బంగ్లాదేశ్ అమ్మాయిలతో ఎఫైర్లు, పెళ్లిళ్లు వద్దు
చైనాలో గత కొన్నేళ్లుగా వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. దీనికి ప్రధాన కారణాలు చూస్తే.. ఉద్యోగ అవకాశాలు తగ్గడం, ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాతే కుటుంబం ఏర్పాటు చేసుకోవాలనే యువత ఆలోచన.;
వివాహ మోసాలు (మ్యారేజ్ స్కామ్స్) విషయంలో తమ పౌరులకు చైనా ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో అక్రమ వివాహాలకు పాల్పడొద్దని, ఆ దేశ యువతులతో పెళ్లిళ్లు చేసుకొనేముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని బంగ్లాదేశ్‌లోని చైనా రాయబార కార్యాలయం తమ పౌరులను అడ్వైజరీ ద్వారా కోరింది. చైనాలో యువతుల కొరత, పెళ్లిళ్ల సంఖ్య తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అక్రమ మార్గాల్లో వివాహాలు చేసుకొంటున్నట్లు గుర్తించిన తర్వాత ఈ కీలక చర్యలు చేపట్టింది.
- మ్యారేజ్ స్కామ్స్‌కు కారణాలు:
చైనాలో గత కొన్నేళ్లుగా వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. దీనికి ప్రధాన కారణాలు చూస్తే.. ఉద్యోగ అవకాశాలు తగ్గడం, ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాతే కుటుంబం ఏర్పాటు చేసుకోవాలనే యువత ఆలోచన. దేశంలో యువతుల సంఖ్య తగ్గుతుండటం. దాదాపు మూడు కోట్లమంది యువకులకు జీవిత భాగస్వాములు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో కొంతమంది అక్రమ మార్గాలను ఆశ్రయిస్తున్నారు.
- చైనా ఎంబసీ హెచ్చరికలు:
మోసపూరిత క్రాస్ బోర్డర్ డేటింగ్ వీడియోలు, సమాచారం, అనధికారిక మ్యాట్రిమోనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని బంగ్లాదేశ్‌లోని చైనా రాయబార కార్యాలయం తమ పౌరులను హెచ్చరించింది. అక్రమ వివాహాల ద్వారా బంగ్లా యువతులను చైనాకు అక్రమంగా రవాణా చేస్తున్నారని ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి. చట్ట విరుద్ధంగా జరిగే ఈ పెళ్లిళ్లు భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులకు దారితీస్తాయని ఎంబసీ తన అడ్వైజరీలో స్పష్టం చేసింది. సరిహద్దు ఆవల లైంగిక సంబంధాలు, వివాహాల బాధితులు వెంటనే పబ్లిక్ సెక్యూరిటీ అథారిటీకి ఫిర్యాదు చేయాలని సూచించింది.
- మానవ అక్రమ రవాణాపై చట్టపరమైన చర్యలు:
ఈ తరహా పెళ్లిళ్లు చేసుకుంటే మానవ అక్రమ రవాణా కింద చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చైనా పౌరులను హెచ్చరించింది. బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం, మానవ అక్రమ రవాణాకు పాల్పడి దోషిగా తేలితే కనీసం ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. కేసు తీవ్రతను బట్టి యావజ్జీవ కారాగారం లేదా మరణశిక్ష కూడా విధించవచ్చు.
- గతంలోనూ ఇలాంటి ఘటనలు:
కొన్ని క్రిమినల్ నెట్‌వర్క్‌లు గతంలో బంగ్లాదేశ్ యువతులను భారత్‌కు కూడా అక్రమంగా రవాణా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలతో కొన్నేళ్ల కిందట ఢాకాలో 11 మందిని అరెస్టు చేశారు. యువతుల అక్రమ రవాణాకు టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫామ్‌లను వినియోగించారని అప్పట్లో మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో, చైనా ప్రభుత్వం తమ పౌరులు అక్రమ వివాహాలకు పాల్పడకుండా, భవిష్యత్తులో ఎదురయ్యే చట్టపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవాలని ఈ అడ్వైజరీ ద్వారా సూచించింది.