ఆ మూడు దేశాధినేతల కలయిక.. ట్రంప్ లో ఆందోళన
బీజింగ్‌లో జరిగిన చైనా విజయోత్సవాలు కేవలం ఆయుధ శక్తి ప్రదర్శనగా కాకుండా, అంతర్జాతీయ రాజకీయ సమీకరణాల్లో కొత్త సందేశాలను అందించాయి.;
బీజింగ్‌లో జరిగిన చైనా విజయోత్సవాలు కేవలం ఆయుధ శక్తి ప్రదర్శనగా కాకుండా, అంతర్జాతీయ రాజకీయ సమీకరణాల్లో కొత్త సందేశాలను అందించాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 80 ఏళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఒకే వేదికపై కూర్చోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం స్నేహపూర్వక సమాగమం కాదని, అమెరికాకు వ్యతిరేకంగా కొత్త వ్యూహాత్మక సమీకరణకు ఇది సంకేతమని పాశ్చాత్య విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రపంచానికి చైనా సంకేతం
చైనాకు ఈ పరేడ్ ఒక ప్రతిష్ఠాత్మక వేదిక. ఆధునిక యుద్ధ ట్యాంకులు, సబ్‌మరైన్లు, ఫైటర్ జెట్స్, సైనిక దళాల కవాతులతో తన రక్షణ శక్తిని ప్రపంచానికి చూపించింది. ఇది కేవలం జ్ఞాపకోత్సవం కాదని, భవిష్యత్తులో తన ఆధిపత్యం ఏ దిశగా వెళ్లబోతుందో ప్రపంచానికి సంకేతం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రం చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా ఈ శక్తి ప్రదర్శన ప్రాధాన్యతను సంతరించుకున్నది.
ట్రంప్ లో అసహనం
ప్రపంచంలోని ముగ్గురు శక్తివంతమైన నేతలు ఒకే వేదికను పంచుకోవడంతో ట్రంప్ లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నది. తన ట్రూత్ సోషల్‌లో జిన్‌పింగ్‌ను ఉద్దేశిస్తూ, రష్యా, ఉత్తర కొరియాలతో కలిసి అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా, చైనాలోని ఈ వేడుకల్లో అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో పోషించిన కీలక పాత్రను తగ్గించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
చైనా-అమెరికా బంధానికి బీటలు..?
ఈ పరిణామం అమెరికా–చైనా సంబంధాల్లో మరింత ఉద్రిక్తతను పెంచే అవకాశాలు లేకపోలేదు. చైనా, రష్యా, ఉత్తర కొరియాల మధ్య అనుబంధం మరింత గాఢమైతే, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని శక్తి సమీకరణలు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది.
మరోవైపు, భారత్ సహా ఇతర దేశాలు ఈ సమీకరణలను నిశితంగా గమనిస్తున్నాయి. ఈ సందర్భంలో బీజింగ్‌లో నిర్వహించిన పరేడ్ కేవలం సైనిక శక్తి ప్రదర్శనగా మాత్రమే కాకుండా, రాబోయే అంతర్జాతీయ రాజకీయ పరిణామాలకు మార్గదర్శకంగా నిలవబోతున్నట్లు స్పష్టమవుతున్నది.