మంత్రి నారాయణ.. మాజీ మంత్రి గంటా మనమడి ఘనత

నిమిషం వ్యవధిలో (60 సెకన్లు సుమా) 216 డెసిమల్స్.. గోల్డెన్ రేషియోను నాన్ స్టాప్ గా చెప్పేసిన ఆర్యన్ గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్నాడు.;

Update: 2025-12-21 05:23 GMT

రాష్ట్రాలతో సంబంధం లేకుండా కొందరు రాజకీయ నాయకులు.. కొన్ని ప్రముఖుల కుటుంబాలు తెలుగు ప్రజలకు సుపరిచితం. ఈ కోవలోకే వస్తారు ఏపీ మంత్రి నారాయణ.. ఏపీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. వీరిద్దరికి మనమడైన ఎనిమిదేళ్ల జిష్ణు ఆర్యన్ సాధించిన రికార్డు చూసినప్పుడు పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెత గుర్తుకు రాక మానదు. తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈ చిచ్చరపిడుగు పేరు నమోదైంది. ఇంతకూ ఇతగాడు సాధించిన రికార్డు చూసినప్పుడు.. పిల్లాడి టాలెంట్ కు ఫిదా కావాల్సిందే.

నిమిషం వ్యవధిలో (60 సెకన్లు సుమా) 216 డెసిమల్స్.. గోల్డెన్ రేషియోను నాన్ స్టాప్ గా చెప్పేసిన ఆర్యన్ గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్నాడు. దీన్ని చదివినప్పుడు.. పిల్లాడి తాతల బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో.. చిన్నారిని తక్కువగా అంచనా వేయటం పొరపాటే అవుతుంది. ఎనిమిదేళ్ల చిన్న వయసులో ఇతడు సాధించిన రికార్డు అసాధారణమైనది. ఇంతకూ ఈ పోటీ ఎలా ఉంటుంది? ఆ పిల్లాడు ఎంతటి క్లిష్టమైన అంశాన్ని ఆచీవ్ చేశాడన్నది చూస్తే.. పిల్లాడి బ్రెయిన్ ఎంత షార్ప్ గా ఉంటుందో అర్థమవుతుంది.

గోల్డెన్ రేషియో సుమారు 1.6180339887.... అనేది ఒక ఇరేషనల్ నంబర్. అంటే.. దాని దశాంశాలు ఎప్పటికి ముగియవు. అదే సమయంలో ఈ క్రమ పద్దతిలోనూ రిపీట్ కావు. దీంతో.. ప్రతి అంకెను విడిగా గుర్తుంచుకోవాలి. అలాంటిది 216 అంకెల్ని గుర్తు పెట్టుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదు. అందులోనూ నిమిషం వ్యవధిలో అంటే చాలా అంటే చాలా కష్టమైన పని. సాధారణంగా ఒక సగటు స్థాయి వ్యక్తి తన షార్ట్ టర్మ్ మెమరీలో 5 నుంచి 9 అంకెల్ని మాత్రమే గుర్తు పెట్టుకునే వీలుంది.

నారాయణ.. గంటా మనమి విషయానికి వస్తే.. నిమిషం వ్యవధిలో 216 అంకెల్ని పలకటానికి అతడికి ఒక్కో అంకెను చెప్పేందుకు కేవలం 0.27మిల్లీ సెకన్ల సమయమే ఉంటుందన్నది మర్చిపోకూడదు. 216 నంబర్లను మర్చిపోకుండా ఒకేలాంటి ఫ్లోలో పూర్తి చేయటం అసాధారణ మెమరీతోనూ.. అత్యంత కష్టమైన శిక్షణతోనూ సాధ్యమవుతుంది. ఇలాంటి ఫీట్లను మెమరీ అథ్లెట్స్ పూర్తి చేస్తారు. కాకుంటే.. ఎనిమిదేళ్ల వయసులోనే అంటే మాత్రం.. ఈ పిల్లాడు అసాధారణ మెమరీతో పాటు.. అత్యంత చురుకైన పిల్లాడిగా చెప్పాల్సిందే. ఈ తరహా ఫీట్ సాధించాలంటే ఏకాగ్రతతో పాటు.. కఠినమైన ప్రాక్టీస్ తోనే సాధ్యమని చెప్పాలి.

ఇక.. ఈ పిల్లాడి తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాల్సిందే. ఆర్యన్ తండ్రి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకు. అతడి పేరు రవితేజ. ఇక.. ఆర్యన్ తల్లి మంత్రి నారాయణ కుమార్తె శరణి. ఆర్యన్ తల్లిదండ్రులు ఇద్దరు నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు. చివరగా..మరో ఆసక్తికర అంశాన్ని చెప్పి ముగించాలి. పేరుకు తగ్గట్లు ఉండటం చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఈ మేజిక్ పిల్లాడి పేరుకు అర్థం వెదికితే.. జిష్ణు అంటే విజేత అని అర్థం. ఆర్యన్ అంటే గొప్ప/విద్యావంతుడని అర్థం. చాలా సందర్భాల్లో జిష్ణు అనే పేరున్న అబ్బాయిలు తెలివైనవారిగా.. దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారని చెబుతుంటారు.

Tags:    

Similar News