6 దశ బీజేపీకి విషమ పరీక్ష.. కాంగ్రెస్ కు అగ్ని పరీక్ష

సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ.. మొత్తం ఏడు దశలు.. నెలన్నర సమయం.. సువిశాల భారత దేశాన్ని ఐదేళ్ల పాటు పాలించేది ఎవరు

Update: 2024-05-22 16:30 GMT

సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ.. మొత్తం ఏడు దశలు.. నెలన్నర సమయం.. సువిశాల భారత దేశాన్ని ఐదేళ్ల పాటు పాలించేది ఎవరు..? వరుసగా మూడోసారీ అధికారం బీజేపీ-మోదీదేనా? కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి ఇండియా పీఠంపై కూర్చుంటుందా..? వీటికి జవాబు కావాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. కాగా, దేశంలో ఇప్పటికే ఐదు దశల ఎన్నికలు ముగిశాయి. కాగా , ఐదో దశ అనంతరం 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 428 నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తయినట్లైంది. మరో రెండు దశల ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నెల 25న ఆరో దశ, జూన్ 1 ఏడో దశ జరగనుంది.

వీటిలో బీజేపీదే ఆధిపత్యం..

ఈ నెల 25న ఆరో దశలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందులో విశేషం ఏమంటే.. దేశ రాజధాని ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలు, హరియాణాలోని 10 స్థానాలకూ ఈసారి పోలింగ్ జరగనుంది. కాగా, ఈ 58 నియోజకవర్గాల్లోనూ గత ఎన్నికల్లో ఎక్కువ సీట్లను ఎన్డీయే కూటమే గెలుచుకుంది. ఇప్పుడు ఇండియా కూటమి.. వీటిలో మెజారిటీ సీట్లు సాధిస్తే గాని.. అధికారం అందుకునే అవకాశం లేదు.

Read more!

ఖాతా తెరవని కాంగ్రెస్..

ఆరో దశ పోలింగ్ లో భాగమైన 58 ఎంపీ సీట్లలో 2019లో కాంగ్రెస్ ఒక్కటీ నెగ్గలేదు. ఇప్పుడు ఖాతా తెరవడమే కాక బీజేపీ స్కోరును కూడా తగ్గించాలి. ఇక మోదీ కలలు కంటున్నట్లు హ్యాట్రిక్ కొట్టాలంటే ఈ 58 సీట్లలో అత్యధికం నెగ్గాలి.

ఆప్ నకు పరీక్ష

జాతీయ పార్టీ హోదా పొందిన ఆప్ నకు ఈ దశ పోలింగ్ చాలా ముఖ్యం. ఢిల్లీలో అధికారంలో ఉండడమే దీనికి కారణం. ఇక ప్రాంతీయ పార్టీలకూ ఆరో దశ ఎన్నికలు అగ్నిపరీక్షనే. యూపీలో 14, బిహార్‌ లో 8, హరియాణాలో 10, ఢిల్లీలో 7, పశ్చిమ బెంగాల్‌లో 8, జార్ఖండ్‌ లో 4, ఒడిశాలో 6, కశ్మీర్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరగనుంది.

58లొ 40..

వచ్చే దశలో ఎన్నికలు జరిగే 58 సీట్లలో బీజేపీ 2019లో 40 స్థానాల్లో విజయం సాధించింది. బీఎస్పీ 4, టీఎంసీ 3, బీజేడీ 4, జేడీయూ 3, ఎల్‌జేపీ, ఏజేఎస్‌యూ, నేషనల్ కాన్ఫరెన్స్, ఎస్పీ ఒక్కొక్క సీటు సాధించాయి. కాంగ్రెస్, ఆప్, ఆర్జేడీ ఖాతానే తెరవలేదు. ఇక నాడు హరియాణా, ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి మాత్రం అక్కడ బీజేపీకి సీట్లు తగ్గే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. గతంలో సాధించిన 40 సీట్లనూ నిలుపుకొనే చాన్స్ లేదంటున్నారు. మొత్తానికి బీజేపీకి విషమ పరీక్ష.. కాంగ్రెస్ కు అగ్ని పరీక్ష.

Tags:    

Similar News