దేవాన్ష్ కళ్లజోడు తీసేస్తే.. మహానాడులో ఆసక్తికర చర్చ!

ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజున యువనాడు అనే కార్యక్రమం ప్రారంభించాలనే ప్రతిపాదనతోపాటు, మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ అందచందాలపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-05-28 08:09 GMT

టీడీపీ 44వ మహానాడు ఉత్సాహంగా కొనసాగుతోంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడులో అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ తోపాటు పలువురు మంత్రులు, సీనియర్ నాయకులు, పార్టీ ప్రతినిధులు ఒక్కొక్కరుగా ప్రసంగిస్తున్నారు. యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై పలు తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద సాగర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజున యువనాడు అనే కార్యక్రమం ప్రారంభించాలనే ప్రతిపాదనతోపాటు, మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ అందచందాలపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మహానాడు వేదికపై పార్టీ అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తీవ్రమైన భావోద్వేగంతో మాట్లాడిన ఆనంద సాగర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అందం నందమూరి-నారా కుటుంబంలో ఒక్కరికే వచ్చిందని వ్యాఖ్యానించారు. మంత్రి లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ అచ్చంగా సీనియర్ ఎన్టీఆర్ రూపంలో కనిపిస్తున్నారని, దేవాన్ష్ కళ్ల జోడు పెట్టుకుంటున్నారని, అది తీసేస్తే సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగానే కనిపిస్తారని చెప్పారు. మహానాడు వేదికపై ఆనందసాగర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎవరూ ఊహించని విధంగా ఆయన దేవాన్ష్ ను కీర్తించడంతో పార్టీ నేతలు సైతం అవాక్కయ్యారని చెబుతున్నారు.

'మహానాడు' తరహాలోనే 'యువనాడు'

ఇక ఆనందసాగర్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రతి ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'మహానాడు' తరహాలోనే, అధినేత చంద్రబాబు పుట్టినరోజును కూడా ఒక పెద్ద పండుగలా నిర్వహించాలని ప్రతిపాదించారు. చంద్రబాబు జన్మదిన వేడుకలలో కేవలం కేక్ కటింగ్స్, అన్నదానం వంటి కార్యక్రమాలకే పరిమితం చేయకుండా.. పార్టీ శ్రేణులంతా కలిసి ఒక ఉత్సవంలా జరుపుకోవాలని సూచించారు. ఈ వేడుకలకు 'చంద్రనాడు' లేదా 'యువనాడు' అని పేరు పెట్టాలని ఆయన సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.

నెట్టింట వైరల్ అవుతున్న వ్యాఖ్యలు

నారా దేవాన్ష్‌ను నేరుగా లెజెండరీ యాక్టర్ ఎన్టీఆర్‌తో పోల్చడం, అలాగే చంద్రబాబు బర్త్‌డేను 'చంద్రనాడు'గా సెలబ్రేట్ చేయాలనడంపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీ శ్రేణులు ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుండగా.. ప్రత్యర్థి పార్టీల నేతలు, నెటిజన్లు మాత్రం ఇది కాస్త అతిశయోక్తిగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా, ప్రస్తుతం మోకా ఆనంద సాగర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి.



Tags:    

Similar News