చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. పిఠాపురంలో ప్రచారంపై క్లారిటీ!

శనివారం సాయంత్రం తర్వాత మైకులు మూగపోబోతున్నాయి.. ప్రచార రథాలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి.

Update: 2024-05-10 11:52 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. అంతకంటే ముందు ప్రచారానికి ఇంక శనివారం ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. దీంతో ఆయా పార్టీల అధినేతలు, అభ్యర్థులు ప్రచారాలను హోరెత్తించేస్తున్నారు. ఒకపక్క జగన్, మరోపక్క కూటమి నేతలు ప్రతీ నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ సమయలో చిరంజీవి స్పందించారు.

అవును... ఏపీలో ఎన్నికల ప్రచారం చివరికి వచ్చేసింది. శనివారం సాయంత్రం తర్వాత మైకులు మూగపోబోతున్నాయి.. ప్రచార రథాలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. ఈ క్రమంలో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ప్రచారంలో పాల్గొంటారనే ప్రచారం గత కొన్ని రోజులుగా బలంగా జరుగుతుంది. తాజాగా ఈ విషయంపై చిరు వివరణ ఇచ్చారు.

గురువారం రాష్ట్రపతి భవన్ లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో.. రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్ బయలుదేరారు చిరంజీవి. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని చిరంజీవి స్పష్టం చేశారు. ఇదే సమయంలో... పిఠాపురంలో ప్రచారంపై స్పందిస్తూ.. రేపు పిఠాపురం వెళ్లడం లేదని.. తనను ప్రచారానికి రమ్మని పవన్ కూడా తనను పిలవలేదని.. తాను పిఠాపురం ప్రచారానికి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని.. చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.

ఇదే క్రమంలో... ఎన్టీఆర్ భారతరత్నకు అర్హుడని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ దిశగా ఆలోచించాలని చిరంజీవి కోరారు. ఇదే సమయంలో... మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అని మీడియా ప్రశ్నించగా చిరునవ్వులు చిందిస్తూ చిరు అక్కడ నుంచి వెళ్లిపోవడం గమనార్హం!

Tags:    

Similar News