ర‌ష్యా, చైనా రంగంలోకి దిగితే.. మూడో ప్ర‌పంచ యుద్ధ‌మేనా ?

ర‌ష్యా ఇరాన్ కు కీల‌క భాగ‌స్వామి. రెండు దేశాల మ‌ధ్య కీల‌క ఒప్పందాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ర‌ష్యా య‌ద్ధంలోకి దిగుతుందా అంటే దిగ‌క‌పోవ‌చ్చ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.;

Update: 2026-03-06 10:30 GMT

అమెరికా- ఇరాన్ యుద్ధం ఆ రెండు దేశాల‌కే ప‌రిమితం కాలేదు. గ‌ల్ఫ్ దేశాల‌కు పాకింది. భ‌విష్య‌త్తులో మ‌రికొన్ని దేశాల‌కు పాకొచ్చు. అయితే దాని ప‌రిణామాలు ఎలా ఉంటాయి ?. ఇరాన్ అమెరికా మితృ దేశాల‌పై దాడులు చేస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్ క‌ల‌సి ఇరాన్ పై దాడి చేస్తున్నాయి. ఇరాన్ కు మ‌ద్ద‌తుగా ర‌ష్యా, చైనా రంగంలోకి దిగితే ఎలాంటి ప‌రిణామాలు ఉంటాయి ?. ఇంత‌కీ చైనా, ర‌ష్యాలు యుద్ధంలోకి దిగుతాయా ?.

చైనా, ర‌ష్యాల పాత్ర‌ :

ర‌ష్యా ఇరాన్ కు కీల‌క భాగ‌స్వామి. రెండు దేశాల మ‌ధ్య కీల‌క ఒప్పందాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ర‌ష్యా య‌ద్ధంలోకి దిగుతుందా అంటే దిగ‌క‌పోవ‌చ్చ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్ప‌టికే ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం ఎడ‌తెగ‌కుండా జ‌రుగుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ర‌ష్యా నేరుగా యుద్ధంలోకి దిగ‌క‌పోవ‌చ్చు. ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి అవకాశం ఎక్కువ‌గా ఉంది. అది ఎలా అంటే ..ఇరాన్ కు ఆయుధాలు, మిసైల్స్ ఇవ్వ‌డం, కీల‌క స‌మాచారాన్ని అందించ‌డం, సైబ‌ర్ యుద్దంలో స‌హాయం చేయ‌డం వంటి చ‌ర్య‌ల ద్వారా ఇరాన్ కు స‌హాయం చేయ‌వ‌చ్చు.

చైనా కూడా ర‌ష్యా వైఖ‌రినే అవ‌లంభించ‌డానికి అవ‌కాశం ఉంది. ఎందుకంటే దేశ‌ ప్ర‌జ‌లు, చైనా ప్ర‌యోజ‌నాలే చైనాకు మొద‌టి ప్రాధాన్య‌త‌. ఆ త‌ర్వాతే మిగిలిన‌వి. ఇరాన్ కీల‌క చ‌మురు భాగ‌స్వామి అయిన‌ప్ప‌టికీ యుద్ధంలో దిగే ప‌రిస్థితి ఉండ‌దు. ఇరాన్ కు చైనా ఆర్థిక స‌హాయం చేయ‌వ‌చ్చు. అంత‌ర్జాతీయంగా ప‌లు వేదిక‌ల‌పై మ‌ద్ద‌తు ఇవ్వొచ్చు. అదే స‌మ‌యంలో ఇరాన్ ఆయిల్ కొనుగోలు నిరాటంకంగా చేయ‌వ‌చ్చు. త‌ద్వారా ఇరాన్ కు మ‌ద్ద‌తు ఇవ్వొచ్చు. అంతే త‌ప్పా నేరుగా రంగంలోకి దిగే ప‌రిస్థితి ఉండ‌క‌పోవ‌చ్చు. ఆయిల్ కొనుగోలు ఇరాన్ యుద్ధం చేయ‌డానికి కీల‌కం. అందుకే చైనా ఆయిల్ కొనుగోలు చేసి ఇరాన్ యుద్ధానికి స‌హ‌క‌రించ‌వ‌చ్చు.

ర‌ష్యా, చైనాలు యుద్ధంలోకి దిగితే ?

ర‌ష్యా, చైనాలు ఇరాన్ కు మ‌ద్ద‌తుగా యుద్ధంలోకి దిగితే యుద్ధం ప్రమాద స్థాయికి చేరుతుంది. ఎంద‌కంటే చైనా, ర‌ష్యా అన్ని రంగాల్లోనూ బ‌ల‌మైన శ‌క్తులు. బ‌ల‌మైన శ‌క్తులు యుద్ధంలోకి దిగితే యుద్ధ తీవ్ర‌త పెరుగుతుంది. ముఖ్యంగా అణ్వాయుధాలు ప్ర‌యోగించే ప్ర‌మాదం ఉంటుంది. మూడో ప్ర‌పంచ యుద్ధం అనివార్యం అవుతుంది. చ‌మురు ధ‌రలు ఆకాశాన్ని అంటుతాయి. ధ‌ర‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా తాండవం చేస్తాయి. ఆర్థిక వ్య‌వ‌స్థలు అత‌లాకుత‌లం అవుతాయి. ప్ర‌జ‌లు భారీగా న‌ష్ట‌పోతారు. ప్ర‌పంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్ప‌కూలుతాయి. మిగిలిన దేశాల మ‌ధ్య యుద్ధం ఒక ఎత్తు అయితే.. గ‌ల్ఫ్ దేశాల్లో యుద్ధం ఇంకొక ఎత్తు. ఎందుకంటే శ‌రీరానికి ర‌క్తం ఎలా అవ‌స‌ర‌మో.. ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు చ‌మురు అంత అవ‌సరం. చ‌మురు లేక‌పోతే ఆర్థిక వ్య‌వ‌స్థ స్తంభించిపోతుంది. అందుకే మిగిలిన దేశాలు కూడా ఈ యుద్ధం గురించి ఆలోచించాల్సి వ‌స్తోంది.

Tags:    

Similar News