నో టికెట్‌.. చెన్నమనేని రమేశ్‌ కొంప ముంచింది అదేనా?

రమేశ్‌ పౌరసత్వం వివాదం కోర్టులో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా కోర్టు ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది.

Update: 2023-08-21 14:51 GMT

తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటించిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్లో అత్యంత దురదృష్టవంతుడు ఎవరంటే చెన్నమనేని రమేశ్‌ పేరే వినిపిస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి ఆయన పౌరసత్వం వివాదం వ్యవహారంలో కూరుకుపోయారు. కోర్టుల్లో ఆయనపై ప్రత్యర్థులు కేసులు కూడా వేశారు. వాటిపై ప్రస్తుతం విచారణ సాగుతోంది.

చెన్నమనేని రమేశ్‌ కు భారత పౌరసత్వంతోపాటు జర్మనీ పౌరసత్వం కూడా ఉందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. వేరే దేశం పౌరసత్వం ఉంటే ఆటోమేటిగ్గా భారత పౌరసత్వం పోతుంది. ఈ పరిస్థితుల్లో ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉంది కాబట్టి ఆయన భారత పౌరుడు కాదని.. భారత పౌరుడే కానప్పుడు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారని ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వేములవాడలో చెన్నమనేని రమేశ్‌ కు సీటు దక్కలేదు. ఆయనకు బదులుగా చెల్మెడ లక్ష్మీ నరసింహారావుకు సీటు లభించింది.

దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ బాబుకు ఆశాభంగం వెనక అసలు కారణం ఆయన పౌరసత్వ వివాదమేనని స్ఫష్టం అయింది. సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రమేష్‌ బాబు బలమైన వ్యక్తే కానీ ఆయన పౌరసత్వ వివాదంపై తుది తీర్పు వచ్చే అవకాశం ఉన్నందున అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టి వేరే వారికి కేటాయించామన్నారు.

కాగా 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన చెన్నమనేని రమేష్‌ బాబు మొదట టీడీపీ తరపున పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. 2010లో టీడీపీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు. ఇలా 2014లోనూ, 2018 ఎన్నికల్లోనూ ఆ పార్టీ తరఫున గెలుపొందారు. మొత్తం నాలుగుసార్లు వరుసగా విజయం సాధించారు. ఈసారి మాత్రం ఆయనకు సీటే దక్కలేదు.

Read more!

రమేశ్‌ పౌరసత్వం వివాదం కోర్టులో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా కోర్టు ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. దీంతో వేములవాడ అభ్యర్థిగా రమేష్‌ బాబుకు సీటు ఇచ్చినా.. ఆయన వచ్చే ఎన్నికల్లో గెలుపొందినా.. కోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే ఆయన పదవి పోతుంది. రెండో స్థానంలో నిలిచిన ప్రత్యర్థి పార్టీ వ్యక్తి ఎమ్మేల్యే అవుతారు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా రమేశ్‌ కు సీటు ఇవ్వలేదని అంటున్నారు.

కాగా రమేష్‌ బాబు ప్రస్తుతం జర్మనీ లో ఉన్నారు. ఆయన చేసిన ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రజల ఆత్మాభిమానం కాపాడాలన్నారు.

"రాజకీయాలు ప్రజల కోసమే చేయాలి. పదవుల కోసం కాదు. మా తండ్రిగారి మాటలను ప్రతిసారి స్మరించుకుంటూ ఆ పనిని నా తుది శ్వాస ఉన్నంతవరకు చేస్తా. నాతో ఉన్నవారందరికి భరోసా ఇస్తున్నాను . దయ చేసి నిర్ణయాలు మా అందరితో సంప్రదించి మా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తీసుకోవాలి. లేనిపక్షంలో ఆత్మాభిమానాలు దెబ్బతింటాయి. ప్రజల ఆమోదం లభించదు. ఇది మనందరం తెలంగాణ ఉద్యమంలో నేర్చుకున్న మొదటి పాఠం." అంటూ కేసీఆర్‌ టికెట్లు ప్రకటించేముందు చెన్నమనేని రమేశ్‌ ట్వీట్‌ చేశారు. అయినా సరే ఆయనకు కేసీఆర్‌ షాక్‌ ఇచ్చారు.

Tags:    

Similar News