షర్మిలకు కాంగ్రెస్ నో చెప్పటం వెనుక ఉన్నదెవరు?
కానీ.. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను చూస్తే.. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ఫైనల్ చేసిన వారి కంటే బలమైన అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడుతున్నా.. వారికి దక్కని టికెట్.. వేరే వారికి దక్కటం ఆసక్తికరంగా మారింది.;
తనదేమీ లేదని.. తాను కేవలం పార్టీ ఏం చెబితే అది చేసే వ్యక్తిని మాత్రమేనని.. తాను పార్టీ అధినాయకత్వాన్ని పెద్దగా ప్రభావితం చేయలేనని చెప్పే రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు మధ్య అంతరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన మాటకు పార్టీలో ఎంత ప్రాధాన్యత ఉందన్న విషయం.. ఈ మధ్యన విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాను చూస్తే అర్థమవుతుందని చెప్పాలి. కొన్ని స్థానాలకు పార్టీ డిసైడ్ చేసిన అభ్యర్థుల్ని చూసినోళ్లు అవాక్కు అయ్యే పరిస్థితి. ఈ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా బరిలోకి దిగినప్పుడు.. బలమైన అభ్యర్థులు బరిలో నిలవాల్సిన అవసరం ఉంది.
కానీ.. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను చూస్తే.. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ఫైనల్ చేసిన వారి కంటే బలమైన అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడుతున్నా.. వారికి దక్కని టికెట్.. వేరే వారికి దక్కటం ఆసక్తికరంగా మారింది. లోతుగా చూస్తే.. రేవంత్ ముద్ర కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. పార్టీకి విధేయులన్న పేరుతో టికెట్లు పొందే చాలామంది తర్వాతి కాలంలో పార్టీని వీడిపోతున్న నేపథ్యంలో.. తనదైన టీంను తయారుచేసుకునే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్.
ఇందుకు సంబంధించిన ఆయనకు ఇవ్వాల్సిన ఫ్రీ హ్యాండ్ ను పార్టీ అధినాయకత్వం ఇస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ కారణంతోనే.. తొలిజాబితాలో ఆయన మాట చెల్లుబాటు కావటమే కాదు.. ఆయన చెప్పిన వారికి టికెట్లను ఇచ్చినట్లుగా చెబుతున్నారు. తొలిజాబితాలో పార్టీ నాయకత్వాన్ని ప్రభావితం చేసిన రేవంత్.. షర్మిల ఎపిసోడ్ లోనూ తెలివిగా వ్యవహరించినట్లు చెబుతున్నారు.
షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకునే విషయంలో అధినాయకత్వం ఆసక్తితో ఉన్నప్పటికి..ఈ పరిణామం చోటు చేసుకుంటే జరిగే నష్టాన్ని పార్టీ పెద్దలకు రేవంత్ వివరంగా వివరించినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్నపరిస్థితుల్లో షర్మిల పార్టీలోకి రావటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని రేవంత్ వివరంగా చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ పార్టీ బాద్యతల్నిమోస్తున్న రేవంత్ మాటకు అధినాయకత్వం ఎక్కువ విలువ ఇవ్వటంతోనే షర్మిల ప్రపోజల్ ను పక్కన పెట్టినట్లుగా చెబుతున్నారు. షర్మిల పార్టీలోకి రావటంతోనే.. పార్టీలో ఇప్పుడున్న గ్రూపులు మరింత ఎక్కువ కావటమేకాదు.. తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసే ఆయుధాన్ని గులాబీ బాస్ కు ఇచ్చినట్లు అవుతుందన్న వాదనకు కాంగ్రెస్ అధినాయకత్వం సైతం ఏకీభవించినట్లుగా చెబుతున్నారు. ఈ కారణంతోనే షర్మిల విలీన ప్రపోజల్ కు కాంగ్రెస్ నో చెప్పినట్లుగా తెలుస్తోంది.