సాయికృష్ణ అదృశ్యం: రాజకీయ వివాదాల వేళ చంద్రబాబు కీలక నిర్ణయం!

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఉదంతం కీలక మలుపు తిరిగింది.

Update: 2026-06-20 05:59 GMT

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఉదంతం కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ప్రత్యేక విచారణకు ఆదేశించింది. అంతేకాకుండా బాధితులను పిలిపించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పోలీసులపై తీవ్ర విమర్శలు చేస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా జోక్యం చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుందని అంటున్నారు.

సాయికృష్ణ అదృశ్యంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకున్నారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, ఆయన మేనమామలను తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తన కుమారుడి అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాలని, నిజమైన దోషులను గుర్తించి న్యాయం చేయాలని విజయలక్ష్మి ముఖ్యమంత్రిని కోరారు. ఆమె ఆవేదనను విన్న చంద్రబాబు, ఘటనపై నిష్పక్షపాతంగా, పారదర్శకమైన దర్యాప్తు జరిపిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. బాధితులకు ధైర్యం చెబుతూ, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం రాజకీయ వివాదంగా మారడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సాయికృష్ణ అదృశ్యం వెనుక పోలీసుల హస్తం ఉందని, ఇది లాకప్ డెత్ అని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో కుల ప్రస్తావన తెరపైకి రావడంతో ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి మరింత పెరిగింది. ఇదే అంశంపై స్పందించిన ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, గురువారం సాయంత్రం సాయికృష్ణ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.

ప్రతిపక్షం తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న తరుణంలో, ముఖ్యమంత్రి స్వయంగా బాధితులను పిలిపించి మాట్లాడటం రాజకీయంగా కీలక మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భేటీ తర్వాత బాధితులు కూడా సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. "ముఖ్యమంత్రి మా సమస్యను సావధానంగా విన్నారు. సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పిలిపించి మాట్లాడటం మాకు కొంత ఊరటనిచ్చింది, మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉంది" అని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పేర్కొన్నారు.

Tags:    

Similar News