ట్రంప్ టారిఫ్ లను ఎద్దేవా చేస్తూ చైనా ఏఐ వీడియో!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను చైనాకు చెందిన ఓ వార్తా సంస్థ వ్యంగ్యంగా విమర్శించింది.;

Update: 2025-04-06 10:25 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను చైనాకు చెందిన ఓ వార్తా సంస్థ వ్యంగ్యంగా విమర్శించింది. చిన్న దేశం, పెద్ద దేశం, మిత్ర దేశం, శత్రు దేశం అనే తేడా లేకుండా ట్రంప్ సుంకాలను పెంచడంపై చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్‌వర్క్ (CGTN) రెండు నిమిషాల 45 సెకన్ల నిడివి గల ఓ వీడియోను రూపొందించింది.

ట్రంప్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న 'విమోచన దినం' అంటే చాలా మంది అమెరికన్ల జీతాలు తగ్గించడమేనని, వారి ఖర్చులు పెంచడమేనని ఆ వీడియో ఎద్దేవా చేసింది. ట్రంప్ చర్యల వల్ల తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్లు నష్టపోయాయని గుర్తు చేసింది. సుంకల కారణంగా అమెరికన్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆ వీడియోలో చూపించారు. టారిఫ్‌ల ప్రకటన రోజును 'విమోచన దినం'గా అభివర్ణించడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాల ధరలు పెరిగిపోవడంతో పాటు వాహనాల తయారీపై సుంకల ప్రభావాన్ని కూడా ప్రస్తావించారు.

ఇదిలా ఉండగా మరో మీడియా సంస్థ కూడా ఇదే తరహాలో ఒక వీడియోను విడుదల చేసింది. అందులో ఒక కృత్రిమ మేధస్సు (AI) రోబోను 'టారిఫ్'గా చూపించారు. వాణిజ్య యుద్ధం, అశాంతికి దారి తీసే అధిక సుంకాలను భరించలేక ఆ రోబో తాను నిర్వీర్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆ వీడియోలో ఉంది.

భారత్‌తో సహా పలు దేశాలపై ట్రంప్ పరస్పర సుంకాలు విధించారు. దీని కారణంగా అమెరికాలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇది మరింత నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆర్థిక మాంద్యానికి కూడా దారితీయవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News