బాల్ థాక్రే పులి...ఉద్ధవ్ మాత్రం బేల !

బాల్ థాక్రే మరాఠా యోధుడిగా కీర్తి గడించారు. పోటీ చేయకుండానే మహారాష్ట్ర రాజకీయాలను శాసించారు.తన పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా చక్రం తిప్పారు. ఆయన పార్టీ గుర్తు బాణం.

Update: 2026-06-20 03:55 GMT

బాల్ థాక్రే మరాఠా యోధుడిగా కీర్తి గడించారు. పోటీ చేయకుండానే మహారాష్ట్ర రాజకీయాలను శాసించారు.తన పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా చక్రం తిప్పారు. ఆయన పార్టీ గుర్తు బాణం. శివసేన పేరుతోనే పులి బొమ్మ కూడా ఉంటుంది. అలా పులిలా బాల్ థాక్రే తన జీవితాన్ని గడిపారు. 1966లో ఆయన పార్టీని స్థాపించారు. 2012లో కన్నుమూసేంతవరకూ ఆయన మహారాష్ట్ర రాజకీయ వీరుడిగానే కీర్తిని అందుకున్నారు.

అంతా ఆయన వద్దకే :

బాల్ థాక్రే ఏ రోజూ ముంబై గడప దాటి బయటకు రాలేదు. ఢిల్లీ వచ్చి పెద్ద నేతలను కేంద్ర ముఖ్యులను కలసినది అంతకంటే లేదు, ఆయన అవసరం ఉంది అనుకున్న వారు నేరుగా ముంబైలోని ఆయన నివాసానికే వచ్చేవారు. బీజేపీ పెద్దలు కూడా అలాగే వచ్చి ఎన్నికల పొత్తులు ఒప్పందాలు చేసుకునేవారు. ఈ పొత్తులలో కూడా సింహభాగం శివసేనదే. అలాగే 1995లో తొలిసారిగా శివసేన అధికారం చేపట్టింది. అయితే బాల్ థాక్రే గతించాక మొత్తం శివసేనలో సీన్ మారిపోయింది. ఆయన కుమారుడు ఉద్ధవ్ థాక్రే పార్టీ నాయకత్వం బాధ్యతలు అందుకున్నారు కానీ తండ్రి మాదిరిగా పులిలా వ్యవహరించలేకపొయారు అని అంటారు. ఫలితంగా బీజేపీది పైచేయి అయింది. 2014లో కూడా బీజేపీ ఎక్కువ సీట్లు కోరింది. కానీ శివసేన నో చెప్పడంతో వేరేగా పోటీ చేసి గెలిచింది. ఇలా వేరుగా గెలిచిన తరువాత కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ శివసేన తొలిసారి జూనియర్ పార్టనర్ అయింది. 2019లో కలసి పోటీ చేసినా ఈ పొత్తు చిత్తు అయింది. దానికి ఉద్ధవ్ థాక్రే రాజకీయ వ్యూహాలు తప్పులు తడకలుగా ఉండడమే కారణం అని అంటారు.

సిద్ధంతం మరచి :

ఇక బాల్ థాక్రే ఏనాడూ కాంగ్రెస్ తో కలిసి పోలేదు. ఆయన జీవితాంతం కాంగ్రెస్ ని వ్యతిరేకించారు. కానీ 2019లో మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచి సీఎం సీటు కోరిన ఉద్ధవ్ థాక్రే బీజేపీ నో చెప్పడంతో కాంగ్రెస్ ఎన్సీపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 19 నెలల పాటు సీఎం గా ఉన్నారు. అలా పార్టీ ఫిలాసఫీని గంగలో కలిపిన కారణంగానే శివసేనలో ఉద్ధవ్ వీక్ అయిపోయారు. ఏక్ నాధ్ షిండే పుట్టుకొచ్చి పార్టీని నిలువునా చీల్చి పారేశారు. ఇక 2024 ఎన్నికల్లో కూడా ఉద్ధవ్ థాక్రే శివసేనకు 9 మంది ఎంపీలు గెలిస్తే షిండే శివసేనకు ఏడుగురు గెలిచి వచ్చారు. ఇపుడు ఉద్ధవ్ శివసేన నుంచి ఏకంగా ఆరుగురు ఎంపీలు షిండే సేనలోకి జంప్ చేస్తున్నారు. ఇది ఉద్ధవ్ థాక్రేకి అతి పెద్ద షాక్ గా అంతా విశ్లేషిస్తున్నారు.

ముగ్గురు మాత్రమే వెంట :

తాజాగా ఉద్ధవ్ థాక్రే తన పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహిస్తే హాజరైంది తొమ్మిది మందికి గానూ ముగ్గురు మాత్రమే. వారే అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజాభౌ వాజే. ఇక మిగిలిన ఆరుగురు ఎంపీలు సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, నగేష్ పాటిల్ అష్టికర్, ఓంరాజే నాయక్ నింబాల్కర్, సంజయ్ జాదవ్, భావ్‌సాహెబ్ పార్టీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించి పార్లమెంటరీ సమావేశానికి గైర్హాజరయ్యారు. వీరంతా ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేనలో చేరుతారు అని అంటున్నారు. వీరి ఉద్ధవ్ మీద నిప్పులు చెరుగుతున్నారు. శివసేనను కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు చూస్తున్నారు అని మండిపడుతున్నారు. అయితే అలాంటిది ఏమీ లేదని బాల్ థాక్రే ఆశయాల కోసమే తాను పాటు పడుతాను అని ఉద్ధవ్ థాక్రే చెబుతున్నారు.

పార్టీ పదవిని వదులుకుంటా :

ఇక ఈ సమావేశంలో ఉద్ధవ్ థాక్రే భావొద్వేగంగా ప్రసంగించారు. తాను అవసరం అయితే శివసేన అధ్యక్ష పదవిని వదులుకుంటాను అని కూడా చెప్పారు. తన మీద నమ్మకం లేకపోతే తాను తప్పుకుంటాను అని పార్టీలో మరొకరిని ఎన్నుకోవాలని కోరారు. అంతే కానీ పార్టీని ఇబ్బందుల పాలు చేయవద్దు అని అంటున్నారు. అయితే ఉద్ధవ్ థాక్రే మాటలను ఎవరు వింటారు అన్నదే ప్రశ్న. ఆయన ఏ సందర్భంలోనూ నాయకత్వ లక్షణాలను సక్రమంగా ప్రదర్శించలేకపోయారు అన్నదే పార్టీని వీడుతున్న వారి విమర్శ. ప్రస్తుతం పార్టీలో ఉన్న వారు కూడా అసంతృప్తిగానే ఉన్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే పులి కడుపున పులి పుట్టదు అని ఉద్ధవ్ థాక్రే తన రాజకీయ ప్రయాణంలో నిరూపిస్తున్నారా అంటే జరుగుతున్నది అదే అంటున్నారు. ఏది ఏమైనా ఉద్ధవ్ థాక్రే కష్టాలు అన్నీ ఇన్నీ కావనే అంటున్నారు.

Tags:    

Similar News