కర్ణాటక కొత్త సీఎం డీకే మాస్ డెసిషన్ : ముఖ్యమంత్రి కాగానే అదిరిపోయే నిర్ణయాలు
కర్ణాటక నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన నిర్ణయాలతో పాలన ప్రారంభించారు.
కర్ణాటక నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన నిర్ణయాలతో పాలన ప్రారంభించారు. కేబినెట్ తొలి సమావేశంలోనే జనం మెచ్చేలా, ముఖ్యంగా యువతకు కనెక్ట్ అయ్యేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల హామీల అమలుతోపాటు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపే లక్ష్యంతో ఆయన తొలి అడుగులు వేశారు. విద్యార్థులను ప్రోత్సహించేలా ఫ్రీబస్ పాస్ ఫైల్ పై తొలి సంతకం చేశారు.
స్టూడెంట్స్ అందరికీ ఫ్రీ బస్ పాస్
విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు. విద్యార్థులకు ఫ్రీబస్ స్కీమ్ ను ప్రకటించి ఆకట్టుకున్నారని అంటున్నారు. ఇప్పటివరకు పరిమిత రుసుం వసూలు చేసి విద్యార్థులకు పాస్ లు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఉచితంగానే పాస్ లు జారీ చేయాలని ముఖ్యమంత్రి డీకే నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులకు, వారి కుటుంబాలకు భారీగా ఆర్థిక ఉపశమనం లభించనుందని అంటున్నారు. చదువుకోవాలనే కసి ఉండి, రవాణా ఖర్చులు భరించలేని పేద విద్యార్థులకు ఇది సీఎం ఇచ్చిన బంపర్ ఆఫర్ అంటున్నారు.
జాబ్ క్యాలెండర్ రిలీజ్
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు డీకే ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇకపై ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం ఉండబోదని స్పష్టం చేస్తూ, ప్రభుత్వ పోస్టుల భర్తీకి ప్రత్యేక క్యాలెండర్ విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు. ఏటా ఏయే విభాగాల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారనే వివరాలు ఈ క్యాలెండర్ ద్వారా అభ్యర్థులకు ముందే తెలిసిపోతుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఈ విధమైన క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఇప్పుడు కర్ణాటక కూడా జాబ్ క్యాలెండర్ విధానాన్ని అనుసరిస్తూ యువతకు ఉపాధిపై ఫోకస్ చేస్తున్నట్లు స్పష్టం చేసిందని అంటున్నారు.
ప్రైవేటు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్
కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా, ప్రైవేటు రంగంలోనూ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం సరికొత్త ఐడియాతో ముందుకొచ్చారు డీకే శివకుమార్. రాష్ట్రంలో ప్రైవేటు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఉద్యోగాల కోసం వెతుకుతున్న నిరుద్యోగులు ఇందులో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సివుంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రైవేట్ కంపెనీల అవసరాలకు, అభ్యర్థుల నైపుణ్యాలకు మధ్య ఈ ఎక్స్‌ఛేంజ్ ఒక వారధిలా పనిచేస్తుందని అంటున్నారు.
మొత్తానికి సీఎం పీఠం ఎక్కగానే డీకే శివకుమార్ యువతతోపాటు రాబోయే తరంపై దృష్టి పెట్టినట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జెన్ జీ కోసం మాట్లాడుకుంటున్నారు. దీంతో డీకే కూడా యువతను ఆకట్టుకునేలా తొలి అడుగులు వేశారని అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులు అందరికీ ఉచిత బస్సు పథకం తేవడం కూడా ఇందులో భాగమే అంటున్నారు. రాబోయే తరంపైనా ఫోకస్ చేయడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని, దీని ద్వారా పిల్లలు, వారి తల్లిదండ్రులను ఆకట్టుకుని ఒక పాజిటివ్ దృక్పథంతో పాలన మొదలు పెట్టినట్లు సంకేతాలిచ్చారని విశ్లేషిస్తున్నారు.