అమెరికాను లక్ష్యంగా చేసుకున్న చైనా.. భారీ అణు లాంచ్ ప్యాడ్ల నిర్మాణం!
అంతర్జాతీయ రక్షణ నిపుణులు సేకరించిన సరికొత్త శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఈ సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రపంచ భద్రతా సమీకరణాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాతో పెరుగుతున్న వ్యూహాత్మక పోటీ నేపథ్యంలో చైనా తన అణు సామర్థ్యాలను ఊహించని స్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. చైనాలోని పశ్చిమ ప్రాంతమైన జిన్‌జియాంగ్‌లో అత్యంత రహస్యంగా భారీ మిలిటరీ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ఒక కథనంలో వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఇది ప్రపంచ సూపర్ పవర్ల మధ్య శీతల సమరానికి మరింత నెరదబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శాటిలైట్ చిత్రాల ద్వారా వెలుగులోకి..
అంతర్జాతీయ రక్షణ నిపుణులు సేకరించిన సరికొత్త శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఈ సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మితమవుతున్న ఈ అత్యాధునిక కాంప్లెక్స్‌లో దాదాపు 80కి పైగా అణు క్షిపణుల లాంచ్ ప్యాడ్లు, భూగర్భ బంకర్లు, శత్రువుల కంటికి చిక్కని అత్యున్నత కమ్యూనికేషన్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. యుద్ధ పరిస్థితుల్లో అమెరికా ఒకవేళ ముందస్తు దాడి చేసినా.. చైనా అణు శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేయడం అసాధ్యమయ్యేలా ఈ సరికొత్త వ్యవస్థను బీజింగ్ రూపకల్పన చేస్తోంది.
‘సెకండ్ స్ట్రైక్ కెపాబిలిటీ’ పెంచుకోవడమే వ్యూహం!
ఈ భారీ ప్రాజెక్టు వెనుక చైనా ప్రధాన లక్ష్యం “సెకండ్ స్ట్రైక్ కెపాబిలిటీ” ని గరిష్టంగా పెంచుకోవడమేనని రక్షణ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శత్రుదేశం మొదటి దాడిలో అణు బాంబులు వేసి దేశాన్ని అతలాకుతలం చేసినా.. ఆ దాడిని తట్టుకుని సురక్షితంగా మిగిలే భూగర్భ క్షిపణుల ద్వారా శత్రువుపై తక్షణమే అత్యంత భీకరమైన ప్రతిదాడి చేసే సామర్థ్యం... ఇందుకోసం చైనా కొండలను తొలుస్తూ భూగర్భ సదుపాయాలు, అత్యంత రక్షిత లాంచ్ కేంద్రాలు, గాల్లోంచి సైతం నియంత్రించగల అత్యవసర కమాండ్ వ్యవస్థలను శరవేగంగా అభివృద్ధి చేస్తోంది.
అమెరికా ప్రధాన నగరాలే టార్గెట్
ప్రస్తుతం చైనా సైన్యం వద్ద అమెరికాలోని దాదాపు అన్ని ప్రధాన నగరాలను నేరుగా తాకగల అంతర్‌ఖండ అణు క్షిపణులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు జిన్‌జియాంగ్ వేదికగా నిర్మితమవుతున్న ఈ కొత్త లాంచ్ ప్యాడ్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. చైనా అణు నిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. ఇది అమెరికా రక్షణ వ్యూహాలకు గట్టి సవాలుగా మారనుంది.
ఇండో-పసిఫిక్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు
ఇప్పటికే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, చైనా మధ్య వ్యూహాత్మక పోటీ తీవ్ర స్థాయికి చేరింది. తైవాన్ స్వతంత్రత అంశం.. దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్య వివాదాలు.. రెండు దేశాల పోటాపోటీ సైనిక విన్యాసాలు.. ఇలాంటి పరిణామాలు ప్రపంచాన్ని మునుపెన్నడూ లేని విధంగా అశాంతి వైపు నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా చేపడుతున్న ఈ భారీ అణు మౌలిక సదుపాయాల నిర్మాణం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.
చైనా తాజా చర్యలతో ప్రపంచ వ్యాప్తంగా అణు ఆయుధాల పోటీ మరోసారి వేడెక్కే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి చైనా వేస్తున్న ఈ వ్యూహాత్మక అడుగులకు చెక్ పెట్టేందుకు అమెరికా మరియు దాని కూటమి దేశాలు ఎలాంటి ప్రతీకార వ్యూహాలను రచిస్తాయో చూడాలి.