కొత్త ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఎంతంటుంది?
ఇదే సమయంలో కొత్తగా ఎన్నికయ్యే ఉప రాష్ట్రపతి పదవీ కాలం ఎంత? అన్నది మరో ఆసక్తికర ప్రశ్నగా మారింది.;
అనూహ్య రీతిలో ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేయటం ద్వారా సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా మారారు ధన్ ఖడ్. ఎంత ఆరోగ్యం బాగోలేకపోతే మాత్రం.. అంత హడావుడిగా రాజీనామా చేయాలసిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న. నిజంగానే అనారోగ్యం క్షీణించి ఉంటే.. పదవీ బాధ్యతలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ ఇబ్బందేమీ లేదు. పార్లమెంట్ సమావేశాల వేళలోనూ.. రాజ్యసభకు అధ్యక్ష స్థానంలో కూర్చోకున్నా.. డిప్యూటీలు ఆ బాధ్యతను నిర్వర్తించేవారు.
అలాంటప్పుడు అంత త్వరపడి రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా? అంటే లేదనే చెబుతారు. అయినప్పటికీ రాజీనామా విషయంలో అంత హడావుడి ప్రదర్శించటం వెనుక అసలు అర్థమేంటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అదే పలు ఊహాగానాలకు ఆయువుగా నిలిచింది. ఇదిలా ఉండగా.. ధన్ ఖడ్ రాజీనామా నేపథ్యంలో కొత్త ఉప రాష్ట్రపతి నియామకం కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఇదే సమయంలో కొత్తగా ఎన్నికయ్యే ఉప రాష్ట్రపతి పదవీ కాలం ఎంత? అన్నది మరో ఆసక్తికర ప్రశ్నగా మారింది. ఉప రాష్ట్రపతి పదవీ కాలం ఐదేళ్లు. ధన్ ఖడ్ తన పదవీ కాలం మరో రెండేళ్లు ఉండగానే అర్థాంతరంగా రాజీనామా చేశారు.దీంతో.. కొత్తగా వచ్చే ఉప రాష్ట్రపతి మిగిలిన రెండేళ్లకు కాకుండా.. మొత్తం ఐదేళ్లు ఆ పదవిలో ఉంటారు. ఇక.. కొత్త ఉప రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు తుది షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక ప్రకటన విడుదలైంది కూడా.
కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే కూటమి స్పష్టమైన మెజార్టీ ఉంది. మొత్తం 543 లోక్ సభా స్థానాలకు గాను.. పశ్చిమ బెంగాల్ లోని బసీర్ ఘాట్ స్థానం ఖాళీగా ఉంటే.. 245 స్థానాలు ఉన్న రాజ్యసభలో పంజాబ్ నుంచి ఒక సీటు.. జమ్ముకశ్మీర్ నుంచి నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ లెక్కన ఇప్పుడున్న మొత్తం సభ్యుల సంఖ్య 786. అయితే.. ఉప రాష్ట్రపతిగా ఎన్నికల్లో విజయం సాధించాలంటే బరిలో ఉన్న అభ్యర్థి 394 ఓట్లు సాధించాలి.
లోక్ సభలో ఎన్డీయే కూటమికి 293 మంది సభ్యుల మద్దతు ఉండగా.. రాజ్యసభలో 129 మంది సభ్యుల బలం ఉంది. మొత్తంగా చూస్తే ఎన్డీయే కూటమికి 422 మంది సభ్యుల మద్దతు ఉంది. దీంతో.. గెలిచేందుకు అవసరమైన దానికి మించి 28 ఓట్లు అదనంగా ఉన్నాయి. దీంతో.. పాలక ఎన్డీయే డిసైడ్ చేసిన అభ్యర్థి ఉప రాష్ట్రపతి పదవికి ఇట్టే ఎంపిక అవుతారని చెప్పాలి.