రిపోర్టు: యూపీఐను అంతలా వాడేస్తున్న మహిళలు
ఖర్చు ఏదైనా కానీ.. స్మార్ట్ ఫోన్ ద్వారా ఇట్టే పేమెంట్ చేసే ఆప్షన్ ఇచ్చే యూపీఐ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది.;
ఖర్చు ఏదైనా కానీ.. స్మార్ట్ ఫోన్ ద్వారా ఇట్టే పేమెంట్ చేసే ఆప్షన్ ఇచ్చే యూపీఐ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. మహానగరాలు.. నగరాలు.. పట్టణాల్లో దీని వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి.. గ్రామాల్లో.. చిన్న పట్టణాల సంగతేంటి? అందునా.. ఈ ప్రాంతాల్లోని మహిళల పరిస్థితేంటి? వారి యూపీఐ వినియోగం మాటేంటి? బిల్లుల చెల్లింపుల తీరు ఎలా ఉంది? లాంటి అంశాలకు సంబంధించి తాజాగా ఒక రిపోర్టు ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది.
పేనియర్ బై ఉమెన్ ఫైనాన్షియల్ ఇండెక్స్ 2026 ప్రకారం పెట్టుబడులు.. ఆస్తులకు సంబంధించిన ఉత్పత్తులపై మహిళలకు అవగాహన పెరుగుతుందన్న విషయాన్ని ఈ రిపోర్టు వెల్లడించింది. ప్రజల్లో డిజిటల్ చెల్లింపులకు మారిన తీరును కళ్లకు కట్టినట్లుగా ఈ రిపోర్టు వెల్లడించింది. పెట్టబడులు.. ఆస్తులకు సంబంధించిన అంశాల్లో మహిళలకు పెరిగిన అవగాహన ఎంతన్న విషయాన్ని దీని ద్వారా మరింత బాగా తెలుస్తుంది. గ్రామీణ.. సెమీ అర్బన్ ప్రాంతాల్లోని దాదాపు 38 శాతం మహిళలు రోజువారీ నిత్యవసరాల కొనుగోళ్ల కోసం వారానికి కనీసం ఒక్కసారైనా యూపీఐ ను ఉపయోగిస్తున్నట్లుగా ఈ రిపోర్టు వెల్లడించింది.
మహిళల్లో పొదుపు చేసే తీరు పెరిగిన విషయంతో పాటు.. కుటుంబానికి ప్రాథమిక పొదుపుదారులుగా మహిళలు ఉన్న విషయం వెల్లడైంది. ఇదే విషయాన్ని సర్వేలో పాల్గొన్న మహిళల్లో 85 శాతం మంది వెల్లడించారు. ఈ సర్వేలో 10వేల మంది మహిళలతో చేపట్టారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ పదివేల మంది మహిళలు సాదాసీదా వారు కాదు. ఆర్థిక సేవలు అందించే మహిళా ఏజెంట్లుగా చెప్పాలి. వీరిపై నిర్వహించిన రిపోర్టు ఆధారంగా చూస్తే.. సుమారు 44 శాతం మంది మహిళలు తమ స్థానిక సేవా కేంద్రాల మద్దతుతో చిన్న మొత్తాల్లో సిప్ ద్వారా పసిడి ఆధారిత పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న విషయం వెల్లడైంది.
ఫిక్సెడ్ డిపాజిట్లు.. రికరింగ్ డిపాజిట్లు లాంటి సులువుగా నగదును ఉపసంహరించుకునే సౌకరయాల మీదనే చిన్న మొత్తాల డిపాజిట్ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తున్నట్లుగా పేర్కొన్నారు. 98 శాతం మంది మహిళలు వీటిలో పొదుపు చేయటానికి సిద్ధంగా ఉన్నట్లుగా వెల్లడైంది. మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో ఈ తీరు ఇంకా తక్కువగానే ఉన్నట్లుగా పేర్కొన్నారు. కేవలం పది శాతం మంది మహిళలకే దీనిపై అవగాహన ఉండటం గమనార్హం.