చిరుత కాదు.. ఎలుగుబంటి అవ్వొచ్చు అంటున్న డి.ఎఫ్.ఓ!

దాడి చేసింది చిరుతా లేక ఎలు బంటా అన్నది పోస్టుమార్టం రిపోర్టు వస్తే నిర్ధారణ అవుతుందని తెలిపారు.

Update: 2023-08-12 11:37 GMT

తిరుమలలో అలిపిరి నడక మార్గంలో జరిగిన ఘోర ఘటన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బాలిక మృతి చెందింది. అయితే ఈ సమయంలో బాలికపై దాడి చేసి, ఆమె చావుకు కారణమైంది చిరుత పులా, ఎలుగుబంటా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఈ విషయాలపై తాజాగా డి.ఎఫ్.ఓ. స్పందించారు.

అవును... బాలికపై చిరుత దాడికి పాల్పడిన ఘటనపై డీ.ఎఫ్‌.ఓ సతీష్‌ కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన... దాడి చేసింది చిరుతా లేక ఎలు బంటా అన్నది పోస్టుమార్టం రిపోర్టు వస్తే నిర్ధారణ అవుతుందని తెలిపారు. దాడి చేసిన జంతువును బంధించేందుకు బేస్‌ క్యాంప్‌ ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జంతువుల కదలికలను గుర్తించేందుకు ట్రాప్‌ కెమెరాలతో పాటు డ్రోన్‌ కెమెరాలు వినియోగిస్తామని తెలిపిన ఆయన... ఎలుగుబంటి అయితే మత్తు ద్వారా బంధిస్తామని, చిరుత అయితే బోన్‌ ద్వారా బంధిస్తామని తెలిపారు. ఇదే సమయంలో 7వ మైలు రాయి నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్‌ జోన్‌ గా ప్రకటిస్తున్నామని అన్నారు.

కాగా తిరుమలలోని అలిపిరి కాలి బాటలో ఆరేళ్ల చిన్నారిపై అడవీ జంతువు దాడి చేసిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం చెందిన దినేష్ కుమార్, శశికళ ల కుమార్తె లక్షిత అలిపిరి కాలిబాటలో కనిపించకుండా పోయింది. చిరుత దాడిని గుర్తించని తల్లిదండ్రులు.. నడకదారిలో చిన్నారి కోసం వెతగ్గా దొరకలేదు.

Read more!

లక్షిత తప్పిపోయిందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రాత్రి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం నడక దారిలో లక్షిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

మరోపక్క ఈ ఘటనపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి బాధాకరమని అన్నారు. అలిపిరి నడకమార్గం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేతపై ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోపక్క నడక దారిలో ప్రతి 40 అడగులకు సెక్యూరిటీ ఉండే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags:    

Similar News