి ప్రవేశం ఉంది. అంతేకాకుండా, అతను నావికాదళ నౌకలు మరియు సబ్‌మెరైన్‌లలో కూడా ప్రయాణించగలడు. అయితే, నేవల్ డాక్‌యార్డ్‌లోకి ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతి లేదు. దీని కారణంగా అతను లోపలి సమాచారాన్ని స్కెచ్‌ల రూపంలో లేదా ఆడియో నోట్స్ ద్వారా బయటి వ్యక్తులకు చేరవేసేవాడు. నిందితుడు సబ్‌మెరైన్లు, యుద్ధనౌకల పేర్లను కూడా పాకిస్తాన్ ఏజెంట్లతో పంచుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది దేశ భద్రతకు తీవ్ర ముప్పు కలిగించే అంశంగా భావిస్తున్నారు.
ATS కస్టడీలోకి రవీంద్ర వర్మ
వర్మను కోర్టులో హాజరుపరచగా, ముంబైలోని యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) అతడిని తమ కస్టడీలోకి తీసుకుంది. అధికారులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రవీంద్ర వర్మకు ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి. ఎంత సమాచారం లీక్ అయింది. దీని వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందా వంటి విషయాలను ATS అధికారులు కూపీ లాగుతున్నారు. ఈ కేసు దేశ భద్రతకు సంబంధించినది కావడంతో, దర్యాప్తును చాలా గోప్యంగా, తీవ్రంగా కొనసాగిస్తున్నారు.