అమెరికా ఉగ్రదాడి వేళ భారత్ కీలక నిర్ణయం.. ట్రంప్ ఎక్కడ?
అమెరికాలోని కొలరాడోలో యూదులపై ఫైర్ బాంబు దాడి జరిగింది. ఆదివారం ఇజ్రాయెల్ బందీల జ్ఞాపకార్థం యూదులు ర్యాలీ నిర్వహించారు.;
అమెరికాలోని కొలరాడోలో యూదులపై ఫైర్ బాంబు దాడి జరిగింది. ఆదివారం ఇజ్రాయెల్ బందీల జ్ఞాపకార్థం యూదులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గుమిగూడిన ప్రజలపై ఓ వ్యక్తి మండే స్వభావం గల ద్రావణాలను ను విసిరాడు. ఈ ఘటనలో కనీసం ఆరుగురు గాయపడ్డారు. దీనిపై స్పందించిన ఎఫ్.బీ.ఐ.. దీన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది! ఈ సమయంలో భారత్ స్పందించింది.
అవును... అమెరికాలోని లొకరాడోలో.. హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారికి సంఘీభావంగా ప్రజలు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో ఓ వ్యక్తి మండే స్వభావం గల ద్రావణం ఉన్న సీసాలను తీసుకొచ్చి వారిపైకి విసిరాడు. ఆ ద్రావణం మీద పడటంతో కనీసం ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే వారిని అధికారులు ఆస్పత్రికి తరలించారు.
ఈ సందర్భంగా... ఈ ఘటనకు పాల్పడిన అనుమానితుడు మహ్మద్ సబ్రీ సోలిమాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఎఫ్.బీ.ఐ. డైరెక్టర్ కాష్ పటేల్ ఈ సంఘటనను ఉగ్రదాడిగా అభివర్ణించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియే ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
దీనిపై స్పందించిన వైట్ హౌస్... ఈ దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ ఘటన గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వివరించినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ ఐరాసలో ఈ దాడిపై మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే భారత్ స్పందించింది.
ఈ ఘటనపట్ల కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు శశిథరూర్ సారథ్యంలోని భారత అఖిలపక్ష పార్లమెంట్ ప్రతినిధుల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అమెరికాకు సంఘీభావాన్ని ప్రకటించింది. ఈ క్రమంలోనే.. ఉగ్రవాదం వల్ల సంభవించే విపరిణామాలను తెలియపరుస్తామని పేర్కొంది.
కాగా... పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ పై భారత్ ఎందుకు యుద్ధానికి దిగాల్సి వచ్చిందనే విషయంతో పాటు.. పాకిస్థాన్ అనుసరిస్తున్న ఉగ్రవాద అనుకూల వైఖరిని ఎండగడుతూ శశిథరూర్ సారధ్యంలోని పార్లమెంట్ ప్రతినిధుల బృందం వివిధ దేశాల్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా అమెరికాలోని కొలరాడోలో జరిగిన ఘటనపై ఈ టీమ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసిన తర్వాత ఉపశమనం పొందినట్లు థరూర్ తెలిపారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియోతో పంచుకుంటానని అన్నారు.
ఈ నేపథ్యంలో... ట్రంప్ కు ఇంకా ఎన్ని సంఘటనలు జరిగితే ఉగ్రవాదంపై ఆగ్రహం వస్తుందో చెప్పాలంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు! భారత్ లో 26 మంది మరణిస్తే.. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంటే.. సీజ్ ఫైర్ అని మధ్యలోకి వచ్చిన ట్రంప్.. ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు భారతీయ నెటిజన్లు!