ఫామ్ హౌస్ లో పాముతో ఆట.. వ్యాపారి మృతి

ఈ సంఘటన నేర్పే పాఠం ఏమంటే.. తాము చేసే పనులు తమను మాత్రమే కాదు.. తమ మీద ఆధారపడిన వారిని ఎంతటి నష్టాన్ని కలిగిస్తాయన్న విషయాన్ని స్పష్టం చేస్తాయి.

Update: 2026-06-20 07:15 GMT

పాము చిన్నదే కావొచ్చు. దానికి ఉండే విషం అత్యంత ప్రమాదకరమైనది. చిన్నపాము అయినా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెత.. వేరే సందర్భానికి సూట్ అయ్యేలా చెప్పినా.. తాజా విషాద ఉదంతాన్ని చూసినప్పుడు విషసర్పాలు సైజులో చిన్నగా ఉన్నా.. పెద్దగా ఉన్నా.. ప్రాణం పోయే ప్రమాదం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. పాముల గురించి పూర్తి అవగాహన ఉన్న వారు మాత్రమే ఏ పాములో విషం ఉంటుంది? దేనిలో ఉండదు? సదరు పాము కాటేసినా ప్రమాదం ఉండదన్న విషయాన్ని చెప్పగలుగుతారు. సాదాసీదా వ్యక్తులకు ఆ అవగాహన ఉండదు. అదే సమయంలో మితిమిరీన ఆత్మవిశ్వాసం ప్రాణాలు పోయే పరిస్థితిని తెస్తుంది. ఇందుకు తగ్గట్లే హైదరాబాద్ కు చెందిన ఒక యువ వ్యాపారి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో సన్నిహితులతో వెళ్లి.. అక్కడ కనిపించిన ఒక చిన్న పాముతో ఆడిన ఆటలు అతడి ప్రాణాలు పోయేలా చేయటమే కాదు.. అతడ్నే నమ్ముకున్న భార్య.. ముగ్గురు పిల్లల భవిష్యత్తు మీద ఎప్పటికి తొలగని అనిశ్చితికి గురి చేసేలా చేశారు.

ఈ సంఘటన నేర్పే పాఠం ఏమంటే.. తాము చేసే పనులు తమను మాత్రమే కాదు.. తమ మీద ఆధారపడిన వారిని ఎంతటి నష్టాన్ని కలిగిస్తాయన్న విషయాన్ని స్పష్టం చేస్తాయి. అయ్యో అనిపించే ఈ విషాద ఉదంతం సోషల్ మీడియాలో ఒక చిట్టి వీడియో వైరల్ గా మారి.. పలువురిని షాక్ కు గురి చేసింది. సోషల్ మీడియా రిపోర్టర్ ఇమ్రాన్ అనే వ్యక్తి ‘జోక్ గాన్ రాంగ్’ (ప్రాణం తీసిన సరదా) శీర్షికతో చేసిన చిన్న వీడియో వైరల్ గా మారింది. ఒక మధ్య వయస్కుడు పాముతో ఆటలు ఆడటం.. అది కాటు వేయటంతోకాసేపటికి ప్రాణాలు కోల్పోయిన వైనాన్ని పేర్కొన్నారు.

సదరు వీడియోలో ఒక యువకుడు పాముతో ఆటలు ఆడుతూ.. పాములంటే తనకు ఏ మాత్రం భయం లేదన్న విషయాన్ని చెప్పే ప్రయత్నంలో.. తన చుట్టూ ఉన్న సన్నిహితులను ఆ చిన్ని పాముతో భయపెట్టే ప్రయత్నం చేసిన వైనం కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆ చిన్న పాము కాటేయటం.. అదేమాత్రం ప్రమాదకరం కాదన్నట్లుగా వదిలేయటం.. దాని విషం ఆటలు ఆడిన వ్యక్తి శరీరంలోకి చేరి.. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారటంతో హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆలస్యం కావటం.. ప్రాణాలు కోల్పోయిన వైనం షాక్ కు గురి చేస్తుంది.

సోషల్ మీడియా రిపోర్టుతో పాటు స్థానిక పోలీసు అధికారుల అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే.. హైదరాబాద్ లోని లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల సయ్యద్ ఖుమైజ్ మొహిద్దీన్ హుస్సైనీ వ్యాపారం చేస్తుంటాడు. తాజాగా వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండలం పరిధిలోని ఒక ఫాంహౌస్ కు సన్నిహితులు.. స్నేహితులతో కలిసి వెళ్లారు. గురువారం తెల్లవారుజాము ప్రాంతంలో వాష్ రూమ్ కు వెళ్లటానికి బయటకు వచ్చిన అతడికి అక్కడో చిన్న పాము కనిపించింది.

దాన్ని సరదాగా పట్టుకొని.. ఆడుకుంటూ.. చుట్టు ఉన్న సన్నిహితుల దగ్గరకు తీసుకొస్తూ భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సదరు పాము అతడి కుడిచేతి బొటనవేలిని గట్టిగా కాటేసింది. కొన్ని జాతి విషసర్పాలు కాటేసినప్పుడు పెద్దగా నొప్పి ఉండదు. కానీ.. దాని విషం మాత్రం ప్రమాదకరంగా శరీరంలోకి చేరి ప్రాణాలు తీసే వరకు వెళుతుంది. తాజా ఉదంతంలోనూ అదే జరిగింది.

పాము కాటు వేసిన తర్వాత అతడి స్నేహితులు వారించే ప్రయత్నం చేసినా.. నొప్పి లేకపోవటంతో సీరియస్ గా తీసుకోలేదు. కాసేపటికి అతడి శరీరంలో మార్పులు రావటంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు.అయితే.. అప్పటికే పాము విషం శరీరంలోకి బాగా చేరిపోవటంతో అతడి ప్రాణాల్ని వైద్యులు కాపాడలేకపోయారు. బాధితుడికి భార్య.. ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. పాము లాంటి విష సర్పాల విషయంలో తెలిసి తెలియన ఆడే ఆటలు ప్రాణాలు తీస్తాయన్న విషయాన్ని మర్చిపోకూడదని తాజా విషాద ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి.

Tags:    

Similar News