స్వీయ వినాశనానికి దగ్గరగా ప్రపంచం.. ఏమిటీ డూమ్స్ డే గడియారం..!
ఇందులో భాగంగా... డూమ్స్ డే గడియారం అర్ధరాత్రికి 85 సెకన్ల దూరంలోనే ఉందని.. ఫలితంగా ప్రపంచం మునుపెన్నడూ లేనంతగా వినాశనానికి చేరువైందని తెలిపింది.;
ఈ ప్రపంచం స్వీయ వినాశనానికి ఎంత దగ్గరగా ఉందో సూచించే ప్రతీకాత్మక గడియారం "డూమ్స్ డే క్లాక్" కు సంబంధించిన కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ఇది అర్ధరాత్రికి మరింత దగ్గరగా మారింది. తాజాగా 'ది బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్' అనే స్వచ్ఛందం సంస్థ స్పందిస్తూ... గడియారం ఇప్పుడు అర్ధరాత్రికి 85 సెకన్లు మాత్రమే ఉందని ప్రకటించింది. దీంతో.. ఈ ప్రకటన మారుతున్న ప్రపంచ దేశాల వైఖరిపై చర్చకు తెరలేపింది.
అవును... ప్రపంచంలో ఎటు చూసినా ఆందోళనలు, ఘర్షణలు, యుద్ధ విన్యాశాలు, అణు పరీక్షల ఆలోచనలు, వివాదాస్పద ప్రకటనల నేపథ్యంలో... స్వీయ వినాశనానికి ప్రపంచం దగ్గరగా ఉందంటూ 'బులిటెన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్' అనే స్వచ్ఛంద సంస్థ కీలక విషయాన్ని వెల్లడించింది. ఇందులో భాగంగా... డూమ్స్ డే గడియారం అర్ధరాత్రికి 85 సెకన్ల దూరంలోనే ఉందని.. ఫలితంగా ప్రపంచం మునుపెన్నడూ లేనంతగా వినాశనానికి చేరువైందని తెలిపింది.
ప్రధానంగా... అగ్రరాజ్యం అమెరికా, రష్యా, చైనాతో పాటు పలు ఇతర దేశాలు దుందుడుకుగా వ్యవహరించడం.. శత్రుభావాలు, జాతీయవాదం పెరగడం వంటివి ఇందుకు కారణమని వివరించింది. ఇదే క్రమంలో... అణ్వస్త్ర దేశాలతో ప్రమేయమున్న ఘర్షణలు పెరిగే ప్రమాదం ఉందని చెబుతూ.. ఈ సందర్భంగా రష్యా - ఉక్రెయిన్ యుద్ధాన్ని.. భారత్ - పాకిస్థాన్ మధ్య జరిగిన ఘర్షణలనూ ప్రస్థావించింది. ఇరాన్ అణ్వస్త్రాన్ని సమకూర్చుకోవచ్చన్న ఆందోళన పెరిగిందని తెలిపింది.
ఏమిటీ డూమ్స్ డే క్లాక్..!:
మానవులు ఎదుర్కోవాల్సిన ప్రమాదాలను గుర్తుచేసేలా ఉద్దేశించబడిందే 'డూమ్స్ డే క్లాక్'. దీన్ని 1947లో ఆల్బర్ట్ ఐన్ స్టీన్, మాన్ హట్టన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జె.రాబర్ట్ ఓపెన్ హైమర్, మాన్ హట్టన్ ప్రాజెక్ట్ లో భాగంగా మొదటి అణ్వాయుధాలను అభివృద్ధి చేయడంలో సహాయపడిన చికాగో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు స్థాపించారు. జపాన్ లోని హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణు బాంబులు వేసిన రెండు సంవత్సరాల తర్వాత దీన్ని.. అర్ధరాత్రికి ఏడు నిమిషాల ముందు సెట్ చేశారు.
అప్పటి నుండి గడియారం అనేకసార్లు ముందుకు, వెనుకకు సర్దుబాటు చేయబడింది. ఈ క్రమంలో... 1991లో అప్పటి అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యు బుష్, సోవియట్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ తమ తమ దేశాల అణ్వాయుధాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించి.. వ్యూహాత్మక ఆయుధ పరిమితి ఒప్పందం పునరుద్ధరించబడిన తర్వాత.. అర్ధరాత్రి నుండి గడియారం అత్యంత దూరం 17 నిమిషాలకు సర్దుబాటు చేయబడింది.
ఈ క్రమంలో... 2023, 2024లో ఈ డూమ్స్ డే గడియారం అర్ధరాత్రికి ముందు 90 సెకన్లకు సెట్ చేయబడగా.. 2025లో 89 సెకన్లను మారింది. ఈ నేపథ్యంలో తాజాగా 85 సెకన్లకు మారింది. దీంతో... ప్రపంచం వినాశనానికి మరింత చేరువవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ గడియారాన్ని వెనక్కి తిప్పడంలో సహాయపడగలరని కోరుతున్నారు!