కామ్రేడ్స్ కి టీడీపీ మీద ఆశలు పోలేదా ?

ఏపీలో ఎర్రన్నల పోకడలు వేరుగా ఉంటాయని అంటారు. ఆ పార్టీలు నిజానికి ప్రజల కోసం పనిచేస్తూ ఉంటాయి.;

Update: 2025-03-29 17:30 GMT

ఏపీలో ఎర్రన్నల పోకడలు వేరుగా ఉంటాయని అంటారు. ఆ పార్టీలు నిజానికి ప్రజల కోసం పనిచేస్తూ ఉంటాయి. పేదల కోసం పోరాడే పార్టీలుగా పేరు ఉంది. అయితే విభజన ఏపీలో మాత్రం ఇప్పటికి మూడు ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయాయి.

ఆ విధంగా కామ్రేడ్స్ కి ఏపీ అసెంబ్లీలో అవకాశం అయితే ఎందుకో దక్కడం లేదు. ఒక్క కామ్రేడ్ సభ్యుడిగా ఉన్నా ప్రజా సమస్యల ప్రస్తావన జరుగుతుందని అంతా అంటారు. ఇక చూస్త 2014 నుంచి 2024 ఎన్నికల వరకూ కామ్రేడ్స్ కి సరైన పొత్తులు కుదరలేదు ఆ పార్టీలు పొత్తులు పెట్టుకునే అసెంబ్లీకి వస్తున్నాయి. తెలంగాణాలో బీఆర్ఎస్ తో ఉన్నాయి కాంగ్రెస్ తో ఉన్నాయి.

ఏపీలో మాత్రం టీడీపీతో ఉండాలని అనుకుంటే కుదరడంలేదు, అదే సమయంలో వైసీపీతో చేతులు కలపలేకపోతున్నాయి. నిజానికి విభజన తరువాత ఏపీలో బీజేపీ ప్రత్యక్ష పరోక్ష రాజకీయ ప్రమేయం అధికం అయిపోయింది. ఏపీలో బీజేపీకి ఉన్న బలం తక్కువ అయినా కేంద్ర స్థాయిలో బీజేపీ బలంగా ఉండడం అధికారంలో ఉండడంతో ఏపీ రాజకీయాలను కూడా శాసిస్తోంది. అదే సమయంలో ఏపీలో ఎవరు అధికారంలో ఉన్నా కేంద్రంతో సఖ్యత నెరపడం అన్నది అనివార్యం అయిపోయింది.

ఇక ఏపీలో మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇందులో టీడీపీ 2014లో బీజేపీతో చేతులు కలిపింది. అపుడు కొత్తగా పుట్టిన జనసేన మద్దతు ఇచ్చింది. ఆ సమయంలో కామ్రేడ్స్ వైసీపీతో కలసి పొత్తుతో పోటీకి దిగవచ్చు కానీ అలా జరగలేదు వైసీపీ ఒంటరిగా పోటీకి దిగితే కామ్రేడ్స్ కూడా తమ సొంత బలాన్ని చాటాలని అనుకున్నాయి. ఫలితం అసెంబ్లీలోకి అడుగుపెట్టలేకపోయాయి.

ఇక 2019 ఎన్నికల్లో చూస్తే జనసేనతో పొత్తుకు దిగాయి. మంచి నంబర్ నే పొత్తులో తీసుకుని పోటీ చేశాయి. మధ్యలో బహుజన సమాజ్ వాదీ పార్టీ కూడా వచ్చి చేరింది. ఈ పొత్తు బలంగా ఉంటుందని ఎన్నో కొన్ని సీట్లు దక్కుతాయని అంతా అనుకున్నారు కానీ జనసేనకే ఒక సీటు దక్కింది. పవన్ సైతం ఓటమి పాలు అయ్యారు. దాంతో కామ్రేడ్స్ కి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ద్వితీయ విఘ్నం అలా అడ్డుపడింది.

ఇక 2024 ఎన్నికలలో చూస్తే మళ్ళీ టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా జట్టుకట్టాయి. బలంగా ముందుకు వచ్చాయి. మొత్తం సీట్లను ఓట్లను కొల్లగొట్టాయి. ఈ దెబ్బకు వైసీపీ కుదేల్ అయింది ఒంటరిగా మరోసారి పోటీ చేసిన కామ్రేడ్స్ కి ఆశాభంగం తప్పలేదు.

ఏపీలో చూస్తే కనుక కామ్రేడ్స్ కి పొత్తులు ఎవరితో అన్నది తెలియడం లేదు. 2029లోనూ బీజేపీ జనసేన టీడీపీ పొత్తులు కంటిన్యూ అవుతాయని ఆయా పార్టీల నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇక వైసీపీ మాత్రమే విపక్షంలో ఉంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఎర్రన్నల వైపు నుంచి ప్రయత్నం లేదు వైసీపీ వైపు నుంచి కూడా అడుగులు ముందుకు పడడం లేదు

పైగా అవకాశం వచ్చిన ప్రతీసారీ సీపీఐ నేతలు వైసీపీ మీదనే విమర్శలు చేస్తూ వస్తున్నాయి. దాంతో వైసీపీ కూడా వారిని ప్రత్యర్థులుగా చూస్తోంది అని అంటున్నారు. అయితే ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పెద్ద పార్టీ అయిన వైసీపీ కామ్రేడ్స్ ని కాంగ్రెస్ ని కలుపుకుని కూటమిగా ఏర్పాటు చేస్తేనే ఎన్డీయే కూటమిని ఏపీలో ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు.

అయితే కామ్రేడ్స్ మాత్రం ఆది నుంచి వైసీపీ పట్ల ఎందుకో విముఖంగానే ఉంటున్నారు అని అంటున్నారు. ఏదో అద్భుతం జరిగి బీజేపీ నుంచి టీడీపీ విడిపోకపోతుందా అపుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోలేకపోతామా అన్నదే బహుశా ఎర్రన్నల ఆశ ఆలోచనలు కావచ్చు అన్న ప్రచారం కూడా ఉంది. అయితే అదేమంత సులువుగా అయ్యేలా లేదని అంటున్నారు. కామ్రేడ్స్ ఏపీలో పొత్తు పార్టీలను ఎంచుకోవడంతో వాస్తవ దృక్పధంతో అడుగులు వేయకపోతే కనుక 2029లోనూ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలు సన్నగిల్లుతాయనే అంటున్నారు. చూడాలి మరి మరో నాలుగేళ్ళలో రాజకీయంగా పరిణామాలు ఏ విధంగా మారుతాయో.

Tags:    

Similar News