ఈ డెలివరీ బాయ్ షెడ్యూల్ వేరే లెవెల్.. సెవింగ్స్ రూ.1.42 కోట్లు!

అవును... ఓ ఫుడ్ డెలివరీ బాయ్ డబ్బుల విషయంలో, అవి సంపాదించడానికి కష్టపడే విషయంలో రాజీ పడని కమిట్మెంట్ విషయంలో ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారాడు.;

Update: 2025-12-20 18:30 GMT

చైనాలోని ఒక ఫుడ్ డెలివరీ బాయ్ రోజుకు సుమారు 13 గంటల చొప్పున వారంలోని ఏడు రోజులూ పనిచేసి.. తన వ్యక్తిగత ఖర్చులు మాగ్జిమం తగ్గించుకుని.. కేవలం ఐదు సంవత్సరాలలో 1.12 మిలియన్ యువాన్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు 1.42 కోట్ల రూపాయలు ఆదా చేశాడు. దీంతో.. ఇతడి అద్భుతమైన ఘనత ఇప్పుడు నెట్టింట ఆసక్తికరంగా, ఆదర్శవంతంగా మారింది.

అవును... ఓ ఫుడ్ డెలివరీ బాయ్ డబ్బుల విషయంలో, అవి సంపాదించడానికి కష్టపడే విషయంలో రాజీ పడని కమిట్మెంట్ విషయంలో ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారాడు. సుమారు ఐదేళ్ల పాటు అవిరామంగా వారానికి ఏడు రోజులూ పని చేశాడు.. రోజుకు 13 గంటలు పని చేశాడు. తినడానికి, నిద్రపోవడానికి మినహా మరి దేనికీ అతడు సమయం కేటాయించలేదు.

వివరాళ్లోకి వెళ్తే... పాతికేళ్ల కుర్రాడు జాంగ్ జుక్వియాంగ్ 2020లో జాంగ్ జౌ నగరంలో ఓ టిఫిన్ సెంటర్ ఓపెన్ చేశాడు. అయితే చాలా తక్కువ సమయంలోనే అది మూతబడటంతో మకాం షాంఘైకి మార్చాడు. ఆ బిజినెస్ వల్ల సుమారు 50,000 యువాన్లు.. అంటే దాదాపు రూ.6.37 లక్షలు అప్పులైపోయాడు. ఈ సమయంలో కొత్త వ్యాపారం కోసం ఓ ప్రధాన ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫామ్ లో పనిచేయడం ప్రారంభించాడు.

ఈ క్రమంలో రోజుకు సుమారు 13 గంటలు పని చేశాడు. ఇందులో భాగంగా... ఉదయం 10:40 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకూ పని చేస్తాడు. కేవలం పండగ రోజుల్లోనూ కొన్ని రోజులు మాత్రమే సెలవు తీసుకునేవాడు. ఇదే సమయంలో ప్రతీ రోజు కనీసం 8 గంటలు నిద్రపోయేవాడు. ఇలా పనిచేస్తూ నెలకు సరాసరిన 300కి పైగా ఆర్డర్లను స్థిరంగా పూర్తి చేశాడు.

ఈ విధంగా మొత్తం 3,24,000 కి.మీ. దూరాన్ని కవర్ చేశాడు. ఇతని కమిట్మెంట్, కెపాసిటీ, వర్క్ రేట్ కారణంగా సహోద్యోగులు అతని అంకితభావాన్ని గమనించి అతన్ని "గ్రేట్ గాడ్", "ఆర్డర్ కింగ్" అని పిలవడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా... కృషి, పట్టుదల వల్ల తాను సాధించిన దాని పట్ల తనకు గర్వంగా అనిపించిందని, అందుకే తన కథను ఆన్ లైన్ లో పంచుకుంటున్నట్లు జాంగ్ చెప్పారు!

ఇందులో భాగంగా... ఐదేళ్ల తర్వాత మొత్తం 1.4 మిలియన్ యువాన్లు (రూ.1.78 కోట్లు) సంపాదించిన తర్వాత.. అప్పులు తీర్చడానికి, తన రెగ్యులర్ ఖర్చులకు ఖర్చవ్వగా.. మొత్తం 1.12 మిలియన్ యువాన్లను ఆదా చేసినట్లు తెలిపాడు.

Tags:    

Similar News