సీఎం మమతకు రేప్ కేసు బాధితురాలి తండ్రి సారీ వెనుక..!
ఈ క్రమంలో తాజాగా బుధవారం మాట్లాడిన బాధితురాలి తండ్రి.. సీఎం మమతా బెనర్జీకి క్షమాపణలు చెప్పారు.;
పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ లో ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న 22 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థిని అక్టోబర్ 10న తన కాలేజీ క్యాంపస్ నుంచి స్నేహితునితో కలిసి ఆహారం కోసం బయటకు వచ్చిన తర్వాత సామూహిక అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ఆగ్రహాన్ని, రాజకీయ దుమారాన్ని రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.
అవును... ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న తన కుమార్తెపై దాడి జరిగిన తరువాత.. సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె తండ్రి.. సోమవారం ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే... నాడు మాట్లాడిన మాటలకు నేడు (బుధవారం) క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
సోమవారం ఆగ్రహం!:
సోమవారం ఉదయం బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ఆమె (మమతా బెనర్జీ) కూడా ఒక మహిళ.. ఆమె ఇంత బాధ్యతారహితంగా ఎలా మాట్లాడగలదు?.. మహిళలు తమ ఉద్యోగాలను వదిలి ఇంట్లో కూర్చోవాలా?.. బెంగాల్ ఔరంగజేబు పాలనలో ఉన్నట్లు కనిపిస్తోంది అంటూ ఫైరయ్యారు. ఇదే సమయంలో.. పశ్చిమ బెంగాల్ శాంతిభద్రతల పరిస్థితిపై తనకు నమ్మకం పోయిందని వెల్లడించారు.
బుధవారం క్షమాపణలు!:
ఈ క్రమంలో తాజాగా బుధవారం మాట్లాడిన బాధితురాలి తండ్రి.. సీఎం మమతా బెనర్జీకి క్షమాపణలు చెప్పారు. ఇందులో భాగంగా... మమతా బెనర్జీ తనకు తల్లిలాంటి వ్యక్తి అని.. తాను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే, క్షమించమని ఆమెను అడుగుతున్నానట్లు తెలిపారు. ఈ సమయంలో ఆమె పాదాలకు లెక్కలేనన్ని నమస్కారాలు చేస్తానని బాధితురాలి తండ్రి అన్నారు.
అయితే.. తన కుమార్తెకు మాత్రం న్యాయం జరిగేలా సహాయం చేయాలని సీఎమ్ను అడుగుతున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో.. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపిన బాధితురాలి తండ్రి.. అది మంచిదని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
సీఎం మమత అసలు ఏమని స్పందించారు!:
ఈ ఘటన గురించి సీఎం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలు అర్ధరాత్రి 12:30 గంటలకు క్యాంపస్ వెలుపల ఉందని తనకు తెలిసిందని అన్నారు. ఇదే సమయంలో.. హాస్టళ్లలో నివసించే విద్యార్థులు రాత్రిపూట బయటకు వెళ్లకూడదని.. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తమ విద్యార్థుల భద్రతను, ముఖ్యంగా మహిళా విద్యార్థుల భద్రతను నిర్ధారించాలని.. వారిని రాత్రిపూట క్యాంపస్ నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించకూడదని.. బాలికలు కూడా తమను తాము రక్షించుకోవాలని అన్నారు.
అయితే.. ఈ వ్యాఖ్యలు ప్రతిపక్ష నాయకులు, మహిళా హక్కుల సంఘాలు, ఒడిశా ప్రభుత్వం నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి. ఈ సందర్భంగా సీఎం తన మాటలతో బాధితులను నిందించారని వారు ఆరోపించారు. అనంతరం స్పందించిన మమత బెనర్జీ... తన మాటలను వక్రీకరించారని, ఈ రకమైన రాజకీయాలకు ప్రయత్నించొద్దని అన్నారు!