ఆ ఒక్క చేప కోసం 300 డ్యామ్‌లు కూల్చేసిన చైనా..

అయితే ఈ నదిపై నిర్మించిన అనేక డ్యామ్‌లు నదీ ప్రవాహాన్ని అడ్డుకుని, జలచరాల జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి.;

Update: 2025-07-12 21:30 GMT

డ్యామ్‌లు అంటే సాధారణంగా అభివృద్ధికి చిహ్నాలుగా చూస్తాం. మన మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వాటిని "ఆధునిక దేవాలయాలు" అని వర్ణించారు. కానీ కొన్నిసార్లు ఇవే డ్యామ్‌లు ప్రకృతి సమతుల్యతను దెబ్బతీసి, పర్యావరణ వ్యవస్థలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఇటీవలి కాలంలో చైనా తీసుకున్న చర్యలు ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేశాయి.

నదుల పరిరక్షణకు సరికొత్త మార్గం

ప్రపంచంలోనే అత్యధిక జలవిద్యుత్ ఉత్పత్తి చేసే దేశాల్లో చైనా ఒకటి. అయినప్పటికీ, ప్రకృతిని పరిరక్షించేందుకు డ్యామ్‌ల నిర్మాణంపై తన విధానాన్ని పునరాలోచిస్తోంది. 2020 నుంచి ఇప్పటివరకు, చైనా దేశవ్యాప్తంగా దాదాపు 300 డ్యామ్‌లను కూల్చివేసింది. అంతేకాకుండా 373 హైడ్రోపవర్ స్టేషన్లలో, 342 చిన్న స్థాయి స్టేషన్ల కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ చర్యల వల్ల నదుల సహజ ప్రవాహం తిరిగి ఏర్పడుతోంది. అంతేకాదు అరుదైన చేప జాతులకు అనుకూలమైన జీవన వాతావరణం మళ్లీ లభిస్తోంది.

-యాంగ్జీ నది.. జీవవైవిధ్యానికి కీలకం

ఆసియాలోనే అత్యంత పొడవైన నది అయిన యాంగ్జీ, చైనాకు ఆర్థికంగా, భౌగోళికంగా ఎంతో కీలకమైనది. అయితే ఈ నదిపై నిర్మించిన అనేక డ్యామ్‌లు నదీ ప్రవాహాన్ని అడ్డుకుని, జలచరాల జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా, యాంగ్జీ స్టర్జన్ అనే అరుదైన చేప జాతి 1970ల తర్వాత క్రమంగా కనుమరుగవుతోంది. 2022లో ఈ జాతిని అంతరించే ముప్పులో ఉన్న జాతిగా గుర్తించారు.

-చిషుయ్ హే పునరుద్ధరణ.. ఒక ఆదర్శ ప్రాజెక్ట్

యాంగ్జీ నది ఉపనదుల్లో ఒకటైన చిషుయ్ హే (రెడ్ రివర్) పునరుద్ధరణలో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నదిలో అరుదైన చేపలు, ప్రత్యేకమైన జలచరాలు నివసిస్తాయి. గతంలో డ్యామ్‌ల నిర్మాణం కారణంగా కొన్ని ప్రాంతాలు ఎండిపోయి, జీవవైవిధ్యంపై ప్రతికూల ప్రభావం చూపింది. అందుకే 2023 , 2024లో యాంగ్జీ స్టర్జన్‌లను రెండు విడతలుగా ఈ నదిలోకి వదిలారు. ప్రస్తుతం అవి విజయవంతంగా జీవిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

- పర్యావరణవేత్తల ప్రశంసలు.. ఇతర దేశాలకు ఒక పాఠం

చైనా తీసుకున్న ఈ చర్యలు ప్రపంచ పర్యావరణవేత్తల ప్రశంసలను అందుకున్నాయి. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేయడం ఎంత ప్రమాదకరమో, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో చైనా ఈ నిర్ణయం ద్వారా నేర్చుకున్న పాఠం ఇప్పుడు ఇతర దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. పర్యావరణ నష్టాన్ని తగ్గించాలంటే, అభివృద్ధికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చైనా తీసుకున్న ఈ నిర్ణయాలు అభివృద్ధి, శక్తి ఉత్పత్తి కంటే ప్రకృతి, జీవవైవిధ్య పరిరక్షణకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఒకప్పుడు అభివృద్ధికి చిహ్నాలుగా భావించిన డ్యామ్‌లను కూల్చడం ద్వారా, చైనా మానవ తప్పిదాలను సరిచేసే ప్రయత్నం చేస్తోంది. ఒకే ఒక్క చేప కోసం డ్యామ్‌లను కూల్చడం అసాధారణంగా అనిపించవచ్చు, కానీ అదే చర్య ప్రకృతికి పునర్జీవం పోసే గొప్ప మార్గమని ఈ ఉదాహరణ స్పష్టం చేస్తోంది.

Tags:    

Similar News