సైబర్ బందిపోట్ల రేంజ్ చెప్పే ట్రూకాలర్ ఇండియా ఇన్ సైట్ రిపోర్టు
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే.. ఎప్పుడు ఏ రూపంలో సైబర్ బందిపోట్లు దాడి చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.;
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే.. ఎప్పుడు ఏ రూపంలో సైబర్ బందిపోట్లు దాడి చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అనుక్షణం అప్రమత్తంగా ఉండటమేకాదు.. సీజన్ కు తగ్గట్లు ఎప్పటికప్పుడు తమ స్క్రిప్టును మార్చేసి మోసం చేసేందుకు వీలుగా ఎత్తులు వేసే సైబర్ బందిపోట్ల తీరు ఎలా ఉంటుంది? వారి దాడులు ఎంత భారీగా ఉంటాయన్న విషయాన్ని ట్రూకాలర్ ఇండియా ఇన్ సైడ్ రిపోర్టు కళ్లకు కట్టేలా చేసింది.
ప్రముఖ కంపెనీల మాదిరి నటిస్తూ.. మేసేజింగ్ యాప్స్ ద్వారా ఫోన్లలోకి జొరబడి ఖాతాల్లో ఉన్న డబ్బులు ఖాళీ చేస్తున్న వైనం తెలిసిందే. ఇప్పటికే వీరి తీరుతో కోట్లాది మంది బాధితులుగా మారుతున్నారు. ఒక్క 2025లో సైబర్ మోసాల కారణంగా ఒక్క భారతీయులు నష్టపోయిన సొమ్ము అక్షరాల రూ.19,813 కోట్లు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలు అంతే ఎక్కువగా జరుగుతున్నాయి.
తనకున్న 32 కోట్ల ట్రూకాలర్ వినియోగదారుల డేటాను విశ్లేషించిన ఈ సంస్థ తన ఇన్ సైడ్ రిపోర్టును బయటపెట్టింది. సాధారణ ఎస్ఎంఎస్, ఫోన్ కాల్స్ కు బదులుగా థర్డ్ పార్టీ మేసేజింగ్ యాప్స్ అయిన వాట్సాప్, ఇన్ స్టా డైరెక్ట్ మేసేజ్, టెలీగ్రామ్ లాంటి వాటిని నేరగాళ్లు టార్గెట్ చేసుకుంటున్నారు. ఎస్ఎంఎస్ రూపంలో ఫేక్ కరెంట్ బిల్లులు.. ట్రాఫిక్ చలానాలు వంటి వాటి ద్వారా డబ్బు కొట్టేసే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈ రిపోర్టు వెల్లడించింది.
ట్రూకాలర్ ఇన్ స్టాల్ చేసుకున్న వినియోగదారుల ద్వారా 4,168 కోట్ల స్పామ్ కాల్స్ ను, 12,903 కోట్ల స్పామ్ మెసేజ్ లను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ స్పామ్ కాల్స్ లో 770 కోట్ల కాల్స్ బ్యాంకులను.. ప్రభుత్వ సంస్థలను.. పేమెంట్ ప్లాట్ ఫామ్ లను.. ప్రఖ్యాత బ్రాండ్లను అనుకరించి.. వాటిలా నటించి మోసం చేసే ఉద్దేశంతో చేసినవిగా వెల్లడించింది.
కమ్యూనిటీ రిపోర్టింగ్ సహకారంతో 1,189 కోట్ల స్పామ్ కాల్స్ ను వినియోగదారులకు చేరకుండా ట్రూకాలర్ అడ్డుకున్నట్లుగా రిపోర్టులో పేర్కొన్నారు. ఒక్కో స్పామ్ కాల్ కు 1.8 నిమిషాల సమయం అనుకుంటే.. మొత్తం స్పామ్ కాల్స్ ను అడ్డుకోవటం ద్వారా ప్రతి రోజు 21.7 లక్షల గంటల సమయాన్ని.. ప్రతి వారానికి 1.5 కోట్ల గంటల సమయాన్ని తాము కాపాడినట్లుగా ట్రూకాలర్ వెల్లడించింది.