రీల్ కాదు రియల్ హీరో డీసీపీ చైతన్యకుమార్

ఒక డీసీపీ స్థాయి అధికారికి ఉండే పోలీసు బలగం అంతా ఇంతా కాదు. తన టీంను రంగంలోకి దించొచ్చు.;

Update: 2025-10-27 07:09 GMT

రీల్ సీన్లకు భిన్నంగా రియల్ సీన్లు ఉంటాయి. ఆయా రంగాలకు సంబంధించిన సీన్లు కొన్ని సినిమాల్లో చూసినప్పుడు.. నిత్యం అందులో పని చేసే వారు చూసి నవ్వుకుంటూ ఉంటారు. సినిమాటిక్ స్వేచ్ఛతోనే సినిమాల్లో అవసరమైన ఎమోషన్ వస్తుందని చెబుతుంటారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం రీల్ కు ఏ మాత్రం తగ్గని రియల్ లైఫ్ లోనూ హీరోయిజాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు హైదరాబాద్ లోని సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యకుమార్ అలాంటి రియల్ హీరోయిజాన్ని ప్రదర్శించారని చెప్పాలి. ఎందుకంటే.. ఒక డీసీపీ స్థాయిలో ఉండే వ్యక్తి.. ఒక నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రదర్శించిన రిస్కును చూసినప్పుడు ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే.

ఒక డీసీపీ స్థాయి అధికారికి ఉండే పోలీసు బలగం అంతా ఇంతా కాదు. తన టీంను రంగంలోకి దించొచ్చు. కానీ.. ఆయన మాత్రం తన కళ్ల ముందు జరుగుతున్న నేరాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించటం.. ఈ క్రమంలో ఆయన స్వల్పంగా గాయపడటమే కాదు.. నేరస్తుడ్ని అడ్డుకున్న చాకచక్యాన్ని చూసినప్పుడు.. రీల్ సీన్ రియల్ సీన్ గా మారింది. కత్తి, తల్వార్ తో తిరుగుతూ సెల్ ఫోన్ స్నాచింగ్ కు పాల్పడే నేరస్తుల్ని పట్టుకునేందుకు ఆయన తెగువను ప్రదర్శించారు.

హైదరాబాద్ మహానగర నడిబొడ్డున ఉన్న సుల్తాన్ బజార్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో నిందితుడైన మహ్మద్ ఒమర్ అన్సారీ మీద 22 కేసులు ఉన్నాయి. అతడ్ని చోరీ చేసే సమయంలో అడ్డుకుంటే ఎంతకైనా తెగిస్తాడు. శనివారం మధ్యాహ్న వేళలో ఒమర్ అన్సారీ ఆటోలో మరో ఇద్దరితో కలిసి చాదర్ ఘాట్ ట్రాఫిక్ జంక్షన్ సమీపంలో సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్న వేళ.. అదే దారిలో వాహనంలో వెళుతున్న డీసీపీ చైతన్యకుమార్ అతడ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.

తన అధికారిక వాహనంలో తన ఆఫీస్ కు వెళుతున్న వేళలో ఆటోలోని ఒక వ్యక్తి నుంచి సెల్ ఫోన్ ను స్నాచింగ్ కు ప్రయత్నిస్తున్న విషయాన్ని కారు డ్రైవర్ గుర్తించి డీసీపీకి చెప్పారు. వెంటనే.. డీసీపీ గన్ మేన్ కిందకు దిగి ఒమర్ అన్సారీని పట్టుకున్నాడు. అతడికి సాయంగా డీసీపీ కూడా దిగి వెళ్లారు. అయితే.. ఒమర్అన్సారీ గన్ మేన్ ను నెట్టేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో గన్ మేన్ వద్ద ఉన్న 9ఎంఎం పిస్టల్ కిందకు పడిపోయింది. దీంతో.. డీసీపీ దాన్ని తీసుకున్నారు.

అన్సారీ దగ్గర్లోని బిల్డింగ్ పైకి చేరాడు. గన్ మేన్.. డీసీపీ అతడ్ని వెంబడించారు. ఈ క్రమంలో అన్సారీని పట్టుకునేందుకు గన్ మేన్ ప్రయత్నించగా.. అతడిపై కత్తితో దాడికి పాల్పడే ప్రయత్నం చేశాడు. దీంతో డీసీపీ రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. నిందితుడు బిల్డింగ్ పై నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే.. విడిచి పెట్టకుండా ప్రయత్నించటం.. కాల్పుల అనంతరం కిందకు దూకి తప్పించుకునే ప్రయత్నం చేస్తే వెంబడించి మరీ పట్టుకోవటం.. ఆయన్ను రియల్ పోలీస్ హీరోగా చేసింది. ఈ క్రమంలో స్వల్ప గాయాలకు గురైన డీసీపీ చైతన్యకుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను పోలీస్ బాస్ (డీజీపీ) శివధర్ రెడ్డితో పాటు హైదరాబాద్ సీపీ సజ్జన్నార్.. డీసీపీలు పరామర్శించారు. ఏమైనా.. రీల్ సీన్ ను రియల్ సీన్ గా మార్చటంతో పాటు పోలీస్ పవర్ ఏమిటన్నది అందరికి చూపించారు డీసీపీ చైతన్యకుమార్.

Tags:    

Similar News