రూ. 334 కోట్ల అవినీతి బట్ట బయలు.. ఆ మంత్రికి మరణశిక్ష..
చైనా ఆర్థికంగా ప్రగతి సాధించడమే కాదు.. స్కాంలలో కూడా ప్రగతి సాధించినట్లు కనిపిస్తోంది.;
చైనా ఆర్థికంగా ప్రగతి సాధించడమే కాదు.. స్కాంలలో కూడా ప్రగతి సాధించినట్లు కనిపిస్తోంది. ఇటీవల ఒక మాజీ కేంద్ర మంత్రికి ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్ష వేస్తూ తీర్పు చెప్పింది. ఇది యాతవ్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చైనా అనగానే మనకు ప్రధానంగా వినిపించేది ఎగుమతులు. ఏ దేశంలోనైనా సరే ఆ దేశానికి సంబంధించి కొన్ని విడిభాగాల్లో చైనా భాగాలు వాడాల్సిందే. అవి చాలా చీప్ కాబట్టి ఎక్కువగా కొనుగోలు జరుగుంది. (వాటి పనితనం కూడా చీపే).
వరల్డ్ హెడ్ లైన్స్ లోకి చైనా మంత్రి తీరు..
చైనా ప్రభుత్వ అవినీతి ఇటీవల వరల్డ్ హెడ్ లైన్స్ లోకి ఎక్కింది. జిలిన్ ప్రావిన్స్‌లో వ్యవసాయ, గ్రామీణ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి టాంగ్ రెన్‌జియాన్ 2007–24 మధ్యకాలంలో అధికారం దుర్వినియోగం చేసి రూ. 334 కోట్ల (268 మిలియన్ యువాన్లు) లంచాలు తీసుకున్న కేసులో మరణశిక్ష పడింది. ఆయన వ్యక్తిగత ఆస్తులను జప్తు చేసి, లంచం మొత్తం దేశ ఖజానాకు తరలించాలని కోర్టు ఆదేశించింది. ఆయనపై జీవితకాల రాజకీయ కార్యకలాపాల నిషేధం కూడా విధించారు.
ఆ స్థాయిలో దుర్వినియోగం..
ఈ ఘటనలో చైనా ప్రజలు అత్యంత బాధపడే విషయం ఏంటేంటే.. చైనాలో అధికార దుర్వినియోగం, అవినీతి అత్యల్ప స్థాయి నుంచి అత్యంత పెద్ద స్థాయి వరకు వ్యాపించడం. ఏదో కింద స్థాయి అధికారి లంచం తీసుకున్నాడంటే పెద్దగా బాధించదు. కానీ ఒక దేశ మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి లంచాలతో ఇంత పెద్ద మొత్తం ఆర్జించడంపై ఆ దేశ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాంగ్ రెన్‌జియాన్ వంటి మాజీ మంత్రికి మరణశిక్ష విధించడం.. అధికారంలో ఉన్నవారికి స్పష్టమైన సంకేతాన్నిస్తుంది.
సంచలనంగా మారిన కోర్టు తీర్పు..
కోర్టు తీర్పు సారాంశం ప్రకారం.. టాంగ్ రెన్‌జియాన్ వ్యాపారాలు, కాంట్రాక్టులు, ఉద్యోగ నియామకాలు వంటి వివిధ రంగాల్లో అధికారాన్ని దుర్వినియోగం చేసి లంచాలు తీసుకున్నారు. విచారణ సమయంలో ఆయన నేరాన్ని అంగీకరించడం, కోర్టుకు సహకరించడం కొంత మేర శిక్ష అమలును రెండేళ్లపాటు నిలిపివేయడం వంటి పరిస్థితులకు దారితీసింది. 2012లో చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (CPC) భారీ అవినీతి నిరోధక ఉద్యమాన్ని చేపట్టింది. దాదాపు 10 లక్షల మందికిపైగా అధికారులు, సైనికాధికారి స్థాయి వారిని కూడా ఈ చర్యల్లో ఉంచారు. ఈ క్రమంలో, టాంగ్ కేసు, పార్టీ ఉద్దేశాలను, ప్రభుత్వ విధానాలను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.
ఈ ఘటనలో రెండు కీలక అంశాలను పరిశీలించవచ్చు.. ఒకటి అధికారంలో ఉన్నవారు కూడా నేరాలకు పాల్పడితే సామాజిక నమ్మకం, పాలనలో సమగ్రతను దెబ్బతీస్తుంది. రెండోది అలాంటి వారికి కట్టుదిట్టమైన శిక్ష విధించడం వల్ల ఇతర నాయకులకు గట్టి హెచ్చరికగా ఉంటుంది. చైనా పాలనలో ఈ విధంగా చర్యలు అధికార నైతికత, పారదర్శకత నిలుపుకోవడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి.