ఇండియా దోచుకుందట.. మోదీ చూడ్డానికి సైలెంట్.. కానీ టఫ్.. మళ్లీ ట్రంప్ తాత మొదలెట్టాడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత మైకందుకుంటే చాలు... ఒక చేత్తో చాక్లెట్ ఇచ్చి.. మరో చేత్తో చెంపదెబ్బ కొట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత మైకందుకుంటే చాలు... ఒక చేత్తో చాక్లెట్ ఇచ్చి.. మరో చేత్తో చెంపదెబ్బ కొట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా మన భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన కురిపించిన 'ప్రశంసల వర్షం'.. విసిరిన 'వాణిజ్య బాణాలు' చూస్తుంటే అంతర్జాతీయ దౌత్యం కాస్తా 'అత్తా-కోడళ్ల సవాల్' లాగా మారిపోయింది.
మోదీ రూటే వేరు.. 12 ఏళ్ల 'సైలెంట్' సింహం!
ట్రంప్ తాతగారికి భారతదేశ చరిత్రపై అకస్మాత్తుగా అపారమైన జ్ఞానం వచ్చేసింది. "నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా భయ్యా... ఇండియాలో పొద్దున ఒకరు ప్రధానమంత్రి అయితే.. సాయంత్రానికి ఇంకొకరు వచ్చేవాడు. ఆరు నెలలు ఒకరు, ఏడాది ఒకరు... కుర్చీలాట ఆడేవారు. కానీ మన మోదీ వచ్చాక సీన్ మారింది. 12 ఏళ్లుగా అక్కడే పాతుకుపోయారు" అంటూ భలే విశ్లేషించారు. అంతటితో ఆగకుండా మోదీ గారి పర్సనాలిటీపై ట్రంప్ ఇచ్చిన సర్టిఫికేట్ చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. "ఆయన పైకి చాలా ప్రశాంతంగా.. యోగిలా కనిపిస్తారు కానీ... అస్సలు ప్రశాంతమైన వ్యక్తి కాదు బాబోయ్.. చాలా కఠినమైనోడు. లోపల గట్టి 'మెటీరియల్' ఉంది" అంటూ మోదీ గారిని ఒక రేంజ్‌లో పొగిడేశారు. ప్రపంచమంతా కొట్టుకు చస్తున్నా.. భారత్‌ను మాత్రం సేఫ్‌గా ఉంచారంటూ కితాబిచ్చారు. బహుశా ట్రంప్ ఉద్దేశంలో 'ప్రశాంతత' అంటే ట్విట్టర్‌లో రోజుకు వంద ట్వీట్లు చేయకపోవడమే కాబోలు..
"ఇండియా మమ్మల్ని దోచేసింది.. కానీ తప్పు మాదేలే!"
కథ ఇక్కడితో అయిపోతే అది ట్రంప్ ఎందుకవుతారు? వెంటనే తన అసలు రంగు బయటపెట్టారు. "అయినా ఈ ఇండియా ఉందే... గతంలో మమ్మల్ని వాణిజ్యం పేరుతో పిప్పి పిప్పి చేసి బాగా దోచేసింది" అంటూ పాత ఏడుపు ఎత్తుకున్నారు. అమెరికాను దోచుకోవడానికి ఇండియా ఏమైనా ఈస్టిండియా కంపెనీ పెట్టిందా అని మనవాళ్లు ముక్కున వేలేసుకునే లోపే... ట్రంప్ రూట్ మార్చారు. "అయినా ఇందులో ఇండియా తప్పేం లేదు. వాళ్ల దేశ ప్రయోజనాల కోసం వాళ్లు గట్టిగా నిలబడ్డారు. తప్పు మా పాత అమెరికా లీడర్లదే.. వాళ్లంతా అమాయకులు, అసమర్థులు. ఇండియా స్మార్ట్‌గా ప్లాన్ చేసి మనల్ని వాడేసుకుంది" అంటూ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. అంటే "మావాళ్లు చేతకాని దద్దమ్మలు కాబట్టే ఇండియా మా జేబులు కత్తిరించింది" అని ట్రంప్ గారు ఒప్పుకున్నారన్నమాట!
'సమతుల్య' వ్యాపారం!
చివరగా "ఇప్పుడైతే అంతా సవ్యంగా ఉంది, ఇరు దేశాల మధ్య వ్యాపారం న్యాయంగా జరుగుతోంది" అంటూ మోదీని మళ్లీ 'గొప్ప నాయకుడు' అని ముగించారు.
మొత్తానికి ట్రంప్ మాటల సారాంశం ఏంటంటే "నువ్వు నన్ను దోచుకున్నా పర్లేదు బ్రదర్.. నువ్వు స్ట్రాంగ్ లీడర్‌వి, నీతో నాకు ఫ్రెండ్‌షిప్ ముఖ్యం" అన్నట్టుంది.. ఇలాంటి 'స్వీట్ అండ్ సాల్ట్' కామెంట్లు విన్నాక మన విదేశాంగ శాఖ నవ్వాలో, ఏడ్వాలో లేక ట్రంప్ తాతకు మరోసారి 'నమస్తే ట్రంప్' అంటూ హారతి పట్టాలో అర్థం కాక బుర్రలు గోక్కుంటోంది..