కాంగ్రెస్ పెద్దాయన చిన్న కోరిక.. నెరవేరే అవకాశం ఉందా?
పాలమూరు పాలిటిక్స్‌లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారు మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి.. గత ఎన్నికల సమయంలో పోటీకి చాన్స్ రాకపోవడంతో ప్రస్తుతం తన ఉనికి కోసం పాట్లు పడాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.;
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే ప్లాన్ చేస్తున్నారట కాంగ్రెస్ సీనియర్ లీడర్ చిన్నారెడ్డి. పార్టీ పవర్‌లో ఉండగానే వారసుడిని పొలిటికల్‌గా సెట్ చేయాలనే ఆలోచనతో ఆయన పావులు కదుపుతుండగా, పరిస్థితులు కలిసిరావడం లేదని అంటున్నారు. గత ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన తనకు ఆ మాత్రం ఫేవర్ చేయలేరా? అంటూ ఆయన పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతున్నా, పని జరగడం లేదని చెబుతున్నారు. పార్టీలో సీనియర్ అయిన తనకు ఈ పరిస్థితి కల్పించడం అసలు బాగోలేదంటూ ఆయన చిన్నబుచ్చుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ తన కుమారుడికి ఏదో ఒక పదవి ఇప్పించుకోవాలనే ప్రయత్నాలను మాత్రం ఆయన అపడం లేదని అంటున్నారు.
పాపం చిన్నారెడ్డి
పాలమూరు పాలిటిక్స్‌లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారు మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి.. గత ఎన్నికల సమయంలో పోటీకి చాన్స్ రాకపోవడంతో ప్రస్తుతం తన ఉనికి కోసం పాట్లు పడాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. విద్యార్థి దశ నుంచే NSUI రాజకీయాల్లోకి ప్రవేశించిన చిన్నారెడ్డి.. ఇప్పటికీ పార్టీనే నమ్ముకున్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటూనే 1985లోనే కాంగ్రెస్ టికెట్ దక్కించుకొని వనపర్తి నుంచి పోటీ చేశారు. తొలి ప్రయత్నంలో ఓటమి తర్వాత..రెండోసారి గెలుపొందారు. ఆ తర్వాత వనపర్తి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చిన్నారెడ్డి ఇప్పుడు ఒంటరి అయిపోయారట. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కన్వీనర్‌గా పనిచేసిన చిన్నారెడ్డి..ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా తన కోసం ఏం చేసుకోలేకపోతున్నారని కార్యకర్తలు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్నా చివరి నిమిషంలో ఆయన త్యాగం చేయాల్సివచ్చిందని అంతా గుర్తు చేస్తున్నారు. అయితే గతం గత ః అంటూ.. తన వారసుడి రాజకీయ అరంగేట్రం కోసం చిన్నారెడ్డి పడరాని పాట్లు పడుతున్నారని చెబుతున్నారు.
కొడుకు పదవి కోసం ప్రయత్నాలు
వయోభారంతో చిన్నారెడ్డి తన కుమారుడు ఆదిత్య పొలిటికల్ ఎంట్రీ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో తన కొడుకుకు మంచి పోస్ట్ ఇప్పించుకోవాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదని అంటున్నారు. తనను క్రమశిక్షణ కమిటీ నుంచి పక్కకు తప్పించి.. ఏ పోస్ట్ ఇవ్వకపోయినా సైలెంట్‌గా ఉండిపోయారు. ఏఐసీసీ సెక్రటరీగా పలు రాష్ట్రాలకు ఇంచార్జ్‌గా పనిచేసిన చిన్నారెడ్డికి ప్రస్తుతం పార్టీపరంగా ఎలాంటి పదవిలేదు. అయినా సరే తన కుమారుడు ఆదిత్యకైనా అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలను కోరారట. కానీ ఇటీవలి పార్టీ ప్రకటించిన జనరల్ సెక్రటరీలలో తన కొడుకుకు అవకాశం దక్కకపోవడంతో అసంతృప్తిలో ఉన్నారని అంటున్నారు. తన తనయుడికి పదవి దక్కకపోవడం ఒక ఎత్తు అయితే.. పాలమూరులో నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పోస్టుతోపాటు ఆయన కొడుకు మిథున్ రెడ్డికి జనరల్ సెక్రటరీగా అవకాశం కల్పించడంపై చిన్నారెడ్డి నొచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిన్నకాక మొన్న వచ్చిన వ్యక్తికి ఇస్తున్న ప్రాధాన్యత..పార్టీలో మొదటి నుంచి ఉన్న తనకు దక్కడం లేదని వాపోతున్నారట.
రాజీనామా ఆలోచనలో పెద్దాయన
పార్టీ పెద్దలు తన పట్ల చిన్నచూపు చూస్తుండటంతో చిన్నారెడ్డి గేరు మార్చాలని ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. తనకు ఇచ్చిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానంటూ పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలకు సంకేతాలు పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా గన్‌మెన్‌లను.. ప్రభుత్వ ఇచ్చిన వాహనాన్ని తిప్పి పంపడం వంటివి చేస్తున్నారని అంటున్నారు. దీంతో పార్టీ పెద్దలు స్పందించి తన కుమారుడికి దారి చూపుతారనే ఆలోచన చేస్తున్నారట. తన కుమారుడి కోసం చిన్నారెడ్డి వాడుతున్న ఆఖరి అస్త్రం సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాల్సివుంది.