ఏఐసీసీకి నో పవర్స్.. ఇక అధికారాలన్నీ ఎవరివో తెలుసా!
కాంగ్రెస్ లో ఏఐసీసీ నిర్ణయాలే సుప్రీం. ఏఐసీసీ పెద్దలు సూచనలు, సలహాలనే క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సివుంటుంది.;
కాంగ్రెస్ లో ఏఐసీసీ నిర్ణయాలే సుప్రీం. ఏఐసీసీ పెద్దలు సూచనలు, సలహాలనే క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సివుంటుంది. జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎంత పెద్ద స్థాయి నేతలు ఉన్నా, వారు ఏఐసీసీ పెద్దలకు జీ హుజార్ అనాల్సిందే.. అయితే ఈ విధానంపై చాలా కాలం తర్వాత హస్తం హైకమాండ్ అంతర్మథనం చేసుకుంది. పైన చెప్పడం.. క్షేత్రస్థాయిలో ఆచరించడం వల్ల పార్టీకి ఎక్కువగా నష్టమే జరిగిందని ఫీడ్ బ్యాక్ రావడంతో ఇప్పటి వరకు అమలు చేస్తున్న విధానాన్ని సమూలంగా మార్చేయాలని అగ్రనేత రాహుల్ గాంధీ సూచించినట్లు సమాచారం.
కాంగ్రెస్ లో సమూల మార్పుల దిశగా ఆ పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకుంటోంది. పార్టీని ప్రక్షాళించి వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బలోపేతమై ప్రధాన పోటీదారుగా అవతరించాలని హస్తం నేతలు భావిస్తున్నారు. ఇటీవల గుజరాత్ లో నిర్వహించిన పార్టీ సమావేశంలో చర్చించిన మేరకు పార్టీ పునర్వవ్యవస్థీకరణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇకపై ఢిల్లీ నుంచి తమ అభిప్రాయాలు రుద్ద కూడదని నిర్ణయించారు. దీనివల్ల క్షేత్ర స్థాయి పరిస్థితులు, పార్టీ బలాబలాలు తెలియడం లేదని చెబుతున్నారు.
కొత్తగా తీసుకున్న నిర్ణయం ప్రకారం కాంగ్రెస్ లో జిల్లా, రాష్ట్ర కమిటీలకు విస్తృత అధికారాలు కట్టబెట్టాలని సన్నాహాలు జరుగుతున్నాయి. 1967 వరకు కాంగ్రెస్ లో ఇదే విధానం అమలులో ఉండేది. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను జిల్లా, రాష్ట్ర కమిటీలు సూచిస్తే అధిష్ఠానం వారికే టికెట్లు ఇచ్చేది. అయితే ఈ విధానాన్ని అటకెక్కించి ఏఐసీసీకి ఫుల్ పవర్స్ అప్పగించడంతో పార్టీ రివర్స్ గేర్ లో తిరోగమనం బాట పట్టిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రధానంగా గత 11 ఏళ్లుగా ప్రతిపక్షంలో కొనసాగాల్సిన పరిస్థితులు ఏర్పడటం, ఈ 11 ఏళ్ల వ్యవధిలో అనేక రాష్ట్రాల్లో పట్టు కోల్పోవడంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే క్షేత్రస్థాయి నేతలను ప్రోత్సహించి, వారి సూచనలు, సలహాలతోనే పార్టీని నడిపించాలని భావిస్తోంది. డీసీసీలకు నిర్దిష్టమైన బాధ్యతలు అప్పగించి, వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. ప్రస్తుతం అన్నీ ఏఐసీసీ చూసుకుంటుందనే భావనతో డీసీసీ, పీసీసీ కార్యవర్గాలు నిస్తేజంగా మారిపోయాయంటున్నారు.
నిత్యం ప్రజల్లో ఉండే డీసీసీ, పీసీసీ నేతలను విశ్వాసంలోకి తీసుకోవడం ద్వారా ప్రజలకు ఏం కావాలో.. ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అధిష్ఠానం అర్థం చేసుకోగలుగుతుందని అంటున్నారు. క్షేత్రస్థాయి సమాచారాన్ని క్రోడీకరించి జాతీయస్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం అవసరమని అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడుతున్నారు. మూడు నెలల్లో జిల్లా కమిటీలను బలోపేతం చేయడంతోపాటు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల నిర్ణయాధికారం వారికే కట్టబెట్టనున్నట్లు చెబుతున్నారు.