ప్లీజ్.. సీఎం అపాయిట్మెంట్ ఇప్పించరూ.. బాబు కోసం ఎమ్మెల్యేల ఆరాటం..

ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా బిజీ అయిపోయారు. ఆయనను కలవాలంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర అధికారులకు అసలు సాధ్యం కావడం లేదు.;

Update: 2025-09-22 02:45 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా బిజీ అయిపోయారు. ఆయనను కలవాలంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర అధికారులకు అసలు సాధ్యం కావడం లేదు. సాధారణంగా ప్రజాప్రతినిధులు, అఖిల భారతస్థాయి అధికారులకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు... ఒక్కసారి ఇలా మారిపోయేరేంటి? అంటే బిజీ షెడ్యూలే కారణమని సమాధానం వినిపిస్తోంది. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా, చంద్రబాబు ఎమ్మెల్యేలను కలవలేకపోతున్నారని అంటున్నారు. వరుస కార్యక్రమాల వల్ల వచ్చే వారం ఆయన అసెంబ్లీకి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదని టాక్ వినిపిస్తోంది.

ఈ నెల 18 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. వరుసగా రెండు రోజుల పాటు కొనసాగిన సమావేశాలకు రెండు రోజుల విరామం వచ్చింది. సోమవారం నుంచి మళ్లీ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాలకు సీఎం హాజరు కావడం లేదని సమాచారం. అదేవిధంగా సోమవారం నుంచి వచ్చే ఆదివారం వరకు సీఎం చంద్రబాబును కలిసేందుకు ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. దీనికి కారణం ఈ వారం అంతా ఆయన షెడ్యూల్ బిజీగా ఉండటమే అని సమాచారం.

వచ్చేవారం రోజులు సీఎం అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. సీఎంను కలిసేందుకు ఎమ్మెల్యేలు సమయం అడుగుతున్నా, ఈ వారం సాధ్యం కాదని తేల్చిచెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం 22వ తేదీ సోమవారం నుంచి 29వ తేదీ వరకు చంద్రబాబు షెడ్యూల్ ఖాళీ లేకపోవడమే అంటున్నారు. ఈ నెల 22న సోమవారం విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ కారణంగా ఆయన సోమవారం జరిగే అసెంబ్లీకి కూడా హాజరుకావడం లేదని సమాచారం.

22, 23 తేదీల్లో చంద్రబాబు విశాఖలో ఉంటారని అంటున్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ లో వ్యాపార, వాణిజ్య వేత్తలను కలుసుకుని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే విధంగా పనిచేయాల్సివున్నందున సీఎం షెడ్యూల్ పూర్తిగా బిజీగా మారిపోయిందని అంటున్నారు. రెండు రోజుల సదస్సు తర్వాత 24న విశాఖ నుంచి రాజధాని అమరావతికి చంద్రబాబువస్తారని, ఆ రోజు సాయంత్రం తిరిగి శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు తిరుమల వెళతారని అధికారులు చెబుతున్నారు.

25న ఉదయం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం తిరుపతిలో పలు కార్యక్రమాల్లో సీఎం హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అదేవిధంగా 27న బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ఫెస్టివల్ కు ముఖ్య అతిధిగా చంద్రబాబు వెళ్లనున్నారు. పర్యాటకాభివృద్ధికి సంబంధించి రాష్ట్రప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇక 28న ఆదివారం సీఎం ఎవరినీ కలవరని అధికారులు చెబుతున్నారు. 29న విజయవాడలో ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల్లో సీఎం పాల్గొంటారని చెబుతున్నారు. ఆ రోజు కూడా సీఎం బిజీగా ఉన్నందున ఆయనను కలిసేందుకు ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెబుతున్నారు.

Tags:    

Similar News