ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. నిందితుల ఇళ్లలో ఈడీ ఆకస్మిక సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంపై ఈడీ ఉచ్చు బిగిస్తోంది. గత ఏడాది జులైలోనే ప్రాథమిక చార్జిషీటు దాఖలు చేసిన ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది.;
ఏపీ లిక్కర్ స్కాంపై ఈడీ ఉచ్చు బిగిస్తోంది. గత ఏడాది జులైలోనే ప్రాథమిక చార్జిషీటు దాఖలు చేసిన ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ ఏడాది జనవరిలో నిందితులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రాజ్ కేసిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహనరెడ్డి ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. ఇక తాజాగా శుక్రవారం మరోసారి ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ నగరాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. ప్రధానంగా మూడు రియల్ ఎస్టేట్ సంస్థలు, నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. దీంతో లిక్కర్ స్కాంపై మరోసారి హాట్ డిబేట్ మొదలైంది.
సుమారు రూ.3,500 రూపాయల విలువైన లిక్కర్ స్కాంలో నిందితులు రియల్ ఏస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అనుమానిస్తోంది. సిట్ నివేదికల ఆధారంగా తీగ లాగుతున్న ఈడీ అనుమానాస్పద లావాదేవీలపై పూర్తి ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. మద్యం కుంభకోణానికి చెందిన డబ్బును నిందితులు ముందుగా షెల్ కంపెనీలకు మళ్లించి ఆ తర్వాత మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోందని చెబుతున్నారు. నిందితులు నెలకు సగటును రూ.వంద కోట్ల వరకు అక్రమంగా వసూలు చేసి ఆ మొత్తాన్ని షెల్ కంపెనీల ద్వారా రియల్ ఏస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారన్న కోణంలో దర్యాప్తు చేస్తోందని చెబుతున్నారు.
ఏపీ లిక్కర్ స్కాంలో వసూలు చేసిన కమీషన్ల మొత్తాన్ని నిందితులు దేశవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారులు సందేహిస్తున్నారు. అక్రమ డబ్బును వైట్ మనీగా మార్చడానికి హైదరాబాదులోని మూడు డమ్మీ రియల్ ఏస్టేట్ సంస్థలను సృష్టించి, వాటి పేరిట నకిలీ ఇన్వాయిస్ లు తయారు చేశారని ఈడీ అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు. అదేవిధంగా తమిళనాడులోని జువెలరీ సంస్థల ద్వారా నగదును బంగారం రూపంలో మార్చి భద్రపరిచినట్లు ఆధారాలు లభించినట్లు ప్రచారం జరుగుతోంది.
గత ఏడాది జులైలో దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో సోదాలు జరిగాయి. వీటికి కొనసాగింపుగా ఈడీ అనుమానిత సంస్థల్లో తరచూ సోదాలు నిర్వహిస్తోందని చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం ఈడీ సోదాలతో మరోసారి ఏపీ లిక్కర్ స్కాంపై హాట్ టాపిక్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు నిందితులు సిట్ నమోదు చేసిన కేసుల్లో జైలుకు వెళ్లి బెయిలుపై బయటకు వచ్చారు. ఇలాంటి సమయంలో ఈడీ మళ్లీ జోరు పెంచడం చూస్తే, కేసులో ఈడీ కూడా అరెస్టుకు సిద్ధమవుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అరెస్టు ప్రచారంతో నిందితులు హడలిపోతున్నారు. సిట్ కేసు నుంచి బయటపడ్డామంటే ఈడీ కొరఢా ఝళిపిస్తుందన్న భయంతో నిద్రలేని రాత్రులు గడుతున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.