నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న కానిస్టేబుల్..? సోషల్ మీడియాలో వైరల్
నడిగూడెంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కృష్ణంరాజు వరుసగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని,;
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న కానిస్టేబుల్ మోసాలను సోషల్ మీడియా బయటపెట్టింది. ఏడాది క్రితం ఓ బాలికను సైతం మోసం చేసి పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కృష్ణంరాజుపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. గతంలో అవినీతి వ్యవహారాలకు సంబంధించి సస్పెండ్ అయిన కృష్ణంరాజు మొత్తం నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని, అందులో నాలుగో భార్య బాలికగా చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ఎస్పీ దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు.
నడిగూడెంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కృష్ణంరాజు వరుసగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని, ఏడాది క్రితం ఓ బాలికను వివాహం చేసుకుని సూర్యపేట పట్టణంలో కాపురం పెట్టాడని ఆరోపణలు వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో పోలీసులు ఫోకస్ చేశారు. ఈ అంశంపై విచారించాలని మునగాల సీఐ రామకృష్ణారెడ్డిని ఎస్పీ ఆదేశించారు. దీంతో ఆయన సూర్యాపేట పట్టణంలోని కానిస్టేబుల్ కృష్ణంరాజు నివాసానికి వెళ్లి వివరాలు సేకరించారు.
చివ్వెంల మండలానికి చెందిన కృష్ణంరాజుపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. ఇసుక వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో తిరుమలగిరి పోలీసుస్టేషన్ లో పనిచేసిన సమయంలో సస్పెండ్ అయ్యాడు. ప్రస్తుతం సూర్యాపేట కలెక్టరేట్ లో విధులు నిర్వహిస్తున్నాడు. అతడి పెళ్లిళ్లపై సోషల్ మీడియాలో పోస్టులు రావడంతో మూడు రోజుల క్రితం పరారయ్యాడు. నిబంధనలకు విరుద్ధంగా మైనర్ ను వివాహం చేసుకున్నాడని అతడిపై పోక్సో కేసు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.