ఏపీలో పొలిటికల్ 'పందెం' కోళ్లు.. కలిసిపోతున్నాయి.. !
దీనికి మరో కారణం కూడా.. ఒకరిని వదిలి మరొకరు ఉండకపోవడానికి కారణం.. రచ్చ చేయకూడదన్న ఉద్దేశమేనని తెలుస్తోంది.;
సంక్రాంతి పండుగకు మరో 25 రోజుల సమయం ఉంది. ఇప్పటి నుంచే ఉభయ గోదావరి జిల్లాల్లో పందెం కోళ్లు కొక్కురకో.. అంటున్నాయి. బరులు.. గిరిలు.. గీస్తున్నారు. వాటాలు వేసుకుంటున్నారు. జిల్లాకు ఇద్దరు చొప్పున `నాయకులు` కూడా ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కోడి పందేలు.. ఇతరత్రా సంప్రదాయ కార్యక్రమాల పేరుతో హడావుడికి రెడీ అయ్యారు. అయితే..ఎప్పుడూ ఉండేదే అని ఈ సారి సరిపెట్టుకునే అవకాశం లేదు.
ఎందుకంటే.. ఈ దఫా వాటాల కోసం.. అందరూ కలిసిపోయారు. పార్టీలు, రాజకీయాలు వంటివి చూడకుండా.. అందరూ కలసి కట్టుగా పందెం కోళ్లతో ఏకమయ్యారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎప్పుడూ ఈ సందప్రదాయం కొనసాగుతున్నా..ఇప్పుడు ఇదే తరహా రాజకీయం కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు విస్తరించింది. ఇక్కడ కూడా ఈ దఫా భారీ ఎత్తున బరులు రెడీ అవుతున్నాయి. అందరూ కలిసి మెలిసి పోతున్నారు. సంప్రదాయ పండుగలకు రాజకీయాలు అడ్డురావని నేరుగా చెబుతున్నారు.
చిత్రం ఏంటంటే..చాలా మంది టీడీపీ నాయకులు.. వైసీపీకి చెందిన వారి నుంచి, వైసీపీ నేతలు.. వేరే మరో పార్టీ నాయకులను కూడా సొమ్ములు తీసుకుంటున్నారట. ఈ విషయం పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. అందరూ కలివిడిగా.. ఆడుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే ఎవరికి ఏయే బరులు కావాలో కూడా.. నిర్ణయించుకున్నారు. రెండు రోజుల కిందట .. పశ్చిమలోని ఓ నియోజకవర్గంలో పెద్ద సమావేశం నిర్వహించి.. జిల్లా వ్యాప్తంగా చేపట్టే బరులపై నిర్ణయానికి వచ్చారు.
దీనికి మరో కారణం కూడా.. ఒకరిని వదిలి మరొకరు ఉండకపోవడానికి కారణం.. రచ్చ చేయకూడదన్న ఉద్దేశమేనని తెలుస్తోంది. పోలీసులు సమాచారం.. మీడియా కు సమాచారం ఇవ్వడం.. న్యాయపోరాటం పేరుతో పిటిషన్లు వేయడం.. వంటివి లేకుండా.. అందరూ కలిసి కట్టుగా ముందుకు సాగేందుకు.. పది రూపాయలు వెచ్చించి.. 100 రూపాయలు వెనుకేసుకునేందుకు కలివిగా ముందుకు సాగాలని నిర్ణయించారు. గుంటూరుకు చెందిన మాజీ ఎంపీ ఒకరు పశ్చిమలో బరులను లీజుకు తీసుకున్నారు. నెల్లూరుకు చెందిన వైసీపీ నేత ఒకరు గుడివాడలో బరులకు సిద్ధమయ్యారు. ఇలా.. అందరూ కలివిడిగా.. పందెం కోళ్లకు రెడీ అయ్యారు.!!. కానీ,ఈ కలివిడి అభివృద్ధిలోనూ ఉంటే బాగుంటుంది కదా! అంటే.. ఆ ఒక్కటి అడగొద్దని చెబుతున్నారు.