మొబైల్ వ్యసనం పరాకాష్ఠ.. ఏలూరులో కన్నవారిపైనే దాడి చేసిన 15 ఏళ్ల బాలుడు!

తాజాగా ఏలూరులో వెలుగుచూసిన ఒక దిగ్భ్రాంతికర ఘటన, మొబైల్ వ్యసనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో కళ్లకు కడుతోంది.

Update: 2026-06-10 11:26 GMT

నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. కమ్యూనికేషన్, వినోదం, విద్య, బ్యాంకింగ్ ఇలా ప్రతిదానికీ మొబైల్ ఫోనే ఆధారం. అయితే ఇదే మొబైల్ ఫోన్ కొంతమంది జీవితాలను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా పిల్లలు, యువతలో ఈ మొబైల్ వ్యసనం మహమ్మారిలా మారుతోంది. తాజాగా ఏలూరులో వెలుగుచూసిన ఒక దిగ్భ్రాంతికర ఘటన, మొబైల్ వ్యసనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో కళ్లకు కడుతోంది.

అసలేం జరిగింది?

ఏలూరుకు చెందిన ఒక 15 ఏళ్ల బాలుడు ఆన్‌లైన్ గేమ్స్, సోషల్ మీడియాకు పూర్తిగా బానిసయ్యాడు. రాత్రంతా నిద్ర లేకుండా మొబైల్ స్క్రీన్‌కే పరిమితమవడం.. పగటిపూట గంటల తరబడి నిద్రపోవడం అతనికి అలవాటుగా మారింది. కొడుకు ప్రవర్తనలో వస్తున్న మార్పులను గమనించిన తల్లిదండ్రులు పలుమార్లు మందలించారు. ఫోన్ పక్కన పెట్టాలని హెచ్చరించారు. అయితే వ్యసనంలో మునిగిపోయిన ఆ బాలుడు కన్నవారి మాటలను వినకపోగా.. వారిపైనే ఎదురుతిరిగాడు. తల్లిదండ్రులను దూషిస్తూ చివరకు వారిపై భౌతిక దాడికి దిగే స్థాయికి చేరుకున్నాడు. కొడుకు ప్రవర్తన రోజురోజుకూ అదుపు తప్పుతుండటంతో ప్రాణభయంతో ఆ తల్లి చివరకు మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడి పరిస్థితిని గమనించి మొదట కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం అతనికి మానసిక నిపుణుల సహాయం అవసరమని గుర్తించి.. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డీ-అడిక్షన్ సెంటర్ కు తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

కోవిడ్ తెచ్చిన శాపం!

కరోనా సమయంలో చదువులు ఆగిపోకూడదనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పిల్లలకు ఆన్‌లైన్ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్లు కొనిచ్చారు. కానీ ఇప్పుడు అదే ఫోన్లు పిల్లల పాలిట శాపంగా మారాయి. చదువు సాకుతో ఫోన్ చేతిలోకి తీసుకుంటున్న పిల్లలు.. క్రమంగా ఆన్‌లైన్ గేమ్స్, రీల్స్, సోషల్ మీడియా మాయలో పడిపోతున్నారు. దీనివల్ల పిల్లల్లో కొత్త సమస్యలు తీవ్రమవుతున్నాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడటం మానేసి, ఒంటరిగా గడపడం... అర్ధరాత్రి వరకు ఫోన్లు చూడటం వల్ల నిద్ర పట్టికలు పూర్తిగా దెబ్బతినడం... చిరాకు, దూకుడు.. ఫోన్ లాక్కుంటే విపరీతమైన కోపం, అరుకలు, దాడి చేసే మానసిక ప్రవృత్తి పెరిగిపోతోంది..

నిపుణుల సూచనలు.. తల్లిదండ్రులు ఏం చేయాలి?

ఈ ఘటన ప్రతి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. పిల్లలు మొబైల్ వ్యసనం బారిన పడకుండా ఉండాలంటే నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. ఏలూరు ఘటన ఒక హెచ్చరిక లాంటిది. పిల్లల చేతికి ఫోన్ ఇచ్చి బాధ్యత తీరిపోయింది అనుకుంటే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. స్మార్ట్‌ఫోన్ వాడకంపై నిరంతర నిఘా ఉంచడం, పిల్లల్లో మార్పు వస్తే వెంటనే గుర్తించి కౌన్సెలింగ్ ఇప్పించడం నేటి కాలంలో అత్యంత అవసరం.

Tags:    

Similar News