ఉద్యోగులకు సడన్ షాక్.. లెక్క పెట్టింది మొత్తం మీకే అంటూ ఓ సంస్థ ప్రకటన!
చైనాకు చెందిన ‘హోనాన్ కువాంగ్షాన్ క్రేన్‌కో’ సంస్థ తన వార్షిక లాభాలను ఉద్యోగులకు పంచడానికి ఒక వినూత్న పద్ధతిని ఎంచుకుంది.;
సాధారణంగా కార్పొరేట్ కంపెనీల నుంచి మెయిల్ వచ్చిందంటే చాలు.. ఎక్కడ ఉద్యోగం పోతుందో అని ఎంప్లాయిస్ వణికిపోతున్నారు. కానీ చైనాలో ఒక కంపెనీ బాస్ మాత్రం తన ఉద్యోగులకు కళ్లు చెదిరే సర్ ప్రైజ్ ఇచ్చారు. "మీరు ఎంత డబ్బు లెక్కపెడితే అంత మీదే" అంటూ టేబుళ్ల మీద నోట్ల కట్టలు కుమ్మరించారు. వినడానికి సినిమా స్టోరీలా ఉన్నా, ఇది నిజంగా జరిగిన అద్భుతం. ఈ క్రేజీ మనీ ఛాలెంజ్ వెనుక ఉన్న అసలు విషయం ఇప్పుడు చూద్దాం..
లెక్కపెట్టిన వాడు మొనగాడు:
చైనాకు చెందిన ‘హోనాన్ కువాంగ్షాన్ క్రేన్‌కో’ సంస్థ తన వార్షిక లాభాలను ఉద్యోగులకు పంచడానికి ఒక వినూత్న పద్ధతిని ఎంచుకుంది. ఆ కంపెనీ సీఈఓ కుయ్ పెనుజున్ ఏకంగా 800 టేబుళ్ల మీద వందల కోట్ల నోట్ల కట్టలను పేర్పించారు. ఉద్యోగులకు ఒక నిర్ణీత సమయం ఇచ్చి, ఆ టైమ్‌లో వారు ఎంత డబ్బు లెక్కపెట్టగలిగితే ఆ సొమ్మంతా వారికే సొంతమని ప్రకటించారు. దీంతో ఎంప్లాయిస్ అంతా ఉత్సాహంతో నోట్ల కట్టలను చకచకా లెక్కపెట్టి చేతుల్లోకి తీసేసుకున్నారు. కొంతమంది అయితే తాము లెక్కపెట్టిన డబ్బును మోయలేక సంచుల కోసం వెతుక్కున్నారంటేనే ఆ సంబరం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
236 కోట్ల పంపిణీ.. బాస్ మనసు వెన్న:
ఈ మనీ వేడుకలో ఆ సంస్థ యజమాని ఏకంగా రూ. 236 కోట్లను కంపెనీ లాభాల్లో 70 శాతం టేబుళ్లపై ఉంచారు. అంత డబ్బు పంచినా ఆయన మనసు తృప్తి చెందలేదు. పైగా ప్రతి ఉద్యోగికి అదనంగా మరో రూ. 2.44 లక్షలు బోనస్‌గా ఇచ్చారు. తన ఉద్యోగులు రకరకాల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, ఈ డబ్బు వారందరికీ ఉపశమనం కలిగిస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఇంతటితో ఆగకుండా, మహిళా దినోత్సవం సందర్భంగా 2 వేల మంది మహిళా ఉద్యోగులకు మరో రూ. 2.1 కోట్లు స్పెషల్ బోనస్‌గా ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు. ఇలాంటి బాస్ మనకి కూడా ఉంటే బాగుండు అని ప్రతి ఉద్యోగి కోరుకునేలా చేశారాయన.
నెట్టింట వైరల్.. ఇలాంటి కంపెనీలే కావాలి:
ప్రస్తుతం లేఆఫ్స్ కాలంలో ఉద్యోగులను రోడ్డున పడేస్తున్న కంపెనీలకు ఈ చైనా బాస్ ఒక ఆదర్శంగా నిలిచారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. "ఇది కదా అసలైన అప్రిసియేషన్" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. తమ కంపెనీ ఎదుగుదల కోసం రాత్రింబవళ్లు కష్టపడే ఉద్యోగులకు లాభాల్లో వాటా ఇవ్వడం ద్వారా వారిలో కంపెనీ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచవచ్చని ఈ యజమాని నిరూపించారు. కేవలం వ్యాపారమే కాకుండా, మానవత్వానికి పెద్దపీట వేసిన ఈ కంపెనీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.