దేవినేని ఉమా అల‌క‌.. రంగంలోకి పెద్ద‌లు.. !

టిడిపి సీనియర్ నాయకుడు, మాజీమంత్రి, ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు అలిగిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.;

Update: 2026-04-17 17:30 GMT

టిడిపి సీనియర్ నాయకుడు, మాజీమంత్రి, ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు అలిగిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. పార్టీ తరఫున తరచుగా మీడియా ముందుకు వచ్చే ఆయ‌న‌.. తాజాగా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. నిజానికి.. వైసీపీని ఇటీవల కాలంలో ఆయన పలు సందర్భాల్లో ఎండగట్టారు కూడా. అయితే తాజాగా పార్టీ ప్రకటించిన రాష్ట్రస్థాయి కమిటీలో దేవినేని ఉమాకు ఆశించిన పదవి దక్కలేదు. ముఖ్యంగా ఆయన పార్టీ పొలిటి బ్యూరోలో స్థానం కోరుకున్నారు.

కానీ అనూహ్యంగా ఆయనను పక్కనపెట్టి గుంటూరు జిల్లాకు చెందిన జూనియర్ నాయకురాలు, ఎమ్మెల్యేగా ఉన్న ఒక మహిళకు కేటాయించారు. ఇది ఆయనను తీవ్రస్థాయిలో ఆవేదనకు గురి చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి, దీంతో గడిచిన నాలుగు రోజులుగా పార్టీకి సైతం అందుబాటులో లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని తెలిసింది, దీనిని దృష్టిలో పెట్టుకున్న పార్టీ అధిష్టానం వెంటనే చర్చలు జరపాలని పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించినట్టు సమాచారం,

వాస్తవానికి గత ఎన్నికల సమయంలో మైలవరం నుంచి పోటీ చేయాల్సిన దేవినేని ఉమా చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ టికెట్ను వదులుకున్నారు. వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కి టికెట్ కేటాయించారు. పైగా ఇప్పుడు ఆయనకే పార్టీలో మరో కీలక పరిధి దక్కింది. ఈ రెండు పరిణామాలు ఇలా ఉంటే గత ఎన్నికల సమయంలో టికెట్ వదులుకున్నప్పుడు ఇచ్చిన హామీని కూడా పార్టీ నెరవేర్చలేదన్నది దేవినేని ఉమా ఆవేదన.

అయినప్పటికీ ఆయన తరచుగా మీడియా ముందుకు వస్తున్నారు. పార్టీ తరఫున గళం వినిపిస్తున్నారు. ఇప్పుడు పార్టీలోనూ తనకు పెద్దగా ప్రాధాన్యం దక్కకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురై ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పార్టీకి దూరంగా ఉండడం చర్చనీయాంసంగా మారింది. అయితే ఇదంతా పార్టీ అంతర్గత వ్యవహారమని, అధిష్టానం ఆయనను బుజ్జగిస్తుందని కొందరు నేతలు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News