సీజేపీకి పోటీగా జెన్ నెక్ట్స్ నిరసనలు.. ఏంటీ కథ.. ముంబైలో ఏం జరిగింది?

ఎన్నికల సంఘంపై విమర్శల వేడి... రాజ్యాంగ పరిరక్షణ పేరుతో కౌంటర్ దాడి.. దేశ ఆర్థిక రాజధాని ముంబై వీధుల్లో 'సీజేపీ' వర్సెస్ 'జెన్ నెక్ట్స్' రచ్చరచ్చగా మారింది.

Update: 2026-10-02 16:08 GMT

ఎన్నికల సంఘంపై విమర్శల వేడి... రాజ్యాంగ పరిరక్షణ పేరుతో కౌంటర్ దాడి.. దేశ ఆర్థిక రాజధాని ముంబై వీధుల్లో 'సీజేపీ' వర్సెస్ 'జెన్ నెక్ట్స్' రచ్చరచ్చగా మారింది. ప్రజాస్వామ్య వేదికగా మొదలైన ఈ పోటాపోటీ సమరం ఇప్పుడు రోడ్ల నుంచి సోషల్ మీడియా వరకు తీవ్ర దుమారమే రేపుతోంది.

భారత ఆర్థిక రాజధాని ముంబై మహానగరం శుక్రవారం ఒక చారిత్రక ఘట్టానికి.. భావప్రకటన స్వేచ్ఛా స్ఫూర్తికి వేదికగా మారింది. రాజకీయ విమర్శలు, నిరసనలు ప్రజాస్వామ్యంలో సహజమే అయినా.. ముంబై వీధుల్లో చోటుచేసుకున్న పోటాపోటీ ఆందోళనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల వ్యవస్థ పారదర్శకతపై ప్రశ్నలు గుప్పిస్తూ ఒక వర్గం నిరసన బాట పట్టగా.. రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణే ధ్యేయంగా మరో బృందం రంగంలోకి దిగడంతో ముంబైలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

ఎన్నికల వ్యవస్థపై ‘సీజేపీ’ సమరశంఖం

గాంధీ జయంతి స్పూర్తితో దేశంలో ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణలలో సంపూర్ణ పారదర్శకత, జవాబుదారీతనం సాధించాలనే లక్ష్యంతో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నాయకత్వంలో దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి ముంబైలోని చారిత్రాత్మక శివాజీ పార్క్ వరకు సీజేపీ శ్రేణులు నిరసన హోరెత్తించాయి. ఎన్నికల వ్యవస్థ పవిత్రతను కాపాడటానికి ఓటర్ల హక్కుల పరిరక్షణకు ప్రతి పౌరుడూ మద్దతుగా నిలవాలని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ పిలుపునిచ్చారు.

అంబేద్కర్ విగ్రహం వద్ద ‘జెన్ నెక్ట్స్ ముంబై’ కౌంటర్ నిరసన

మరోవైపు సీజేపీ వైఖరిని నాయకుల వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ ‘జెన్ నెక్ట్స్ ముంబై’ బృందం ప్రతిఘటనకు దిగింది. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలను గౌరవించడమే పౌరుల ప్రథమ కర్తవ్యమని చాటుతూ వారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అత్యంత శాంతియుతంగా కౌంటర్ నిరసన నిర్వహించారు. "రాజ్యాంగ వ్యవస్థల ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు చేయడం సరికాదు. రాజ్యాంగాన్ని ఎలా పూజించాలో, ప్రజాస్వామ్య విలువులను ఎలా కాపాడుకోవాలో యువతకు తెలుసు" అని జెన్ నెక్ట్స్ ప్రతినిధులు స్పష్టం చేశారు. బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడుస్తూ రాజ్యాంగ పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని వారు చాటి చెప్పారు.

డిజిటల్ వేదికపై మాటల యుద్ధం.. పోలీసుల అప్రమత్తత

ఈ భావజాల పోరాటం కేవలం వీధులకే పరిమితం కాలేదు. సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాల మద్దతుదారులు పరస్పర విమర్శలతో నెట్ ఇంట్లో హోరాహోరీగా తలపడ్డారు. జెన్ నెక్ట్స్ ఆందోళనల వెనుక రాజకీయ ప్రేరణ ఉందంటూ సీజేపీ ఆరోపించగా.. పద్ధతి లేని విమర్శలు తగవంటూ జెన్ నెక్ట్స్ మద్దతుదారులు తిప్పికొట్టారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముంబై పోలీసులు అత్యంత చాకచక్యంతో అదనపు బలగాలను మోహరించి శాంతిభద్రతలను పర్యవేక్షించారు.

ప్రజాస్వామ్య వైవిధ్యానికి నిదర్శనం

ప్రశ్నించే హక్కు.. వ్యవస్థలను రక్షించుకునే బాధ్యత.. ఈ రెండూ ప్రజాస్వామ్యానికి రెండు కళ్ళు. ఒకవైపు హక్కుల కోసం ప్రశ్నించే గొంతుకలు.. మరొకవైపు వ్యవస్థల నిలకడ కోసం నిలిచే సంకల్పం ముంబైలో ప్రతిబింబించాయి. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరిగినా.. ప్రజాస్వామ్య చట్రంలో శాంతియుత నిరసనలు తెలపడమే భారతీయ పౌరుల నైతిక శక్తే కాక.. రాజ్యాంగ బలానికి సజీవ నిదర్శనంగా నిలుస్తుంది.

Tags:    

Similar News