ధర్మస్థల మిస్టరీ కేసు... అడ్రస్ చెప్పి కీలక అప్ డేట్ ఇచ్చిన సిట్!

కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం 'ధర్మస్థల' మిస్టరీ కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడిన సంగతి తెలిసిందే.;

Update: 2025-07-31 18:30 GMT

కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం 'ధర్మస్థల' మిస్టరీ కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... శ్రీక్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో కొన్ని శవాలను పూడ్చి పెట్టానని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రదేశాల్లో ఒక చోట గురువారం కొన్ని అవశేషాలను గుర్తించారు. దీంతో... ఈ కేసులో దీన్నీ బిగ్ బ్రేక్ త్రూ గా చెబుతున్నారు. ఈ తీగతో డొంక మొత్తం కదిలే అవకాశాలున్నాయని అంటున్నారు.

అవును... ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు స్పందించారు.. ప్రభుత్వం ఏకంగా స్పెషల్ ఇన్ వెస్టిగేషన్ టీమ్ (సిట్) ను ఏర్పాటు చేసింది. ఎందుకంటే.. అతడు చేసిన ఆరోపణలు అంత తీవ్రమైనవి. అయితే... తాజా అప్ డేట్ లో అతడు చెప్పింది అవాస్తవం కాదని తేలింది! అతడు చూపించిన ఒక చోట అస్తిపంజర అవశేషాలు లభ్యమయ్యాయి. 4 అడుగుల లోతులోనే అవి కనిపించాయని అంటున్నారు.

ఈ సమయంలో... మృతదేహాలను పూడ్చిపెట్టినట్లుగా మొత్తం 15 చోట్లను సదరు పారిశుధ్య కార్మికుడు గుర్తించగా.. ఆ ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు! ఈ క్రమంలోనే అతడు చూపించిన ఆరో ప్రాంతంలో గురువారం మానవ అవశేషాలు బయటపడ్డాయి. దీంతో... కర్ణాటక రాష్ట్రంలో, అతడు చెప్పిన కాలంలో నమోదైన మిస్సింగ్ కేసులలో కదలిక వచ్చే పలు అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ సమయంలో తమను సంప్రదించొచ్చని సిట్ ప్రకటించింది.

1998 నుంచి 2014 వరకు సుమారు 100 నుంచి 300 హత్యలు జరిగాయని చెబుతోన్న వేళ.. గత 20 ఏళ్లలో రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్ కేసులు, అసహజ మరణాలపై కర్ణాటక స్టేట్ విమెన్స్ కమిషన్ నివేదిక కోరారు. ఈ సమయంలో... ఈ కాలంలో మిస్సింగ్ కేసులు నమోదు చేసిన కుటుంబ సభ్యులు.. సిట్ అధికారులను నేరుగా కానీ, ఫోన్ లో కానీ సంప్రదించొచ్చని చెబుతున్నారు. తద్వారా కేసు పురోగతికి హెల్ప్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు!

ధర్మస్థల సామూహిక ఖననం కేసు దర్యాప్తుకు సంబంధించి మంగళూరులోని మల్లికట్టెలోని ఐబీలో ఒక కార్యాలయం ఏర్పాటు చేయబడిందని సిట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా సిట్‌ ను కలవాలనుకునే వారు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య కార్యాలయాన్ని సందర్శించవచ్చని తెలిపింది. ప్రజలు 0824 – 2005301, 8277986369 నంబర్లకు డయల్ చేయవచ్చని తెలిపింది.

కాగా... ఆలయంలో 1998 నుంచి 2014 మధ్య పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి జులై 3న దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు ఓ భయంకరమైన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన 20 ఏళ్ల సర్వీసులో వందలాది శవాలను తానే స్వయంగా ఖననం చేశానని, ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు, యువతులతో పాటు మైనర్ బాలికలు ఉన్నారంటూ చేసిన ఆరోపణలతో రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది!

Tags:    

Similar News