17 ప్రాణాల కోసం వీరోచితాలు.. విషాద గాథలు

భాగ్యనగరంలోని పాతబస్తీ, చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.;

Update: 2025-05-19 06:34 GMT

భాగ్యనగరంలోని పాతబస్తీ, చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనకు సంబంధించి వెలుగులోకి వస్తున్న హృదయ విదారక కథనాలు స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ప్రమాదం జరిగిన తీరు, ఆ సమయంలో స్థానికులు, ఓ కుటుంబ సభ్యుడు చేసిన సాహసాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

గుల్జార్ హౌస్ సమీపంలో మంటలు చెలరేగిన సమయంలో, ప్రాతఃకాల ప్రార్థనల అనంతరం మసీదు నుంచి వస్తున్న ఐదుగురు యువకులు పొగలను గుర్తించారు. చుట్టుపక్కల భవనాల్లో మంటలు వ్యాపిస్తున్నాయని గ్రహించిన వారు, తమ ప్రాణాలను లెక్కచేయకుండా సహాయక చర్యల కోసం ముందుకు ఉరికారు. గాజుల వ్యాపారి మీర్ జాహెద్, మహ్మద్ అమేర్, మహ్మద్ ఇబ్రహీంతో పాటు మరో ఇద్దరు యువకులు మంటలు వస్తున్న భవనం వైపు దూసుకెళ్లారు.

భవనంలో చిక్కుకున్న ఇద్దరు మహిళల ఆర్తనాదాలు విన్న ఆ యువకులు ఏమాత్రం సంకోచించకుండా భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దట్టమైన పొగ అలుముకున్నప్పటికీ, ముఖాలకు గుడ్డలు కట్టుకుని భవనం గ్రిల్స్‌ను పగలగొట్టి లోపలికి వెళ్లారు. లోపల వారికి ఎదురైన దృశ్యాలు అత్యంత భయానకంగా ఉన్నాయి. అప్పటికే ఒక వ్యక్తి విగతజీవిగా పడి ఉండగా, ఓ మహిళ తన పిల్లలను ఒడిలో పెట్టుకుని ప్రాణాలు కోల్పోయి కనిపించింది.

ఈ హృదయవిదారక దృశ్యాలు చూసినప్పటికీ, ఆ యువకులు ధైర్యం కోల్పోలేదు. వారికి కనిపించిన వారిని బయటకు తీసుకురావడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారు మొత్తం 13 మందిని మంటల నుంచి వెలుపలికి తీసుకువచ్చారు. అయితే, వారంతా అప్పటికే ఊపిరాడక మరణించి ఉన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణాలను పణంగా పెట్టి ఆ యువకులు చేసిన సాహసం ఫలించలేదు. వారికి ఆక్సిజన్ మాస్కులు లేదా ఇతర సహాయక పరికరాలు అందుబాటులో ఉండి ఉంటే, బహుశా కొన్ని ప్రాణాలను కాపాడగలిగేవారని స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. వారి ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది.

ఇదిలా ఉండగా, ఈ ప్రమాదంలో మరణించిన ఇంటి పెద్ద ప్రహ్లాద్ మోదీ సోదరుడి కుమారుడు అభిషేక్ మోదీ అసమాన ధైర్యం ప్రదర్శించి వీర మరణం పొందారు. మంటలు చెలరేగగానే అప్రమత్తమైన అభిషేక్, సమీపంలో ఉన్న తన బంధువులతో కలిసి భవనం నుంచి బయటపడ్డారు. అయితే, భవనంలో మరింత మంది బంధువులు చిక్కుకున్నారని తెలిసి, వారిని కాపాడాలనే తపనతో తిరిగి లోపలికి వెళ్లారు. ఈ క్రమంలో తన సోదరి ఇద్దరు పిల్లలతో పాటు మరో బంధువును సురక్షితంగా బయటకు పంపగలిగారు. దురదృష్టవశాత్తు, వారిని కాపాడే ప్రయత్నంలో అభిషేక్ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. బంధువుల ప్రాణాల కోసం తన ప్రాణాన్నే అర్పించిన అభిషేక్ త్యాగం స్థానికులను కలచివేసింది.

ఈ అగ్ని ప్రమాదం పాతబస్తీలో తీవ్ర విషాదాన్ని నింపింది. క్షణాల్లోనే అన్నీ కోల్పోయిన బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటాయి. సమయానికి సహాయక చర్యలు అంది ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన భవనాల్లో అగ్ని భద్రతా ప్రమాణాల ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసింది.

Tags:    

Similar News