జై చిరంజీవ...పవన్ పార్టీకి మెగా విరాళం...!

తమ్ముడు పార్టీ జనసేనకు మెగా స్టార్ భారీ విరాళాన్ని ప్రకటించి పవన్ కి కావాల్సినంత బూస్ట్ ఇచ్చారు.

Update: 2024-04-08 13:40 GMT

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరం అని అందరికీ తెలుసు. అయితే ఆయన సడెన్ గా ఒక పొలిటికల్ పార్టీకి విరాళం ఇచ్చారు ఇది నిజంగా రాజకీయ సంచలనమే. తమ్ముడు పార్టీ జనసేనకు మెగా స్టార్ భారీ విరాళాన్ని ప్రకటించి పవన్ కి కావాల్సినంత బూస్ట్ ఇచ్చారు.


ఏపీలో జనసేన 21 అసెంబ్లీ రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తోంది. ఆ పార్టీకి ఎన్నికల విరాళాలు ఇంతవరకూ ఎన్ని అందాయో ఎవరు ఇచ్చారో తెలియదు. పవన్ మాత్రం స్వయంగా తన పార్టీకి తానే పది కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తూ జనసేన జెండాను ఎగరేయడానికి సిద్ధం అయ్యారు.


ఆయన పార్టీకి ఫండ్ ఇచ్చిన తరువాత ఆయన అన్నయ్య, మెగా బ్రదర్ చిరంజీవి అయిదు కోట్ల విరాళాన్ని ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా పవన్ చేతికి ఆ చెక్ ని చిరంజీవి స్వయంగా అందచేశారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకుండానే ప్రజల మేలు కోసం తన సొంత సొమ్ముని ఖర్చు చేస్తున్నారు మెగాస్టార్ ప్రశంసించారు. అంతే కాదు రైతులకు సాయంగా పవన్ తన పారితోషికాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. పవన్ పార్టీకి తన అండ దండ ఉండేలా మెగాస్టార్ ఆశీర్వాదాలు అందచేశారు.

Read more!

జనసేన పెట్టి పదేళ్లు అయింది. మెగాస్టార్ ఎపుడూ ఆయన పార్టీకి బాహాటంగా మద్దతు ఇవ్వలేదు. తమ్ముడు తాను ఎంచుకున్న రంగంలో రాణించాలని మాత్రం కోరుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి 2024 ఎన్నికలు అత్యంత కీలకంగా ఉన్నాయి. దాంతో మెగా కుటుంబం అంతా ఆయనకు అండగా నిలవాలని నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు.

మెగాస్టార్ అయిదు కోట్ల విరాళం ప్రకటించినట్లుగానే చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కూడా త్వరలోనే జనసేన పార్టీకి భూరి విరాళాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. రానున్న రోజులలో మెగా కుటుంబం పూర్తి స్థాయిలో జనసేనాని తమ మద్దతు ఇస్తుందని అంటున్నారు.

మరో వైపు చూస్తే హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో షూటింగ్ జరుపుకొంటున్న విశ్వంభర షూటింగ్ లొకేషన్ కి పవన్ ఆయనతో పాటు నాగబాబు సోమవారం వెళ్లారు. అక్కడ చిరంజీవి తమ్ముడికి ఆహ్వానం పలికి నిండుగా ఆశీర్వదించారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఈసారి ఎన్నికలు జనసేనకు అత్యంత కీలకం అన్నది తెలిసిందే. దాంతో పవన్ ని మెగా ఫ్యామిలీ అంతా ఫుల్ సపోర్ట్ చేస్తే ఆయన పార్టీకి అది నైతికంగా ఇతరత్రా కూడా కలసివస్తుందని అంటున్నారు. ఇక అన్నయ్య మెగాస్టార్ అయిదు కోట్ల విరాళం అందచేసిన అనంతరం పవన్ చిరంజీవికి పాదాభివందనం చేశారు. అదే విధంగా షూటింగ్ స్పాట్ లోనే కొణిదెల బ్రదర్స్ ముగ్గురూ కాసేపు మాట్లాడుకున్నారు.

మొత్తానికి చూస్తే జనసేనకు ఇపుడు చిరంజీవి బాహాటంగా మద్దతు ఇవ్వడంతో అంతా జై చిరంజీవ అంటున్నారు. జనసేనకు ఈసారి ఇది మంచి బూస్టింగ్ గా మారి ఆ పార్టీ దశ దిశను మారుస్తుందని అంతా అంటున్నారు.

Tags:    

Similar News