టెర్రరిజం...నక్సలిజం... తేడా తెలుసుకోమన్న ఎర్రన్న
పాలకులు అయితే ఈ రెండింటినీ ఒకే గాటకు కట్టి అణచేందుకు చూస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. దీని మీద సీనియర్ కామ్రేడ్ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారాయణ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.;
ఉగ్రవాదం అంటే ఏమిటి నక్సలిజం అంటే ఏమిటి. చాలా మందికి తెలియదు. ఈ రెండింటిలో తుపాకీ మోతలు మోగుతాయి. అలాగే ప్రాణాలు పోతూంటాయి. మందుపాతరలు బీభత్సాలు, మారణ హోమాలు కామన్. అయితే ఈ రెండింటి వల్ల అశాంతి రేగుతోంది, సామాన్యుల ప్రాణాలు పోతున్నాయని అంతా అంటూంటారు.
పాలకులు అయితే ఈ రెండింటినీ ఒకే గాటకు కట్టి అణచేందుకు చూస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. దీని మీద సీనియర్ కామ్రేడ్ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారాయణ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టెర్రరిజం నక్సలిజం ఈ రెండూ ఒక్కటి కానే కాదు అని అన్నారు.
ఈ విషయం పాలకులు ముందుగా తెలుసుకోవాలని కోరారు. నక్సలిజం అన్నది ఒక సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని పుట్టిందని ఆయన అన్నారు. ఒక మంచి వ్యవస్థ కోరుకుంటూ నక్సలిజం ఆవిర్భవించిందని ఆయన చెప్పారు. దాని కోసమే పనిచేస్తూ చాలా మంది నక్సలైట్లుగా మారారని గుర్తు చేశారు.
సమ సమాజం అందరికీ న్యాయం అన్నదే నక్సలైట్లు కోరుకుంటున్నారని దాని కోసమే వారు పనిచేస్తున్నారని నారాయణ అన్నారు. నక్సలైట్లు దోపిడీ వ్యవస్థకు మాత్రమే శత్రువులు తప్ప ఎవరికీ కారని ఆయన స్పష్టం చేశారు.
అటువంటి నస్కలిజాన్ని అంతం చేస్తామని పాలకులు భావించడం తప్పుడు విధానం అన్నారు ముందు వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలని మూలాల్లోకి వెళ్ళి సరిచేయాలని ఆయన సూచించారు. దోపిడీ వ్యవస్థ అంతం కానంతవరకూ నక్సలిజం కూడా అంతం కాదని ఆయన స్పష్టం చేశారు.
ఇక టెర్రరిజానికి ఒక సిద్ధాంతం లేదని అశాంతి అరాచకమే వారి సిద్ధాంతం అని నారాయణ విమర్శించారు. అలాంటి టెర్రరిజాన్ని అంతం చేసే విషయంలో పాకలుకు ఏ నిర్ణయం తీసుకున్నా తాము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు.
నక్సలిజాన్ని అంతం చేయాలన్న తపన ఆరాటంలో పదవ వంతు టెర్రరిజాన్ని అంతం చేయడం మీద దృష్టి పెడితే ఎంతో బాగుండేదని కేంద్రానికి ఆయన చురకలు అంటించారు. ఇటీవల కాలంలో కేంద్రం మావోయిస్టులను టార్గెట్ చేస్తోంది పెద్ద ఎత్తున వారు హతులు అవుతున్నారు.
దాంతో మావోలకు భారీ షాక్ తగులుతోంది. ఈ క్రమంలో నారాయణ చేసిన వ్యాఖ్యలు ఇపుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మీద నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. టెర్రరిజం మీద అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే మోడీ బీహార్ వెళ్ళి ఎన్నికల కోసం సభలో ప్రసంగించారని విమర్శించారు.
టెర్రరిజం కోసం అంతా ఐక్యంగా ఉండాలని ఆయన కోరారు. ఈ విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తాము మద్దతుగా నిలుస్తామని ఆయన చెప్పారు. అదే సమయంలో కన్నుకు కన్ను పన్నుకు పన్ను విధానం కరెక్ట్ కాదని అన్నారు. అన్నీ ఆలోచించి టెర్రరిజం లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర పెద్దల మీద ఉంది అని ఆయన అన్నారు.