లోకేశ్ ప్రజాదర్బార్.. ఆ జనాన్ని చూస్తే మతిపోవడం ఖాయం!
దీంతో లోకేశ్ తన నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా ఒక రోజును రిజర్వు చేసుకోవాల్సివచ్చింది.;
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ కు వేల మంది ప్రజలు తరలివచ్చారు. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ ఆఫీసులో ప్రజాదర్బార్ ఉంటుందని ముందుగా చెప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజానీకం వేలాదిగా తరలివచ్చారు. యువనేతను కలిసి తమ సమస్యలను తెలియజేయాలని ఎదురుచూస్తున్నారు. మంత్రి లోకేశ్ సైతం ప్రతి ఒక్కరినీ కలుస్తూ చాలా ఓపికగా, వారి సమస్యలను వింటున్నారు. కొన్ని సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే చర్యలు తీసుకుంటున్నారు. మంత్రిని కలిసిన వారు ఆయన స్పందించిన తీరు చూసి హ్యాపీగా తిరిగి వస్తున్నారు. దీంతో లైనులో నిల్చొన్నవారు తమ వంతు కోసం ఎదురుచూస్తూ నాలుగైదు గంటలుగా నిరీక్షిస్తున్నారు.
ఎలాంటి సమస్య అయినా, మంత్రి లోకేశ్ తో చెప్పుకుంటే పరిష్కారమవుతుందనే భరోసాతో రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు, ప్రజలు టీడీపీ కార్యాలయానికి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహించడం ఒక అలవాటుగా చేసుకున్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరునాడు నుంచి ఉండవవల్లిలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం వద్ద ప్రతిరోజూ ఈ ప్రజాదర్బార్ కొనసాగేది. దాదాపు ఆరు నెలలపాటు నిరాటంకంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. లోకేశ్ ను కలిస్తే తమ సమస్య పరిష్కారమవుతుందనే ప్రచారం ఎక్కువగా జరగడంతో రోజురోజుకు ప్రజాదర్బార్ కు వచ్చే జనం తాకిడి పెరిగింది.
దీంతో లోకేశ్ తన నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా ఒక రోజును రిజర్వు చేసుకోవాల్సివచ్చింది. ఇక ఇటీవల పని ఒత్తిడి పెరిగిపోవడంతో లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహించలేకపోతున్నారు. ఈ విషయం తెలియక ఆయనను కలిసేందుకు రోజూ జనం వస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బిజీ షెడ్యూల్ లోనూ మంగళవారం ప్రజాదర్బార్ నిర్వహణకు యువనేత సిద్ధమయ్యారు. చాలా కాలం తర్వాత ప్రజలను కలుస్తుండటంతో పూర్తిగా ఒక రోజు పూర్తిగా భక్తుల కోసం కేటాయించారు. ఈ విషయం తెలిసి ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. మధ్యాహ్నం భోజన సమయంలో కూడా ఎవరూ క్యూ నుంచి బయటకు రావడం లేదు. ఈ రోజు ఎలాగైనా సరే యువనేతను కలిసి వెళతామని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతానికి జనం తాకిడి చూస్తే, రాత్రి బాగా పొద్దు పోయే వరకు ప్రజాదర్బార్ కొనసాగేలా కనిపిస్తోంది. యువనేత సైతం ఎంత సమయమైనా అందరినీ కలిసి, వారి సమస్యలు తెలుసుకోవాలనే నిర్ణయంతో ఓపికగా వ్యవహరిస్తున్నారు.
టీడీపీ రాష్ట్రకార్యాలయం నుంచి దాదాపు కిలోమీటరు మేర ప్రజలు బారులు తీరారు. జాతీయ రహదారి సర్వీసు రోడ్డు పక్కన వినతులతో క్యూలైనులో జనం నిల్చొవడం చూసి, మరికొందరు జత కలుస్తున్నారు. గుంటూరు-విజయవాడ రహదారిలో ఈ రద్దీతో లోకేశ్ ఉన్న తెలియని వారు కూడా అప్పటికప్పుడు తమ సమస్యను తెలియజేయాడానికి లైనులో నిల్చొవడం కనిపించింది. ఇక క్యూలైనులో ఉన్న వారికి మంచినీరు, బిస్కెట్లు, మజ్జిక ప్యాకెట్లను టీడీపీ కార్యకర్తలు సరఫరా చేస్తున్నారు.