చైనా సీక్రెట్స్ తెలుసుకుంటోన్న అమెరికా

ముఖ్యంగా చైనా అధికారుల నుంచి కీలక రహస్యాలను సేకరించడమే ఈ వీడియోల లక్ష్యమని సీఐఏ డైరెక్టర్‌ జాన్‌ రాట్‌క్లిఫ్‌ పేర్కొన్నారు.;

Update: 2025-05-03 15:30 GMT

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పాలనలో అణచివేతకు గురవుతున్న అక్కడి ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని అమెరికా నిఘా సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (CIA) సంచలన చర్య చేపట్టింది. 'రండి.. మాతో కలిసి పనిచేయండి' అంటూ మాండరిన్‌ భాషలో రూపొందించిన రిక్రూట్‌మెంట్‌ వీడియోలను విడుదల చేసింది.

సైనిక, వ్యూహాత్మక పరంగా చైనాను తమ ప్రధాన విరోధిగా భావిస్తున్న అమెరికా, బీజింగ్‌ నుంచి ఎదురవుతున్న గూఢచర్య ముప్పును తిప్పికొట్టడంతో పాటు, ఆ దేశంపై మరింత నిఘా పెట్టేందుకు ఈ నియామక ప్రక్రియను చేపట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చైనా అధికారుల నుంచి కీలక రహస్యాలను సేకరించడమే ఈ వీడియోల లక్ష్యమని సీఐఏ డైరెక్టర్‌ జాన్‌ రాట్‌క్లిఫ్‌ పేర్కొన్నారు.

ఆయన మాట్లాడుతూ.. "నిఘా వ్యవస్థలో మానవ వనరులను పెంచుకోవడంతో పాటు చైనాపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా, సైనికపరంగా, సాంకేతికంగా ప్రపంచంపై పెత్తనం చెలాయించాలని చైనా ప్రయత్నిస్తోంది. ఆ దేశం నుంచి మాకు గూఢచర్యం ముప్పు ఉంది. దాన్ని ఎదుర్కోవడానికే ఈ వీడియోలు విడుదల చేశాం. చైనా అధికారుల నుంచి రహస్యాలు సేకరించడమే వీటి ప్రధాన ఉద్దేశ్యం" అని స్పష్టం చేశారు.

రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ వీడియోలను సీఐఏ తన యూట్యూబ్‌, 'ఎక్స్‌' ఖాతాల్లో విడుదల చేసింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఇవి 50 లక్షలకు పైగా వ్యూస్‌ సాధించి నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ వీడియోల్లో.. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో ఒక నిజాయతీపరుడైన కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఎదుర్కొనే అంతర్గత ఒత్తిళ్లను, సంఘర్షణను సినిమాటిక్‌గా చిత్రీకరించారు. అధికార ఒత్తిళ్లకు లొంగలేక, భయంతో బతకలేక సతమతమవుతున్న ఆ నాయకుడు చివరికి సీఐఏను ఆశ్రయించే దృశ్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. 'నా జీవితాన్ని, నా భవిష్యత్తును నా కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే సీఐఏలో చేరాలి' అనే బలమైన సందేశంతో ఈ వీడియోలను ముగించారు.

చైనా అధికారులకు నేరుగా చేరువయ్యేలా మాండరిన్‌ భాషలో వీటిని రూపొందించడం గమనార్హం. అయితే, ఈ వీడియోలపై చైనా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందనా రాలేదు.

Tags:    

Similar News